Adani Group Crisis: ప్రముఖ వ్యాపాతవేత్త గౌతమ్ అదానీ (Gautam Adani)కి చెందిన అదానీ గ్రూప్ (Adani Group) మార్కెట్ విలువ మరింత పతనమైంది. సోమవారం (ఫిబ్రవరి 27) స్టాక్ మార్కెట్ సెషన్‍లో అదానీ గ్రూప్‍లోని 10 కంపెనీల షేర్లు భారీగా నష్టపోవటంతో మార్కెట్ విలువ మరింత తగ్గింది. అదానీ గ్రూప్ మార్కెట్ సంపద (Adani Group Market Capitalisation) విలువ రూ.7లక్షల కోట్ల కిందకు దిగివచ్చింది. జనవరి 24న అదానీ గ్రూప్ మార్కెట్ విలువ రూ.19.19లక్షల కోట్లుగా ఉండగా.. సుమారు నెలలోనే ఏకంగా 63శాతానికిపైగా పడిపోయింది.
అమెరికాకు చెందిన హిండెన్‍బర్గ్ రీసెర్చ్ (Hindenburg Research)రిపోర్టు గత నెల 24న వెల్లడైన తర్వాతి నుంచి అదానీ గ్రూప్ కంపెనీ స్టాక్‍ల్లో రక్తపాతం కొనసాగుతోంది. అదానీ గ్రూప్‍లోని 10 కంపెనీల షేర్లు విపరీతంగా పడిపోతున్నాయి. జనవరి 24 తర్వాత అదానీ ఎంటర్ ప్రైజెస్ మార్కెట్లు విలువ దాదాపు రూ.2.46లక్షల కోట్లు (సుమారు 60 శాతం) తుడిచిపెట్టుకుపోయింది. అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ రూ.3.48లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‍ను కోల్పోయింది. అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ కూడా చెరో రూ.2లక్షల కోట్లకు పైగా విలువను కోల్పోయాయి.
అదానీ పవర్ రూ.42,522 కోట్లు, అదానీ పోర్ట్స్ రూ.51,413 కోట్లు, అంబుజా సిమెంట్స్ రూ.31,542 కోట్ల మార్కెట్ విలువను ఒక్క నెలలో కోల్పోయాయి.
Adani Group Stocks: అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్ ధర సోమవారం (ఫిబ్రవరి 27) సెషన్‍లో మధ్యాహ్నం 12.30 గంటల నాటికి 8.88 శాతం పతనమై రూ.1,198 వద్ద ట్రేడ్ అవుతోంది. నెలలో ఈ కంపెనీ షేర్ విలువ 64శాతం వరకు పడిపోయింది.
సోమవారం ట్రేడింగ్ సెషన్‍లో అదానీ పవర్ (రూ.139.35), అదానీ విల్మర్ (రూ.344.45) 5 శాతం పతనమయ్యాయి. నెల రోజుల్లో అదానీ పవర్ 49 శాతం, అదానీ విల్మర్ 40 శాతం పడిపోయాయి.
అదానీ గ్రూప్ పరిధిలోని అంబుజా సిమెంట్స్ షేర్ (రూ.327) సోమవారం సెషన్‍లో 5 శాతం, ఏసీసీ లిమిటెడ్ స్టాక్ (రూ.1,661) 4 శాతం క్షీణించాయి. అదానీ టోటల్ గ్యాస్ (రూ.714.25), అదానీ ట్రాన్స్ మిషన్ (రూ.676.70), అదానీ ఎనర్జీ (రూ.462.20) 5 శాతం లోవర్ సర్క్యూట్‍లో 5 శాతం నష్టాలను చవిచూశాయి.
అదానీ గ్రూప్‍లో అదానీ పోర్ట్స్ ఒక్కటే కాస్త పతనంలో తక్కువగా ఉంది. సోమవారం సెషన్‍లో అదానీ పోర్ట్స్ షేర్ 0.41 శాతం పడిపోయి రూ.556 వద్దకు చేరింది. అదానీ పోర్ట్స్ షేర్ నెలలో 6 శాతం మాత్రమే పతనమైంది. ఇక, అదానీ గ్రూప్ చేజిక్కించుకున్న ఎన్‍డీటీవీ షేర్ కూడా నేటి సెషన్‍లో 4.98 శాతం పడిపోయి రూ.181.10 వద్దకు పడిపోయింది.
సంబంధిత కథనం