తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Akshaya Tritiya | ఈ అక్షయ తృతీయ.. 'పసిడి'కి కలిసి వచ్చేనా?

Akshaya Tritiya | ఈ అక్షయ తృతీయ.. 'పసిడి'కి కలిసి వచ్చేనా?

HT Telugu Desk HT Telugu

02 May 2022, 18:48 IST

google News
    • Akshaya Tritiya 2022 | గత రెండేళ్లు.. అక్షయ తృతీయ కొవిడ్​ లాక్​డౌన్​లోనే గడిచిపోయింది. ఇప్పుడు అవేవీ లేవు. కానీ పసిడి ధరలు, పడిపోతున్న డిమండ్​.. ఆందోళన కలిగిస్తోంది. మరి ఈసారైనా.. అక్షయ తృతీయ 'పసిడి'కి కలిసి వస్తుందా? డిమాండ్​ పెరుగుతుందా?
మే 3న అక్షయ తృతీయ.. పసిడికి కలిసి వచ్చేనా?
మే 3న అక్షయ తృతీయ.. పసిడికి కలిసి వచ్చేనా? (REUTERS)

మే 3న అక్షయ తృతీయ.. పసిడికి కలిసి వచ్చేనా?

Akshaya Tritiya 2022 | బంగారం అంటే భారతీయులకు ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. ఇక అక్షత తృతీయ రోజున.. బంగారం కొనుగోలు చేస్తే జీవితంలో మంచి జరుగుతుందని, సంపద వృద్ధి చెందుతుందని భావిస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే అక్షయ తృతీయ రోజున.. బంగారం దుకాణాలు కస్టమర్లతో కిటకిటలాడుతూ ఉంటాయి. కానీ గత రెండేళ్లుగా పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. కొవిడ్​ లాక్​డౌన్​ ఆంక్షల మధ్యలోనే అక్షయ తృతీయ గడిచిపోయింది. ఈసారి ఆంక్షలేవీ లేవు. కానీ ఈ ఏడాదిలో బంగారం డిమాండ్​ పడిపోవడం, ధరలు పెరగడం వ్యాపారులను ఆందోళనకు గురిచేస్తోంది. మరి 2022 అక్షయ తృతీయ(మే 3న) అయినా.. పసిడి అమ్మకాలకు కలిసి వస్తుందా?

మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

పడిపోయిన డిమాండ్​.. కానీ..!

బంగారం వినియోగంలో రెండో అతిపెద్ద దేశంగా ఇండియాకు గుర్తింపు ఉంది. కానీ గతేడాదితో పోల్చుకుంటే బంగారం అమ్మకాలు 18శాతం మేర క్షీణించాయి. అంతేకాకుండా.. జనవరి- మార్చ్​ నెలల్లో పసిడి దిగుమతులు 50శాతం మేర పడిపోయాయి. అదే సమయంలో అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా దేశంలో బంగారం ధర భారీగా పెరిగింది.

Gold sales in India | ధరలు భగ్గుమంటుండటంతో దేశంలో పసిడికి డిమాండ్​ పడిపోయే అవకాశం ఉందని లండన్​కు చెందిన వరల్డ్​ గోల్డ్​ కౌన్సిల్​ ఇటీవలే అంచనా వేసింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో ప్రజల ఆదాయంపై ప్రభావం పడుతోందని, ఫలితంగా బంగారం కొనుగోలుకు ముందుకు రాకపోవచ్చని అభిప్రాయపడింది.

ఈ పరిణామాల మధ్య వ్యాపారులకు కాస్త ఊరటినిచ్చే వార్త బయటకొచ్చింది. 2022 అక్షయ తృతీయకు ఒక రోజు ముందు.. అంటే సోమవారం.. పసిడి ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల పసిడి(24 క్యారెట్లు) ధర రూ. 1,280 తగ్గి, రూ. 51,510కు చేరింది. ఏప్రిల్​ 18న 10 గ్రాముల పసిడి(24 క్యారెట్లు) ధర రూ. 54,380గా ఉండేది. ఈ లెక్కన చూసుకుంటే.. 14రోజుల్లో బంగార ధర దాదాపు రూ. 3వేలు తగ్గినట్టు!

విక్రయదారుల్లో భారీ ఆశలు..!

