తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్; 18 మంది మావోల మృతి

Chhattisgarh encounter: ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్; 18 మంది మావోల మృతి

HT Telugu Desk HT Telugu

17 April 2024, 8:22 IST

google News
    • ఛత్తీస్ గఢ్ లో మంగళవారం భద్రత బలగాలు, నక్సలైట్ల మధ్య భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. నక్సల్స్ ఏరివేత ఆపరేషన్ లో భాగంగా ఛోటేబెతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న భద్రత బలగాలపై మావోలు కాల్పులు జరపడంతో ఈ ఎన్ కౌంటర్ ప్రారంభమైందని పోలీసులు తెలిపారు.
బస్తర్ అటవీ ప్రాంతంలో భద్రతాబలగాల కూంబింగ్
 (File Photo)
బస్తర్ అటవీ ప్రాంతంలో భద్రతాబలగాల కూంబింగ్ (File Photo)

బస్తర్ అటవీ ప్రాంతంలో భద్రతాబలగాల కూంబింగ్ (File Photo)

Chhattisgarh encounter: ఛత్తీస్ గఢ్ లోని కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో 18 మంది మావోయిస్టులు హతమయ్యారని సరిహద్దు భద్రతా దళం మంగళవారం తెలిపింది. పక్కా సమాచారంతో బీఎస్ఎఫ్ జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG)తో కలిసి కాంకేర్ లోని చోటేబెతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బినగుండా ప్రాంతంలో సంయుక్త ఆపరేషన్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్ సందర్భంగా బీఎస్ఎఫ్ బృందంపై నక్సలైట్లు అకస్మాత్తుగా తీవ్రస్థాయిలో కాల్పులు జరిపారు. బీఎస్ఎఫ్ బలగాలు వారిపై ఎదురుదాడికి దిగడంతో ఎన్ కౌంటర్ (encounter) జరిగింది.

కొనసాగుతున్న ఎన్ కౌంటర్

ఇప్పటివరకు ఈ ఎదురకాల్పుల్లో 18 మంది మావోయిస్టులు చనిపోయారని, కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నందున ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని కంకేర్ పోలీసు సూపరింటెండెంట్ కల్యాణ్ ఎలెసెలా వెల్లడించారు. ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి 18 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు బీఎస్ఎఫ్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఘటనా స్థలం నుంచి ఏడు ఏకే సిరీస్ రైఫిల్స్, మూడు లైట్ మెషిన్ గన్స్ (LMG)లను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించింది. ఈ కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది గాయపడ్డారని కంకేర్ ఎస్పీ కళ్యాణ్ తెలిపారు. వారిలో ఒక బీఎస్ఎఫ్ జవాను కాలికి బుల్లెట్ గాయమైందని వెల్లడించారు. యాంటీ నక్సల్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని తెలిపారు.

ఎన్నికల ముందు..

ఛత్తీస్ గఢ్ లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కావడానికి కొద్ది రోజుల ముందు ఈ ఎన్ కౌంటర్ (encounter) చోటు చేసుకుంది. ఏప్రిల్ 19న తొలి దశ లోక్ సభ పోలింగ్ లో బస్తర్ లోక్ సభ నియోజకవర్గానికి మాత్రమే పోలింగ్ జరుగనుంది. కాగా, ఈ రోజు ఎన్ కౌంటర్ జరిగిన కంకేర్ తో పాటు రాజ్ నంద్ గావ్, మహాసముంద్ లలో రెండో దశలో ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. 2023 డిసెంబర్ నుంచి కంకేర్ సహా ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన వేర్వేరు ఎన్ కౌంటర్ లలో 68 మంది మావోయిస్టులు హతమయ్యారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం 2023లో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య మొత్తం 70 ఎన్ కౌంటర్లు జరగ్గా, 22 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ సమయంలో మొత్తం 394 మంది మావోయిస్టులను భద్రతా దళాలు అరెస్టు చేశాయి.

తదుపరి వ్యాసం