Edible oil prices : గుడ్ న్యూస్.. రూ. 30 తగ్గిన వంట నూనెల ధరలు
18 July 2022, 14:54 IST
- Edible oil prices : వంట నూనెల ధరలను రూ. 30 తగ్గిస్తున్నట్టు అదానీ విల్మర్ సంస్థ వెల్లడించింది. ఫలితంగా ఫార్చ్యూన్‌కు చెందిన వివిధ వంట నూనెల ధరలు దిగొచ్చాయి.
గుడ్ న్యూస్.. రూ. 30 తగ్గిన వంట నూనె ధర
Edible oil prices : తమ బ్రాండ్‌లోని వంట నూనెల ధరలను తగ్గిస్తున్నట్టు అదానీ విల్మర్ సంస్థ సోమవారం ప్రకటించింది. అంతర్జాతీయంగా వంట నూనెల ధరలు తగ్గుతుండటమే ఇందుకు కారణమని పేర్కొంది. వంట నూనెల ధరల మీద లీటరుకు రూ. 30ని తగ్గించింది. త్వరలోనే సవరించిన రేట్లతో కూడిన సరకు మార్కెట్లకు చేరుతుందని స్పష్టం చేసింది.
అంతర్జాతీయంగా ధరలు దిగొస్తున్న నేపథ్యంలో.. ప్రజలకు ఉపశమనం కల్పించాలని కేంద్రం ఆహార మంత్రిత్వశాఖ చేసిన సిఫార్సుల మేరకు అదానీ విల్మర్ ఈ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.
అదానీ విల్మర్ సంస్థ.. 'ఫార్చ్యూన్' బ్రాండ్‌తో వివిధ వంట నూనెల ప్రాడక్టులను అమ్ముతోంది. తాజాగా.. సోయాబీన్ ఆయిల్ ధరలను లీటరుకు రూ. 195 నుంచి రూ. 165కి తగ్గించింది. సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర లీటరుకు రూ. 210 నుంచి రూ. 199కు దిగొచ్చింది. ఆవాల నూనె మీద లీటరుకు రూ. 5 తగ్గింది. ఫలితంగా ప్రస్తుతం ఆ బ్రాండ్‌లో ఆవాల నూనె ధర రూ. 190గా ఉంది.
Adani Wilmar : ఫార్చ్యూన్ రైస్ బ్రాన్ ఆయిల్‌పై లీటరు రూ. 225గా ఉండగా.. ప్రస్తుతం ఆ ధర రూ. 210కు దిగొచ్చింది. వేరుసెనగ నూనె ధర లీటరుకు రూ. 220 నుంచి రూ. 210కి మారింది.
పండుగ సీజన్ వస్తుండటంతో.. ధరలు తగ్గిస్తే డిమాండ్ పెరుగుతుందని సంస్థ భావిస్తోంది.
దేశంలోని ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థల్లో అదానీ విల్మర్ ఒకటి. వంట నూనెల నుంచి వంటింట్లో కావాల్సిన దాదాపు అన్ని సరకులను ఈ సంస్థ విక్రయిస్తోంది.
టాపిక్