తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ajit Pawar Bjp : 30మంది ఎమ్మెల్యేలతో బీజేపీలోకి అజిత్​ పవార్​? శరద్​ పవార్​ పార్టీలో చీలిక తప్పదా?

Ajit Pawar BJP : 30మంది ఎమ్మెల్యేలతో బీజేపీలోకి అజిత్​ పవార్​? శరద్​ పవార్​ పార్టీలో చీలిక తప్పదా?

Sharath Chitturi HT Telugu

18 April 2023, 13:29 IST

  • Ajit Pawar BJP : శరద్​ పవార్​ పార్టీ ఎన్​సీపీ రెండుగా చీలుపోతుందా? విపక్షాలకు గట్టి ఎదురుదెబ్బ తగులుతుందా? ఎన్​సీపీ కీలక నేత, శరద పవార్​ మేనల్లుడు అజిత్​ పవార్​.. బీజేపీలోకి చేరుతున్నారా?

శరద్​ పవార్​తో అజిత్​ పవార్​
శరద్​ పవార్​తో అజిత్​ పవార్​ (HT_PRINT/file)

శరద్​ పవార్​తో అజిత్​ పవార్​

Ajit Pawar BJP : మహారాష్ట్ర రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్​సీపీకి చెందిన ప్రముఖ రాజకీయ నేత అజిత్​ పవార్​.. పార్టీని వీడుతున్నట్టు ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. 30మంది ఎమ్మెల్యేలతో ఆయన బీజేపీలో చేరుతారని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​తో పాటు ఆయన మేనల్లుడు అజిత్​ పవార్​ సైతం ఈ వ్యవహారాన్ని ఖండిస్తున్నప్పటికీ.. ఈ వార్తల్లో నిజం ఉందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలోకి అజిత్​ పవార్​?

అజిత్​ పవార్​ పార్టీ మారుతారు అన్న వార్తలు ప్రతి యేటా చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఈసారి వీటి తీవ్రత చాలా ఎక్కువగా కనిపిస్తోంది! ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించడం, విపక్షాలు వ్యతిరేకిస్తున్న ఈవీఎం వ్యవస్థకు మద్దతివ్వడం వంటివి అజిప్​ పవార్ చేయడంతో .. ఆయన​ పార్టీ మారడం ఖాయమని అందరు భావించారు. తనతో పాటు విపక్షానికి చెందిన అనేకమంది ఎమ్మెల్యేలను కూడా బీజేపీలోకి తీసుకెళ్లాలని అజిత్​ పవార్​ భావిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. 30మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఇదే విషయంపై చర్చించేందుకు అజిత్​ పవార్​ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు వార్తలు చక్కర్లు కొట్టాయి.

Ajit Pawar latest news : అయితే వీటన్నింటినీ అజిత్​ పవార్​ ఖండించారు. మీడియాలో వస్తున్న కథనాల్లో నిజం లేదని కొట్టిపారేశారు. ఎలాంటి సమావేశానికి తాను పిలుపునివ్వలేదని స్పష్టం చేశారు. శరద్​ పవార్​ కూడా ఈ వార్తలను ఖండించారు. మీటింగ్​కు పిలుపివ్వలేదని తెలిపారు. అజిత్​ పవార్​ పార్టీలోనే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. 'మీడియాలో వస్తున్న మాటలన్నీ మా మధ్యలో లేవు. మేము వాటి గురించి ఆలోచించట్లేదు,' అని అన్నారు.

'15 రోజుల్లో పెను సంచలనం..'

అజిత్​ పవార్​ పార్టీ మారుతున్నారన్న ఊహాగానాల మధ్య శరద పవార్​ కుమార్తె, ఎన్​సీపీ ఎంపీ సుప్రియా సూలే కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న 15 రోజుల్లో రెండు సంచలనాత్మక సంఘటనలు జరుగుతాయని అన్నారు. వాటిల్లో ఒకటి ఢిల్లీలో, మరొకటి మహారాష్ట్రలో అని తెలిపారు. కానీ వాటి గురించి ఆమె వివరించలేదు.

Ajit Pawar Sarad Pawar : ఈ క్రమంలో అజిత్​ పవార్​ బీజేపీలో చేరే విషయంపై సుప్రియా సూలేను ప్రశ్నించింది మీడియా.

"ఈ విషయాన్ని అజిత్​ దాదానే అడగండి. నన్ను అడిగితే నేనేం చెబుతాను. నాకేం తెలియదు. ప్రజా ప్రతినిధిగా నాకు చాలా పనులుంటాయి. గాసిప్స్​ను పట్టించుకునే సమయం నాకు లేదు. అజిత్​ కూడా చాలా బిజీగా ఉంటారు. 24 గంటలు పనిచేస్తారు. అందుకే ఇలాంటి ఊహాగానాలకు స్పందించడం లేదు," అని తెలిపారు.

మిస్టరీల అజిత్​ పవార్​..!

Ajit Pawar joining BJP : 2019లో బీజేపీతో జతకట్టి.. దేవేంద్ర ఫడణవీస్​తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తనకు ఎమ్మెల్యేల మద్దతు ఉందన్నారు. కానీ ఆ మద్దతు లేకపోవడంతో ప్రభుత్వం కుప్పకూలింది. బీజేపీతో అజిత్​ పవార్​ బంధానికి కొద్ది గంటల్లోనే తెరపడింది.

అప్పటి నుంచి ఆయన బీజేపీలో చేరడంపై అనేకమార్లు వార్తలు వచ్చాయి. మరి ఈసారి ఆయన నిజంగానే బీజేపీలో చేరుతున్నారా? లేక ఇవి కూడా ఊహాగానాలేనా? అన్నది మరి కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది!

తదుపరి వ్యాసం