ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో బుధవారం జరిగిన ఎదురుకాల్పుల్లో (Chhattisgarh encounter) ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. వారిలో ఒక మహిళా మావోయిస్టు కూడా ఉన్నారు. ఎన్ కౌంటర్ జరిగిన చికుర్భట్టి, పుస్బాకా గ్రామాల చుట్టూ ఉన్న అడవుల్లోని ప్రాంతాన్ని గాలిస్తున్నామని బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ సుందర్రాజ్ తెలిపారు.
‘‘ఈ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారం అందింది. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), దాని ఎలైట్ యూనిట్ కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రెసల్యూట్ యాక్షన్) బృందాన్ని ఆపరేషన్ కోసం పంపారు. చికుర్భట్టి, పుస్బాకా గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలపై మావోలు కాల్పులు జరపడం ప్రారంభించారు. భద్రతా బలగాలు ఎదురు కాల్పులు (Chhattisgarh encounter) జరిపాయి. కాల్పులు ఆగిపోయిన తరువాత ఆ ప్రదేశంలో ఆరుగురు మావోయిస్ట్ ల మృతదేహాలను గుర్తించాం’’ అని బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ సుందర్రాజ్ తెలిపారు. మృతుల్లో ఒక మహిళ సహా ఆరుగురు మావోయిస్టులున్నారన్నారు. అయితే, ఆ మావోయిస్టుల మృతదేహాలను ఇంకా గుర్తించలేదని, అడవిలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి కోసం గాలింపు కొనసాగుతోందని ఆయన తెలిపారు. బీజాపూర్ జిల్లా బస్తర్ లోక్ సభ నియోజకవర్గంలో ఉంది. ఇక్కడ ఏప్రిల్ 19 న లోక్ సభ ఎన్నికల మొదటి దశలో పోలింగ్ జరుగుతుంది.