అనిశ్చితుల కారణంగా బంగారం ధర పెరగడంతో అక్షయ తృతీయ ప్రీ-బుకింగ్స్​పైనా ఎఫెక్ట్​ పడింది. అయితే.. ప్రజల సంప్రదాయాలు, వారి విశ్వాసాలతో ముడి పడిన అక్షయ తృతీయపైనే విక్రయదారులు ఆశలు పెట్టుకున్నారు. కొవిడ్​ ఆంక్షలేవీ లేకపోవడంతో.. 2019 స్థాయిలను 2022 అక్షయ తృతీయ దాటిపోతుందని భావిస్తున్నారు.

"ప్రస్తుత ధరలను, కస్టమర్లలో ఉన్న సెంటిమెంట్లను పరిశీలిస్తే.. అక్షయ తృతీయ రోజున బంగారం సేల్స్​ పెరుగుతాయని భావిస్తున్నాను. 2019స్థాయి కన్నా 5శాతం ఎక్కవ అమ్మకాలు జరుగుతాయని ఆశిస్తున్నాను," అని ఆల్​ ఇండియా జెమ్​ అండ్​ జ్యువెలరీ డొమెస్టిక్​ కౌన్సిల్​ ఛైర్మన్​ ఆశిష్​ పేథే వెల్లడించారు.

"గతేడాది డిమాండ్​ను ఈసారి సులభంగా దాటేస్తాము. ధరలు పెరడటం ఆందోళనకరమే. కానీ బంగారానికి ఉన్న మార్కెట్..​ శక్తివంతంగా, ధృఢంగా ఉంది. భారీ సంఖ్యలో ప్రజలు కొనుగోళ్లు చేస్తారని అనుకుంటున్నా," అని మలాబార్​ గోల్డ్​ అండ్​ డైమండ్స్​ ఛైర్మన్​ అహమ్మద్​ పేర్కొన్నారు.

"2021 దీపావళి నుంచి బంగారం కొనుగోళ్లు పెరిగాయి. కొవిడ్​ వల్ల వాయిదా పడ్డ పెళ్లిళ్లు, శుభకార్యాలు ఇప్పుడు వేగంగా జరిగిపోతున్నాయి. ఇది కలిసివచ్చే విషయం. ఈ ఏడాది గుడిపడ్వాకు సైతం డిమాండ్​ కనిపించింది. అక్షయ తృతీయ నాడు కూడా డిమాండ్​ ఇంకా పెరుగుతుందని ఆశిస్తున్నా. భారీ అభరణాలు, డైమండ్స్​కు గిరాకీ ఉంటుందని అనుకుంటున్నాను," అని డబ్ల్యూహెచ్​పీ జ్యువెలర్స్​ డైరక్టర్​ ఆదిత్య పేథే తెలిపారు.

నిపుణుల మాటేంటి?

Akshaya Tritiya gold demand | అక్షయ తృతీయ సెంటిమెంట్​తో అమ్మకాలు పెరగవచ్చని.. అదే సమయంలో ప్రజలు ఆచితూచి వ్యవహరించే అవకాశం కూడా ఉందని వరల్డ్​ గోల్డ్​ కౌన్సిల్​ రీజనల్​ సీఈఓ, ఇండియా పీఆర్​ సోమసుందరం అభిప్రాయపడ్డారు.

"ఆంక్షలు లేకపోవడంతో.. ఇన్​స్టోర్​ గోల్డ్​ కొనుగోళ్లు పెరుగుతాయని భావిస్తున్నాను. ప్రజల సెంటిమెంట్​తో అమ్మకాలు పెరగవచ్చు. కానీ ధరల్లో కొనసాగుతున్న అనిశ్చితి.. కాస్త ఆందోళనకరంగా ఉంది," అని సోమసుందరం అన్నారు.

"పసిడి ధరలు పెరిగితే కస్టమర్లు కూడా సంతోషిస్తారు. కానీ ఈ ధరలు మరో నెల రోజుల పాటు ఉంటాయా? అన్న సందేహం వారిలో ఉంటుంది. అనిశ్చితుల కారణంగా పెరిగిన ధరలు పడిపోతాయని వారు భావిస్తుంటారు. అదే జరిగితే.. భారీ ధరలకు కొన్నాము అని బాధపడతారు. అందుకే చాలా మంది.. ధరలు మరింత తగ్గిన తర్వాత కొనుగోళ్లు చేద్దామని ఆలోచిస్తారు. అందువల్ల.. గత రెండేళ్లతో పోల్చుకుంటే ఈ సారి డిమాండ్​ పెరగినా.. ఇదే 'ది బెస్ట్ అక్షయ తృతీయ'​ అని చెప్పడానికి మాత్రం లేదు," అని సోమసుందరం వెల్లడించారు.

టాపిక్

తదుపరి వ్యాసం