Gujarat assembly elections 2022 : 5ఏళ్లల్లో ఎన్నో 'రాజకీయాలు'.. ఈసారి ఫలితమేంటి?
Gujarat assembly elections 2022 : 2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తగ్గింది, కాంగ్రెస్‌కు ఊహించని విధంగా సీట్లు వచ్చాయి. ఈ పరిణామాలకు అనేక కారణాలు ఉన్నాయి. మరి ఇప్పటి పరిస్థితేంటి? ఆప్ ఎంట్రీతో బీజేపీ, కాంగ్రెస్‌కు నష్టం తప్పదా?
Gujarat assembly elections 2022 : గుజరాత్లో 'ఎన్నికల వార్' ఎప్పుడూ వన్ సైడే! ఇక్కడ ఎన్నో ఏళ్లుగా బీజేపీదే ప్రభుత్వం. కానీ గత ఎన్నికలను పరిశీలిస్తే.. కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తాయి. 2017 ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గాయి, కాంగ్రెస్‌కు పెరిగాయి. మరి ఇప్పటి పరిస్థితేంటి? అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అంతేకాకుండా ఆప్ ఎంట్రీతో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. 2017కు 2022 ఎన్నికలకు మధ్య ఎన్నో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. వాటిని ఓసారి పరిశీలిద్దాము..
2017 ఫలితాలు ఇలా..
గుజరాత్లో మొత్తం 182 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో.. ఇక్కడ బీజేపీ 99 సీట్లల్లో గెలిచింది. 27ఏళ్ల నుంచి బీజేపీ.. రాష్ట్రాన్ని పాలిస్తున్నప్పటికీ.. 1995 తర్వాత ఇంత తక్కువ సీట్లు రావడం ఇదే తొలిసారి. అదే సమయంలో.. కాంగ్రెస్‌కు 77 స్థానాలు దక్కాయి. 1985 తర్వాత ఈ స్థాయి ప్రదర్శన.. కాంగ్రెస్‌కు ఇదే మొదటిసారి.
ఈసారి రెండు దఫాల్లో డిసెంబర్ 1,5న పోలింగ్ జరగనుంది.
Gujarat assembly elections 2017 results : కానీ.. 2017 ఎన్నికల నుంచి ఇప్పటికీ.. సమీకరణలు చాలా మారిపోయాయి. పార్టీ ఫిరాయింపులు, ఉప ఎన్నికలు వంటి పరిణామాలతో అసెంబ్లీలో బీజేపీ బలం 111కి చేరింది.
2017 ఎన్నికలన్నీ వీటి చుట్టూనే..!
2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు పటీదార్ల నిరసనల చుట్టే సాగాయి.!విద్యాసంస్థల్లో, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ పటీదార్లు పెద్ద ఎత్తున్న ఉద్యమం చేపట్టారు. ఆ సమయంలో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది.
గుజరాత్లో వ్యాపారులు ఎక్కువగా ఉంటారన్న విషయం తెలిసిందే. జీఎస్టీ అమలుతో.. వీరికి ఊహించని విధంగా నష్టాలు వాటిల్లినట్టు అప్పట్లో ప్రచారాలు జరిగాయి. ఫలితంగా అనాదిగా అధికారంలో ఉన్న బీజేపీపై వ్యతిరేకత పెరిగింది.
Gujarat assembly elections 2022 date : ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు.. కాంగ్రెస్ మెరుగైన ప్రదర్శన చేయడానికి పలు కారణాలు ఉన్నాయి. హార్దిక్ పటేల్, అల్పేష్ థకోరే, జిగ్నేష్ మేవాని రూపంలో కాంగ్రెస్‌కు యువ రక్తం దొరికింది. ఎన్నికలను వీరు.. భుజాలపై మోసుకుని ముందుకెళ్లారు.
పటీదార్ల ఉద్యమాన్ని ముందుండి నడిపించిన నేతగా పేరు తెచ్చుకున్నారు హార్దిక్ పటేల్. రాష్ట్రంలో పటీదార్ల జనాభా చాలా ఎక్కువగా ఉంటుంది. రిజర్వేషన్ల కోసం 2015 నుంచి భారీ ఎత్తున ఉద్యమాలు జరిగాయి. వీటి మధ్య.. పటేల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.
