Edible oils : వంట నూనెల ధరల తగ్గుముఖం….-govt expects more companies to reduce mrp of edible oils ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Edible Oils : వంట నూనెల ధరల తగ్గుముఖం….

Edible oils : వంట నూనెల ధరల తగ్గుముఖం….

HT Telugu Desk HT Telugu
Jul 09, 2022 11:11 AM IST

దేశంలో వంట నూనెల ధరలు దిగిరానున్నాయి. దేశ వ్యాప్తంగా గత నాలుగు నెలలుగా చుక్కలనంటుతోన్న వంట నూనెల ధరల్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం కంపెనీలకు సూచించింది.

తగ్గనున్న వంట నూనెల ధరలు
తగ్గనున్న వంట నూనెల ధరలు (Bloomberg)

దేశంలో వంట నూనెల ధరలు చుక్కలనంటుతుండటంతో వాటిని వీలైనంత వరకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి సంస్థలకు సూచించింది. ఎమ్మార్పీపై కనీసం 15రుపాయలు తగ్గించాలని, అంతర్జాతీయంగా ధరలు దిగి వస్తుండటంతో ఆ ప్రయోజనాలను ప్రజలకు అందించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దేశీయ మార్కెట్లలో వంట నూనెల ధరలు అమాంతం పెరగడంతో ప్రజలపై తీవ్ర భారం పడుతోంది. ఓ దశలో గరిష్ట ధర రూ.200 మార్కును దాటేసింది. ఏప్రిల్‌లో ఉక్రెయిన్‌పై రష్యా దాడులతో దేశీయంగా వంట నూనెల ధరల పెరుగుదల ప్రారంభమైంది. మార్చిలో రూ.135ఉన్న రిఫైండ్ ఆయిల్‌ ధర ఏప్రిల్‌లో రూ.200కు చేరువైంది. ఈ నేపథ్యంలో వంట నూనె గింజల ఉత్పత్తి గణనీయంగా పెరగడం అన్ని దేశాలలో లభ్యత పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు తగ్గుముఖం పట్టాయి.

దేశీయ మార్కెట్లలో వంట నూనె ధరల భారంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ధరలు తగ్గించాలని పదేపదే కేంద్రం సూచిస్తున్నా కంపెనీలు మాత్రం ధరలు కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ సూచనలతో ఆయిల్ కంపెనీలు వంట నూనెల ధరల్ని తగ్గించే ప్రయత్నాలు ప్రారంభించాయి. మదర్ డైరీ సోయాబీన్ నూనె ధరను రూ.14 రుపాయలు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. రిఫైండ్‌ ఆయిల్‌ ధర కూడా వారం పదిరోజుల్లో రూ.15వరకు తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న నిల్వలు పూర్తయ్యే సరికి కొత్త ధరల ప్యాకింగ్ అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.

దేశ రాజధానిలో ధారా బ్రాండ్‌ పేరుతో వంట నూనెల్ని విక్రయిస్తున్న మదర్ డైరీ నేషనల్ క్యాపిటల్ రీజియన్‌లో ప్రముఖ బ్రాండుగా ఉంది. దేశీయ వంట నూనెల మార్కెట్ అవసరాలు దాదాపు 60శాతం దిగుమతుల మీద ఆధారపడి సాగుతోంది. దేశంలో ప్రముఖ బ్రాండ్లు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ఖాతరు చేయకుండా వంట నూనె ధరల్ని గరిష్ట ధరలకు విక్రయించడంపై కూడా కేంద్రం గమనిస్తోంది. కొన్ని ప్రముఖ బ్రాండ్ల ఎమ్మార్పీ ధరలు ఇతర బ్రాండ్ల ధరల కంటే ఎక్కువగా ఉండటంతో ఖచ్చితంగా అన్ని సంస్థలు ధరలు తగ్గించాల్సిందేనని కేంద్ర వినియోగ దారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేస్తోంది.

మార్కెట్లో వంట నూనెల ధరల పెరుగుదల ను నిరంతరం గమనిస్తున్న కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు తగ్గుముఖం పట్టినందున వినియోగదారులకు కూడా ధరలు తగ్గించాలని సూచిస్తోంది. దేశీయ మార్కెట్లలో విక్రయాలను అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా మారుమూల మార్కెట్లలో వంట నూనెల ధరలు కూడా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది.

వంటింటి బడ్జెట్‌ భారం గణనీయంగా పెరగడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంబింభించింది. జులై 6న దిగుమతి దారులతో నిర్వహించిన సమావేశంలో వంట నూనెల ఉత్పత్తి సంస్థలు, రిఫైనర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నూనెల ధరల విషయంలో ప్రజలపై భారం మోపేలా వ్యవహరించవద్దని ఆదేశించింది.

IPL_Entry_Point

టాపిక్