Gujarat assembly elections : బీజేపీ 'కంచుకోట'పై.. ఈ సారైనా కాంగ్రెస్​ జెండా ఎగిరేనా?-gujarat assembly elections 2022 will congress defeat bjp in its bastion ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Gujarat Assembly Elections : బీజేపీ 'కంచుకోట'పై.. ఈ సారైనా కాంగ్రెస్​ జెండా ఎగిరేనా?

Gujarat assembly elections : బీజేపీ 'కంచుకోట'పై.. ఈ సారైనా కాంగ్రెస్​ జెండా ఎగిరేనా?

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Oct 30, 2022 03:32 PM IST

Gujarat assembly elections Congress : 27ఏళ్లుగా బీజేపీ కంచుకోటగా ఉంది గుజరాత్​. ఇక రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తోంది కాంగ్రెస్​. ఇది సాధ్యమేనా?

బీజేపీ 'కంచుకోట'పై కాంగ్రెస్​ జెండా ఎగిరేనా?
బీజేపీ 'కంచుకోట'పై కాంగ్రెస్​ జెండా ఎగిరేనా?

Gujarat assembly elections Congress : "గుజరాత్"​.. ఈ పేరు వింటే ముందుగా గుర్తొచ్చేది బీజేపీ! 27ఏళ్లుగా బీజేపీ కంచుకోటగా ఉంది గుజరాత్​. ఇంత కాలం ఓ రాష్ట్రంపై పట్టుకోల్పోకుండా ఉండటం అనేది గొప్ప విషయనే చెప్పుకోవాలి. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీనిచ్చేందుకు కాంగ్రెస్​ ఎప్పుడు తీవ్రంగా కృషి చేస్తూనే ఉంటుంది. ఈ పార్టీల మధ్యే ద్విముఖ పోరు ఉంటుంది. మరి ఈసారి కాంగ్రెస్​ పరిస్థితేంటి? ఈ సారైనా గుజరాత్​లో కాంగ్రెస్​ జెండా ఎగురుతుందా? కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ఆప్​తో కాంగ్రెస్​కు ముప్పు ఉంటుందా?

కాంగ్రెస్​ వ్యూహం ఏంటి..?

2017 గుజరాత్​ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ మెరుగైన ప్రదర్శనే చేసిందని చెప్పుకోవాలి. ఆ ఎన్నికల్లో మొత్తం 182 నియోజకవర్గాల్లో.. బీజేపీకి 99 సీట్లు దక్కగా.. కాంగ్రెస్​ 77 స్థానాల్లో విజయాన్ని దక్కించుకుంది. నాడు కాంగ్రెస్​ ప్రదర్శన నేపథ్యంలో రాజస్థాన్​ సీఎం, పార్టీ సీనియర్​ నేత అశోక్​ గహ్లోత్​పై ప్రశంసల వర్షం కురిసింది. ఎన్నికల ప్రచారాలను ఆయన తన భుజాల మీద వేసుకుని నడిపించారు.

Gujarat assembly elections : ఈసారి కూడా అశోక్​ గహ్లోత్​ రంగంలోకి దిగారు. ఈ నెల 17,18 తేదీల్లో గుజరాత్​లో పర్యటించారు. క్షేత్రస్థాయిలో తాజా పరిస్థితులను పరిశీలించారు. అనంతరం.. భారతీయ ట్రైబల్​ పార్టీ, నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ నేతలతో చర్చలు జరిపారు. ఈ రెండు పార్టీలతో పొత్తు కుదుర్చుకుని, కాంగ్రెస్​ ఎన్నికల్లోకి వెళ్లే అవకాశం ఉందని ఊహాగానాలు జోరందుకున్నాయి.

మరోవైపు.. గత ఎన్నికల్లో గుజరాత్​లోని గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన ప్రదర్శన చేసింది కాంగ్రెస్​. ఈసారి కూడా గ్రామీణ ప్రాంతాలపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని కాంగ్రెస్​ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే ప్రణాళికలు రచిస్తోంది.

గుజరాత్​ మొత్తం జనాభాలో దళితులు 8శాతం ఉంటారు. వీరి ఓట్లను కూడా దక్కించుకోవాలని కాంగ్రెస్​ చూస్తోంది.

Gujarat assembly elections 2022 : "10శాతం కన్నా ఎక్కువ దళిత జనాభా ఉన్న సీట్లపై ప్రత్యేక దృష్టిపెట్టాము. రిజర్వు చేసిన నియోజకవర్గాలకే మేము పరిమితం కావడం లేదు. 40 నియోజకవర్గాలను గుర్తించాము. ఇక్కడి దళితులు భారీగా తరలివచ్చి కాంగ్రెస్​కు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. రిజర్వు చేయని సీట్లల్లో కూడా దళితులను బరిలో దింపేందుకు ప్రయత్నిస్తాము," అని కాంగ్రెస్​కు చెందిన హితేంద్ర పతాడియా వెల్లడించారు.