కానీ ఐదేళ్లల్లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. హార్దిక్ పటేల్‌తో పాటు అల్పేష్.. బీజేపీలో చేరిపోయారు. మేవానీ.. కాంగ్రెస్‌లోనే ఉన్నా.. ఆయన పట్టు.. రాష్ట్రంలోని 6.74శాతం జనాభా కలిగిన దళితులపైనే అని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.
ఇప్పటి పరిస్థితులేంటి..?
gujarat assembly elections BJP : 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పటీదార్ల ఉద్యమం ఊసే లేదు! జీఎస్టీని వ్యాపారులు జీర్ణించేసుకున్నారు. ఫలితంగా.. నాడు అత్యంత కీలకంగా ఉన్న ఈ విషయాలు.. ఇప్పుడు అటకెక్కేశాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలు ఇప్పుడు కీలకంగా మారాయి.
ఇక ప్రభుత్వ వ్యతిరేకను అణచివేసేందుకు బీజేపీ చర్యలు చేపట్టింది. గతేడాది.. సీఎం పదవి నుంచి విజయ్ రూపానీని తప్పించి, ఆ బాధ్యతలను భూపేంద్ర పటేల్‌కు అప్పగించింది. కేబినెట్ మొత్తాన్నీ మార్చేసింది. మరో అడుగు ముందుకేసి.. ప్రభుత్వ వ్యతిరేకతను తగ్గించేందుకు.. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో 30శాతం మందిని ఈసారి వదిలించుకనే ప్రయత్నంలో కమలదళం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
gujarat assembly elections Congress : ఇదిలా ఉండగా.. 2017లో మెరుగైన ప్రదర్శన చేసిన కాంగ్రెస్.. అక్కడి నుంచి పార్టీని బలోపేతం చేసుకోవడంలో చతికిల పడింది. చాలా మంది కీలక నేతలు పార్టీని వదిలేశారు. ఐదేళ్లల్లో.. 16మంది కాంగ్రెస్ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇది పార్టీకి నష్టమే అని పలువురు అంటున్నారు.
కానీ కాంగ్రెస్ వాదన మాత్రం మరో విధంగా ఉంది. మూడు నెలల్లో.. రాష్ట్రంలోని 80శాతం ఇళ్లకు కాంగ్రెస్ కార్యకర్తలు చేరారని, ఈసారి గెలుపు తమదేనని చెబుతోంది. ఇందుకు ఆధారాలు ఉన్నాయా? అంటే మాత్రం మౌనంగా ఉండిపోతోంది.
ఆప్ ఎంట్రీ.. మార్పు తప్పదా?
గుజరాత్లో అధికారం.. అనాదిగా బీజేపీదే. కానీ ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉంది. పోటీ ఎప్పుడూ ఈ రెండు పార్టీల మధ్యే జరిగేది. కానీ ఇప్పుడు ఎన్నికల యుద్ధంలోకి ఆమ్ ఆద్మీ ఎంట్రీ ఇచ్చింది. 'తగ్గేదే' అన్న రేంజ్లో ప్రచారాలు చేస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్. ఆగస్టు నుంచి నెలకు రెండుసార్లు చొప్పున ఇప్పటికే ఎన్నోసార్లు గుజరాత్లో పర్యటించారు. ఉచితాల హామీలతో ప్రజలకు ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గెలుపు తమదేనని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అంటున్నారు.
Gujarat AAp : ఆప్ ఎంట్రీతో కాంగ్రెస్‌కే చేటు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్‌పై ఆప్ దెబ్బకొట్టే అవకాశాలు భారీగా ఉన్నాయని చెబుతున్నారు.
మరి ఈ త్రిముఖ పోరులో గెలుపెవరిది? బీజేపీకే ప్రజలు మళ్లీ పట్టంగడతారా? కాంగ్రెస్‌కు ఈసారైనా అవకాశం లభిస్తుందా? లేక మార్పు పేరుతో ప్రజలు ఆమ్ ఆద్మీకి ఓటేస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం.. ఎన్నికల ఫలితాల తేది డిసెంబర్ 8తో తేలిపోతుంది.
సంబంధిత కథనం