Gujarat assembly elections : గుజరాత్​ దళితుల 'మద్దతు' ఎవరికి?-gujarat polls dalit votes likely to get divided among bjp cong and aap say political observers ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Gujarat Polls: Dalit Votes Likely To Get Divided Among Bjp, Cong And Aap, Say Political Observers

Gujarat assembly elections : గుజరాత్​ దళితుల 'మద్దతు' ఎవరికి?

Sharath Chitturi HT Telugu
Oct 16, 2022 06:04 PM IST

Gujarat assembly elections 2022 : గుజరాత్​ ఎన్నికలు హాట్​ టాపిక్​గా మారిన వేళ.. ఓటు బ్యాంకు రాజకీయాలు మొదలయ్యాయి. ఇక ఇప్పుడు గుజరాత్​లో మైనారిటీలుగా ఉన్న దళితుల ఓట్లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వారు అయోమయంలో ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ దళితుల ఓట్లు తమకే దక్కుతాయని అన్ని పార్టీలు ధీమా ఉన్నాయి. మరి దళితులు ఎవరివైపు?

గుజరాత్​ దళితుల 'మద్దతు' ఎవరికి?
గుజరాత్​ దళితుల 'మద్దతు' ఎవరికి?

Gujarat assembly elections 2022 : దేశంలో గుజరాత్​ ఎన్నికలు ఇప్పుడు హాట్​ టాపిక్​! ఎన్నికల షెడ్యూల్​ ఇంకా విడుదల అవ్వకపోయినా.. ఈ దఫా ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఇప్పటికే జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీకి పోటీనిచ్చేందుకు కాంగ్రెస్​ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇక ఇప్పుడు ఆమ్​ ఆద్మీ కూడా గుజరాత్​లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఫలితంగా పోరు మరింత రసవత్తరంగా ఉంటుంది అని అనడంలో సందేహం లేదు. అయితే.. రాష్ట్రంలో దళితుల 'మద్దతు' ఎవరికి ఉంటుంది? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై రాజకీయ విశ్లేషకులు ఏం అంటున్నారంటే..

ట్రెండింగ్ వార్తలు

దళితుల 'ఓటు' చరిత్ర..

గుజరాత్​లో మొత్తం 182 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. వీటిల్లో 13 స్థానాలను ఎస్​సీలకు కేటాయించారు. వీటితో పాటు 10-12 స్థానాలను దళితులు ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Gujarat Dalit vote bank : 1995 నుంచి ఈ 13 సీట్లల్లో బీజేపీ హవా కొనసాగుతోంది! 2007, 2012 అసెంబ్లీ ఎన్నికల్లో కమలదళం వరుసగా 11-10 సీట్లు దక్కించుకుంది. అదే సమయంలో కాంగ్రెస్​ 2,3 స్థానాలకే పరిమితమైంది. కానీ 2017లో బీజేపీకి షాక్​ తగిలింది. 13లో 7 మాత్రమే గెలిచింది. కాంగ్రెస్​కు 5 సీట్లు వచ్చాయి. ఒక సీటు.. కాంగ్రెస్​ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థికి వెళ్లింది. ఇక ఇప్పుడు రేసులో ఆమ్​ ఆద్మీ పార్టీ కూడా ఉంది. ఫలితంగా దళితుల ఓట్ల విషయంలో మూడు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.

ఇక 2022 గుజరాత్​ అసెంబ్లీ ఎన్నికల్లో.. ఏ పార్టీకి ఓట వేయాలో అని దళితుల్లో అయోమయం నెలకొందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

"దళితుల్లో అయోమయం నెలకొంది. రాజకీయాలను శాసించే జనాభా వారికి లేదు. అంతేకాకుండా.. దళితుల్లో వంకర, రోహిత్​, వాల్మీకి అంటూ మూడు ఉపకులాలు ఉన్నాయి. వంకర సంఘం ప్రజలు ఎక్కువగా ఉన్నారు. వారిని ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. వాల్మీకి సంఘంలో చాలా మంది పారిశుద్ధ్య కార్మికులే ఉన్నారు. ఓటు విషయంలో వీరి మధ్య చీలిక వచ్చింది. ముఖ్యంగా ఎవరికి ఓటు వేయాలో యువతకు అర్థం కావడం లేదు." అని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, గుజరాత్​ వర్సిటీ రిటైర్డ్​ ప్రొఫెసర్​ గౌరంగ్​ జానీ అభిప్రాయపడ్డారు.

మూడు రాజకీయ పార్టీల ప్రయత్నాల వల్ల దళితుల్లోని మూడు సంఘాల మధ్య మరింత చీలిక ఏర్పడే అవకాశం ఉందని జానీ అంటున్నారు. ఇదే జరిగితే.. ఇప్పటికే తక్కువగా ఉన్న దళితుల ఓటు బ్యాంకు, మరింత పడిపోతుందని భావిస్తున్నారు. అదే సమయంలో ఇలా చీలక ఏర్పడితే.. రాజకీయ పార్టీలకు కూడా నష్టమే జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దళితులు ఎటువైపు..?

