Sydney stabbing attack: సిడ్నీ లో కత్తి తో దుండగుడి వీరంగం; కత్తిపోట్లకు ఆరుగురు మృతి
Published Apr 13, 2024 02:22 PM IST
Sydney stabbing attack: శనివారం మధ్యాహ్నం దుకాణదారులతో కిక్కిరిసిన విశాలమైన వెస్ట్ ఫీల్డ్ బోండీ జంక్షన్ మాల్ కాంప్లెక్స్ లో ఒక దుండగుడు కత్తి పట్టుకుని విచక్షణారహితంగా కనిపించిన వారినల్లా కత్తితో పొడిచాడు. ఈ కత్తి దాడిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
సంఘటనా స్థలం వద్ద పోలీసులు
Sydney stabbing attack: ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలోని బోండి జంక్షన్ లో రద్దీగా ఉండే వెస్ట్ ఫీల్డ్ షాపింగ్ సెంటర్ లో శనివారం ఉదయం కత్తితో ఒక దుండగుడు వీరంగం సృష్టించాడు. కత్తితో మాల్ లోని వారిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆ దుండగుడి కత్తి దాడిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా పోలీసులు నిందితుల్లో ఒకరిని కాల్చిచంపారు. నిందితుడు ఒక్కరేనా? లేక ఎక్కువ మంది ఉన్నారా? అనే విషయంలో స్పష్టత లేదు. కానీ, ఆ దుండగుడు ఒక్కడేనని పోలీసులు తెలిపారు. పోలీసుల కాల్పుల్లో అతడు మరణించాడని, ఇకపై ఎలాంటి ముప్పు లేదని పోలీసులు తెలిపారు.
మాల్ ఖాళీ
అధికారులు సిడ్నీలో కత్తి దాడి ఘటన జరిగిన షాపింగ్ కాంప్లెక్స్ నుంచి దుకాణదారులను, వినియోగదారులను ఖాళీ చేయిస్తున్నారు. సాయుధ పోలీసుల బృందం ఇంకా ఎవరైనా నిందితులు మాల్ లో దాక్కుని ఉన్నారేమోనన్న కోణంలో ఆ షాపింగ్ మాల్ ను నలుమూలలా గాలిస్తున్నారు. షాపింగ్ సెంటర్ చుట్టూ అంబులెన్స్ లు, పోలీసు కార్లు ఉన్నట్లు పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఘటనా స్థలంలో పారామెడికల్ సిబ్బంది రోగులకు చికిత్స అందిస్తున్నారు.