Akshaya Tritiya | అధిక ధరల దెబ్బకు 'గోల్డ్' డిమాండ్ ఢమాల్.. !
28 April 2022, 10:55 IST
గతేడాదితో పోల్చుకుంటే.. దేశంలో బంగారం విక్రయాలు 18శాతం మేర క్షీణించాయి. ధరలు పెరుగుతుండటం, ద్రవ్యోల్బణం ఇందుకు కారణం. కాగా.. బంగారం డిమాండ్ పడిపోయే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
అక్షయ తృతీయపైనే ‘బంగారం’ ఆశలు
Gold sales in India | దేశంలో అన్నింటితో పాటు బంగారం ధరలు సైతం భగ్గుమంటున్నాయి. ద్రవ్యోల్బణంతో పాటు అంతర్జాతీయ కారణాలతో పసిడి ధరలు పెరిగాయి. అయితే.. ఇది ఇప్పుడు సమస్యగా మారే అవకాశం ఉంది. దేశంలో బంగారానికి డిమాండ్ పడిపోవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి.
18శాతం క్షీణత..
బంగారం వినియోగంలో రెండో అతిపెద్ద దేశంగా ఇండియాకు గుర్తింపు ఉంది. కానీ ధరలు భగ్గుమంటుండటంతో దేశంలో పసిడికి డిమాండ్ పడిపోయే అవకాశం ఉందని లండన్‌కు చెందిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా వేసింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో ప్రజల ఆదాయంపై ప్రభావం పడుతోందని, ఫలితంగా బంగారం కొనుగోలుకు ముందుకు రాకపోవచ్చని అభిప్రాయపడింది.
గతేడాదితో పోల్చుకుంటే బంగారం అమ్మకాలు 18శాతం మేర క్షీణించాయి. అంతేకాకుండా.. జనవరి- మార్చ్ నెలల్లో పసిడి దిగుమతులు 50శాతం మేర పడిపోయాయి. కొవిడ్ మూడో వేవ్‌తో దుకాణాలు మూతపడటం, ప్రజలు బయటకు వెళ్లకపోవడం ఇందుకు కారణం.
భారతీయులు.. బంగారానికి ఎంతో విలువనిస్తారు. శుభకార్యాలకు, పెళ్లిళ్లకు బంగారాన్ని కొనుగోలు చేస్తారు. కాగా.. బంగారం ధరలు కూడా పెరుగుతుండటంతో కొనుగోళ్లు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. ధరలు తగ్గుతాయని, అప్పుడు కొనుగోళ్లు చేద్దామని ఎదురుచూస్తున్నారు.
అక్షయ తృతీయపైనే ఆశలు..
Akshaya Tritiya 2022 | దేశంలో అక్షయ తృతీయ నాడు భారీగా పసిడి అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. ఆరోజు బంగారం కొంటే.. మంచి జరుగుతుందని ప్రజల నమ్మకం! వచ్చే వారం రానున్న అక్షయ తృతీయపైనే మార్కెట్ వర్గాలు భారీ ఆశలు పెట్టుకున్నాయి. అప్పటి నుంచి బంగారం విక్రయాలు గణనీయంగా పెరుగుతాయని భావిస్తున్నాయి.
"ఫిబ్రవరి, మార్చ్‌తో పోల్చుకుంటే అక్షయ తృతీయ నుంచి డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నాము. కానీ.. ప్రజలు దుకాణాల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చి బంగారం కొనేస్తారని మేము అనుకోవడం లేదు. ఇందుకు అధిక ధరలే కారణం. ధరలు తగ్గుతాయా? లేక ఇలాగే ఉంటాయా? అన్న విషయంపై ప్రజలు ఇంకొంతం కాలం వేచిచూసే అవకాశం ఉంది," అని కౌన్సిల్‌కు చెందిన రీజనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పీఆర్ సోమసుందరన్ పేర్కొన్నారు.
రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనిశ్చితి కారణంగా గత త్రైమాసికంలో బంగారానికి మంచి లాభాలు వచ్చాయి. 8శాతం మేర వృద్ధిచెందింది. ఇది రెండేళ్లల్లోనే గరిష్ఠం.
అయితే.. బంగారం ఆభరణాలు, కాయిన్లు, గోల్డ్ బార్స్‌కు డిమాండ్.. గతేడాదితో పోల్చుకుంటే ఈసారి స్థిరంగానే ఉండొచ్చని సోమసుందరన్ పేర్కొన్నారు.
టాపిక్