Gujarat polls 2022 : 27ఏళ్లుగా గుజరాత్​ను బీజేపీ పాలిస్తోంది. కానీ దళితులు మాత్రం బీజేపీ, కాంగ్రెస్​లకు సమానంగా మద్దతు ఇచ్చారు. కానీ దళితులను తమవైపు తిప్పుకునేందుకు కమలదళం అనేక చర్యలు చేపట్టింది. పలుమార్లు దళిత నేతలకు కీలక పదవులను అప్పగించింది. అధికారానికి చాలా కాలం దూరంగా ఉండటంతో దళితులను ఆకట్టుకునేందుకు ఎలాంటి పదవులను ఇవ్వలేకపోయింది కాంగ్రెస్​.

"విపక్షంలో ఉన్నప్పటికీ.. దళితుల పక్షాన కాంగ్రెస్​ బలంగా నిలబడలేకపోయింది. ఇక కాంగ్రెస్​లోని ఎందరో దళిత నేతలు బీజేపీలోకి వెళ్లిపోయారు. ఇక కాంగ్రెస్​ చేపట్టిన కేహెచ్​ఏఎం(క్షత్రియ, హరిజన్​, ఆదివాసి, ముస్లిం) వ్యూహం బెడిసి కొట్టింది," అని జానీ అన్నారు.

గుజరాత్​ మొత్తం జనాభాలో దళితులు 8శాతం ఉంటారు. వీరిలో చాలా మంది గ్రామాలకే పరిమితమయ్యారు. అక్కడ కూడా మైనారిటీలుగానే జీవిస్తున్నారు. ఇక పట్టణాల్లో వీరి జనాభా అంత పెద్దగా లేదు.

సంక్షేమ పథకాలపైనే భారం..

Gujarat BJP : 2022 గుజరాత్​ ఎన్నికల్లోనూ దళితులు తమకే ఓట్లు వేస్తారని కమలదళం ఆశలు పెట్టుకుంది. వారి కోసం అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ఓట్లు దక్కించుకోవాలని చూస్తోంది.

"2017లోనూ దళితులు మాకు మద్దతిచ్చారు. ఆ తర్వాత అనేక సంక్షేమ పథకాలను వారి కోసం ప్రవేశపెట్టాము. ఈసారి కూడా మాకే ఓట్లు పడతాయి," అని బీజేపీ ప్రతినిధి యోగ్నేష్​ దేవ్​ అన్నారు. అంతేకాకుండా.. దళితులకు చెందిన మతపరమైన ప్రదేశాల్లో మతపరమైన గురువుల చేత ప్రచారాలు చేయించాలని బీజేపీ చూస్తోంది.

కాంగ్రెస్​ పరిస్థితేంటి?

Gujarat congress latest news : దేశవ్యాప్తంగా కాంగ్రెస్​ పార్టీకి గడ్డుకాలం నడుస్తోంది. అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని కోల్పోయింది. ఓట్లు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో గుజరాత్​పై కోటి ఆశలు పెట్టుకుంది కాంగ్రెస్​.

"10శాతం కన్నా ఎక్కువ దళిత జనాభా ఉన్న సీట్లపై ప్రత్యేక దృష్టిపెట్టాము. రిజర్వు చేసిన నియోజకవర్గాలకే మేము పరిమితం కావడం లేదు. 40 నియోజకవర్గాలను గుర్తించాము. ఇక్కడి దళితులు భారీగా తరలివచ్చి కాంగ్రెస్​కు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. రిజర్వు చేయని సీట్లల్లో కూడా దళితులను బరిలో దింపేందుకు ప్రయత్నిస్తాము," అని కాంగ్రెస్​కు చెందిన హితేంద్ర పతాడియా వెల్లడించారు.

ఆప్​కు అవకాశం ఉందా?

Gujarat AAP :  పంజాబ్​ను దక్కించుకున్న అరవింద్​ కేజ్రీవాల్​.. గుజరాత్​పై దృష్టి సారించారు. ఎన్నికలకు ఎన్నో నెలల ముందు నుంచే గుజరాత్​లో పర్యటిస్తున్నారు. అటు మహాత్మా గాంధీ గురించి చెబుతూనే.. బీఆర్​ అంబేడ్కర్​ పేరును ప్రస్తావిస్తూ.. దళితులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే.. ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నారు. ఉచిత విద్యుత్​, ఉద్యోగాలు, మహిళలకు భత్యాలు వంటి హామీలు.. తమకు ఓట్లు తెచ్చిపెడతాయని ఆప్​ భావిస్తోంది.

ఆప్​ ఎంట్రీతో దళితుల ఓట్లు మూడు పార్టీలకు చీలిపోతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏ పార్టీ లబ్ధిపొందుతుందో చెప్పలేమని, కానీ దళితులకు మాత్రం లాభం ఉండదని సెటైర్లు విసురుతున్నారు. అయితే.. బీఆర్​ అంబేడ్కర్​ పేరును ఆప్​ వినియోగించుకోవడం కొంతమేర కలిసి వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

మరి గుజరాత్​ ఎన్నికల్లో దళితులు ఎవరి పక్షాన నిలబడతారు? బీజేపీకి మళ్లీ అవకాశం ఇస్తారా? లేక ఆప్​ తన పంజా విసురుతుందా? కాంగ్రెస్​కు ఎంతమంది మద్దతిస్తారు? వంటి ప్రశ్నలకు ఎన్నికల ఫలితాలతో సమాధానం లభిస్తుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం