Gujarat elections schedule: డిసెంబరు 1న గుజరాత్ ఎన్నికలు.. ఈసీ షెడ్యూలు జారీ
Gujarat assembly elections schedule: గుజరాత్ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు విడుదల చేసింది.
Gujarat assembly elections schedule 2022: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసింది. పోలింగ్ రెండు దశల్లో జరగనుంది. డిసెంబరు 1న 89 సీట్లకు, డిసెంబరు 5న 93 సీట్లకు పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు డిసెంబరు 8న ఉంటుంది.
ఈమేరకు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ మధ్యాహ్నం వెల్లడించారు.
గుజరాత్‌లో మొత్తం 182 సీట్లకు ఎన్నిక జరగనుంది. అధికారంలోకి రావాలంటే 92 సీట్లలో నెగ్గాలి. ఇక్కడ ప్రధాన పోరు బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీల మధ్య ఉంది.
నామినేషన్ల దాఖలు నవంబర్ 5న ప్రారంభమై, మొదటి దశలో నవంబర్ 14న ముగుస్తుంది. రెండవ దశ నామినేషన్ దాఖలు కాలం నవంబర్ 10-17గా ఈసీఐ ప్రకటించింది.
1వ దశలో 89 స్థానాలకు నవంబర్ 17 వరకు, 2వ దశలో 93 స్థానాలకు నవంబర్ 21 వరకు అభ్యర్థిత్వ ఉపసంహరణకు గడువు ఉంది.
తక్కువ ఓట్లు పోలయ్యే పోలింగ్ బూత్‌లను గుర్తించామని, అక్కడ పోలింగ్ శాతాన్ని మెరుగుపరచడానికి ప్రత్యేక కృషి చేస్తున్నామని ఈసీఐ వివరించింది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం 51,000 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో గ్రామీణ ప్రాంతాల్లోనే 34,000లకు పైగా ఉన్నాయి.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 182 స్థానాల్లో 4.9 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయడానికి అర్హులుగా ఉన్నారని ఈసీఐ తెలిపింది.
కాగా హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించలేదని విపక్షాలు మండిపడ్డాయి. గుజరాత్‌కు ప్రధాన మంత్రి మోదీ వరాలు ప్రకటించేందుకే షెడ్యూలు జాప్యం చేశారని ఆరోపించాయి.