Adani-Hindenburg case : అదానీ వ్యవహారంపై ప్యానెల్ ఏర్పాటుకు సుప్రీం ఆదేశం
02 March 2023, 11:47 IST
- Adani-Hindenburg case Supreme court : అదానీ కేసుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టేందుకు ఆరుగురు సభ్యుల ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
అదానీ వ్యవహారంపై ప్యానెల్ ఏర్పాటుకు సుప్రీం ఆదేశం
Adani-Hindenburg case Supreme court : హిన్డెన్బర్గ్ షార్ట్ సెల్లింగ్ నివేదిక నేపథ్యంలో ఆదానీ గ్రూప్ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించింది సుప్రీంకోర్టు. ఈ మేరకు విశ్రాంత న్యాయమూర్తి అభయ్ మనోహ్ సప్రే నేతృత్వంలో ఓ ఆరుగురు సభ్యుల ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది.
'2 నెలల్లో దర్యాప్తు పూర్తవ్వాలి..'
అదానీ గ్రూప్‌లో అవకతవకలు జరిగాయంటూ జనవరి 24న ఓ నివేదిక బయటపెట్టింది హిన్డెన్బర్గ్ సంస్థ. అప్పటి నుంచి అదానీ గ్రూప్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లకు రక్షణ కలిగించే విధంగా ప్రస్తుత విధానాల్లో మార్పులు తీసుకురావాలంటూ.. సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. తాజాగా వీటిపై విచారణ చేపట్టింది సీజేఈ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం. ఈ క్రమంలోనే ప్యానెల్ ఏర్పాటుకు ఆదేశాలిచ్చింది. ప్రముఖ బ్యాంకర్లు కేవీ కామథ్, ఓపీ భట్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, రిటైర్డ్ జస్టిస్ జేపీ దేవ్దార్లు ఈ ప్యానెల్లో సభ్యులుగా ఉండనున్నట్టు పేర్కొంది.
Supreme court Adani row : ఈ ఆరుగురు సభ్యుల ప్యానెల్.. అదానీ కేసుపై దర్యాప్తు చేపడుతుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పెట్టుబడిదారులకు రక్షణ కల్పించడం, వ్యవస్థలోని లోపాలను సరిచేయడం వంటి అంశాలపై ప్యానెల్ కీలక సూచనలు చేస్తుందని పేర్కొంది.
మరోవైపు.. అదానీ వ్యవహారంపై చేపట్టిన దర్యాప్తును 2 నెలల్లోగా పూర్తి చేసి, స్టేటస్ రిపోర్టును సమర్పించాలని మార్కెట్ రెగ్యులేటరీ సెబీకి ఆదేశాలిచ్చింది అత్యున్నత న్యాయస్థానం. స్టాక్ మేన్యుపులేషన్ జరిగిందా? నిబంధనల ఉల్లంఘన జరిగిందా? వంటి అంశాలను సైతం విచారించి, నివేదికను సమర్పించాలని స్పష్టం చేసింది.
ఇదీ కేసు..
Supreme court Adani Hindenburg : అదానీ గ్రూప్ గత కొంతకాలంగా అక్రమాలకు పాల్పడుతోందని సంచలన నివేదిక బయటపెట్టింది అమెరికాకు చెందిన హిన్డెన్బర్గ్ రీసెర్చ్. దారుణంగా ఉన్న సంస్థ ఆర్థిక వ్యవస్థను ఇంతకాలం అదానీ బృందం తప్పుడు మార్గాల్లో కప్పిపుచ్చుకుంటూ వచ్చిందని, భారీ మొత్తంలో స్టాక్ మేన్యుపులేషన్కు పాల్పడిందని ఆరోపించింది. అందుకే.. వాస్తవ వాల్యుయేషన్ కన్నా అదానీ గ్రూప్ స్టాక్స్ ఎన్నో రేట్లు ఎక్కువ స్థాయిలో ట్రేడ్ అవుతున్నట్టు పేర్కొంది.
ఈ నివేదిక బయటకి వచ్చినప్పటి నుంచి అదానీ గ్రూప్ స్టాక్స్‌లో రక్తపాతం కొనసాగుతోంది. అన్నీ అదానీ స్టాక్స్‌లో సంపద దాదాపు సగానికిపైగా ఆవిరైపోయింది. మదుపర్లకు తేరులేని విధంగా దెబ్బపడింది.
Supreme court Adani hearing : అదానీ గ్రూప్‌పై జేపీసీ నియమించాలని ప్రభుత్వంపై విపక్షాలు ఒత్తిడి చేశాయి. దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి.