Akshaya Tritiya | అక్షయ తృతీయకు బంగారం కొనుగోలు చేస్తే ఈ విషయాలు గుర్తుంచుకోండి!
06 April 2023, 10:08 IST
- Akshaya Tritiya: అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు చేసే సంస్కృతి గత కొన్నేళ్లుగా పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు మళ్లీ ఆ ముహుర్తానికి వేళయింది. మరి మీరు బంగారం కొనుగోలు చేయాలనుకుంటే ఈ విషయాలు పరిగణలోకి తీసుకోండి. మీకు కచ్చితంగా ఎంతో కొంత ప్రయోజనం చేకూరుతుంది.
Akshaya Tritiya- Gold Purchasing
Akshaya Tritiya: ప్రపంచంలో ఎవరికైనా బంగారం అంటే ఒక లోహం. కానీ ఆ లోహం అంటే భారతీయ స్త్రీలకు మాత్రం ప్రాణం. పెళ్లిల్లకు, పెరంటాలకు లేదా ఏ చిన్న వేడుకకైనా ఒంటి నిండా బంగారం వేసుకొని అందరికీ ఆ నగలను చూపించాలని ప్రతీ ఒక్క భారతీయ మహిళకు ఉంటుంది. ఈ క్రమంలో బంగారం కొనుగోలు చేసేందుకు ఉన్న ఏ అవకాశాన్ని ఆడవారు వదులుకోరు. ఇప్పుడు అక్షయ తృతీయ రానే వచ్చింది. ఈ ప్రత్యేకమైన సందర్భంలో బంగారం కొంటే శుభం అని ఎంతో మంది నమ్ముతారు. కొద్ది మొత్తంలోనైనా బంగారం కొనుగోలు చేయాలనే ప్రయత్నం చేస్తారు.
మన దేశంలో బంగారానికి ఉండే డిమాండ్‌కి దాని ధర కూడా ధగధగ మెరుస్తుంది. ఆ ధరల మెరుపులకు ఎవరికైనా కళ్లు తిరగాల్సింది. మరి ఇంత ఖర్చు చేసే బంగారం కొనుగోలు చేస్తున్నపుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు అక్షయ తృతీయ నాడు బంగారం కొనుగోలు చేసే ఆలోచనలో ఉంటే ఈ అంశాలు పరిగణలోకి తీసుకుంటే ఉత్తమం.
బంగారం కొనుగోలు చేసేటపుడు ఈ అంశాలను పరిగణలోకి తీసుకోవాలి
స్వచ్ఛమైన బంగారం కొనుగోలు చేస్తేనే రేపు పెట్టుబడిగా కూడా ఉపయోగపడుతుంది.
బంగారం స్వచ్ఛత
బంగారం కొనుగోలు విషయంలో స్వచ్ఛత అనేది ఎంతో కీలకమైన అంశం. బంగారం స్వచ్ఛతను 24 క్యారెట్ల రూపంలో కొలుస్తారు. 24 క్యారెట్ గోల్డ్ అంటే 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం. ఇందులో ఇతర లోహాలు ఏమి కలవవు. ఇక దీని తర్వాత 22 క్యారెట్లు ఉంటుంది. అంటే ఇందులో 22 భాగాలు గోల్డ్ కాగా, మిగిలిన 2 భాగాలు రాగి లాంటి ఇతర లోహాలు కలిపినవి. 18 క్యారెట్లంటే 4 భాగాలు వేరే లోహాలతో కలిపి తయారు చేసినవి. కాబట్టి మీరు కొనుగోలు చేసేటపుడు ఎన్ని క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ కొంటున్నారు. దానికి సరైన ధర చెల్లిస్తున్నారా.. లేదా? అనేది అప్పుడు మార్కెట్ ధరలతో పోల్చుకోవాలి.
కొనుగోలు చేసేందుకు ఆప్షన్లు
బంగారం కొనుగోలు చేసేటపుడు రెండు, మూడు చోట్ల ధరలను తెలుసుకోవడం ఎంతైనా మంచింది. ఒకవేళ బంగారు నాణేలను కొనుగోలు చేయాలనుకుంటే కేవలం బంగారు దుకాణాల్లోనే కాదు ఆన్‌లైన్ లో ఇ-టైలర్‌ల నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు. అలాగే బ్యాంకులు, MMTC-PAMP లాంటి ప్రభుత్వ అధీకృత సంస్థలు అకొన్ని నాన్-బ్యాంకింగ్ ఆర్థిక సంస్థల నుంచి కూడా కొనుగోలు చేయవచ్చు. బంగారు నాణేల డినామినేషన్ ప్రకారం కనీస విలువ ఒక్కోచోట ఒక్కోలా ఉండవచ్చు. బంగారు నాణేలు 0.5 గ్రాముల నుండి 50 గ్రాముల వరకు లభిస్తాయి.
హాల్‌మార్క్ చిహ్నం
బాంగారు నాణేలు, ఆభరణాలపై హాల్‌మార్క్ చిహ్నం ఉండేలా చూసుకోవాలి. బంగారు వస్తువులపై BIS (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్) హాల్‌మార్కింగ్ సెంటర్‌లో పరీక్షించి సర్టిఫికేట్ చేస్తారు. భారతీయ స్టాండర్డ్ స్పెసిఫికేషన్‌ల ప్రకారం ఈ హాల్‌మార్క్ చిహ్నం బంగారు నాణెం స్వచ్ఛతను నిర్ధారిస్తుంది. కాబట్టి మీరు కొనుగోలు చేసన బంగారంపై ఈ చిహ్నం ఉందా లేదా? అనేది చెక్ చేసుకోండి.
బంగారు నాణేలపై మేకింగ్ ఛార్జీలు
మేకింగ్ ఛార్జీలు తక్కువ ఉంటే మీరు కనీసం 0.5 గ్రాముల బంగారాన్ని అదనంగా కొనుగోలు చేయవచ్చు. కాబట్టి ఆభరణాలు కొనుగోలు చేస్టపుడు మేకింగ్ ఛార్జీలు, తరుగు అని కచ్చితంగా ఉంటాయి. నాణేలపై మేకింగ్ ఛార్జీలు లాంటివి వేయకూడదు. ఎందుకంటే బంగారు నాణేలను తయారు చేయడానికి ఎక్కువ శ్రమ, నైపుణ్యం అవసరం లేదు.
బంగారు నాణేల రీసేల్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- RBI ఆదేశాల అనుసారం ఎవరైనా వ్యక్తులు ఒక బ్యాంకు నుంచి బంగారు నాణేలను కొనుగోలు చేసి, తిరిగి మళ్ళీ ఆ బ్యాంకులో విక్రయించలేరు. తమ బంగారు నాణేలను విక్రయించాలనుకునే వారు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు లేదా గుర్తింపు పొందిన ఆభరణాల దుకాణాలలో విక్రయించవచ్చు. అయితే ఇలా రీసేల్ చేస్తున్నపుడు మీకు సరైన ధర లభించకపోవచ్చు.