అయితే.. అర్బన్​ ప్రాంతాల్లో కాంగ్రెస్​కు అంత పట్టులేదు. ఇక్కడ ఉన్న 55సీట్లల్లో గత ఎన్నికల్లో కమలదళానికి 46 స్థానాలు దక్కాయి. మరి ఈసారి ఇక్కడ విజయావకాశాలను మెరుగుపరుచుకునేందుకు కాంగ్రెస్​ ఎలాంటి వ్యూహాలు రచిస్తుందో చూడాలి.

ద్రవ్యోల్బణం, రాష్ట్రంలో నిరుద్యోగం, కొవిడ్​ సంక్షోభం నిర్వహణలో వైఫల్యం వంటి ప్రభుత్వం వ్యతిరేక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఓట్లు కూడగట్టుకోవాలని కాంగ్రెస్​ చూస్తోంది. పలు ప్రాజెక్టుల విషయంలో ఆదివాసీలు ఆగ్రహంతో ఉన్నారని, వారి సమస్యలను కూడా లెవనెత్తుతామని కాంగ్రెస్​ చెబుతోంది.

ఆప్​తో ముప్పు ఎవరికి?

Gujarat Congress : బీజేపీకి గుజరాత్​ అనేది కంచుకోటగా ఉంది. బీజేపీకి పోటీనిచ్చేందుకు ఇంతకాలం కాంగ్రెస్​ తీవ్రంగా కృషి చేసింది. ఇక ఇప్పుడు ఈ ద్విముఖ పోరులోకి ఆప్​ ఎంట్రీ ఇచ్చింది. కొన్ని నెలల ముందు నుంచే ఆ రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు అరవింద్​ కేజ్రీవాల్​. 'ఉచితాల'పై హామీలిస్తూ ముందుకెళుతున్నారు.

ఆప్​ ఎంట్రీతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు ఏ విధంగా మారుతాయి? అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. ఆప్​తో కాంగ్రెస్​కే ఎక్కువ ముప్పు ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ కాంగ్రెస్​ మాత్రం వీటిని తిప్పికొడుతోంది.

"ఆప్​ ఎంట్రీతో కాంగ్రెస్​కు ముప్పు అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ బీజేపీపైనా ప్రభావం ఉండొచ్చు. ముఖ్యంగా అర్బన్​ ప్రాంతాల్లో బీజేపీ నష్టం కలిగే అవకాశం ఉంది. ఆప్​కు గ్రామీణం కన్నా పట్టణాల్లోనే కార్యకర్తలు ఎక్కువగా ఉన్నారు," అని ఓ కాంగ్రెస్​ నేత పేర్కొన్నారు.

గాంధీలు ఎక్కడ..?

Gujarat Congress latest news : రేపో, మాపో ఎన్నికల షెడ్యూల్​ వస్తుంది అన్నట్టుగా పరిస్థితులు ఉన్నాయి. బీజేపీ జోరుగా ప్రచారాలు సాగిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే అనేకమార్లు రాష్ట్రంలో పర్యటించారు. అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరించారు. ఇక మిగిలిన అగ్రనేతలు కూడా గుజరాత్​కు క్యూ కడుతున్నారు.

కానీ కాంగ్రెస్​ ఎన్నికల ప్రచారాలు మాత్రం సరిగ్గా జరగడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్నా.. అక్కడికి రాహుల్​ గాంధీ ఇంకా వెళ్లలేదు. ప్రస్తుతం ఆయన భారత్​ జోడా యాత్రలో బిజీగా ఉన్నారు. యాత్రను పక్కన పెట్టి.. గుజరాత్​, హిమాచల్​ ప్రదేశ్​కు వెళ్లి ఎన్నికల ప్రచారాలు నిర్వహించాలని పార్టీలోని కొందరు రాహుల్​కు సూచిస్తున్నారు. కానీ ఆయన మాత్రం ఇంకా యాత్రలోనే ఉన్నారు. అసలు గుజరాత్​ ఎన్నికల ప్రచారాల్లో రాహుల్​ గాంధీ కనిపిస్తారా? అన్న అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.

ఇక ఈ దఫా ఎన్నికలు.. కాంగ్రెస్​ నూతన అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు కూడా కీలకంగానే ఉన్నాయి. అధ్యక్ష పదవి చేపట్టిన అనంతరం జరుగుతున్న తొలి ఎన్నికల నేపథ్యంలో ఆయన ఏ విధంగా పార్టీని ముందుకు నడిపిస్తారనే ఆసక్తిగా మారింది.

బీజేపీ కంచుకోట గుజరాత్​లో 125 సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్​ చెబుతోంది. మరి ఇది నిజంగానే జరుగుతుందా? లేక గత ఎన్నికల కన్నా బలహీనంగా కాంగ్రెస్​ మారుతుందా? అన్నది ఎన్నికల ఫలితాలతో తేలిపోతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం