Goverment employees salary : ప్రభుత్వ ఉద్యోగులకు షాక్! 13లక్షల మంది జీతాలు ఆపేస్తామంటూ..
23 August 2024, 6:40 IST
- Goverment employees salary freeze : ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్! ఆస్తుల వివరాలు చెప్పకపోతే, ఈ నెల జీతాలను నిలిపివేస్తామని యూపీ ఉద్యోగులను ప్రభుత్వం హెచ్చరించింది. 13లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులపై ఈ ప్రభావం పడనుంది.
ఉద్యోగులకు ప్రభుత్వం షాక్! జీతాలు ఆపేస్తామంటూ..
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ఉత్తర్ప్రదేశ్ గవర్న్మెంట్ గట్టి షాక్ ఇచ్చింది! ఆగస్టు 31లోగా తమ చరాస్తులు, స్థిరాస్తులను ప్రకటించాలని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను పాటించకపోతే 13 లక్షల మందికిపైగా ప్రభుత్వ ఉద్యోగులు జీతాలను ఫ్రీజ్ చేస్తామని తేల్చిచెప్పింది.
అసలు విషయం ఏంటంటే..
ఉద్యోగులు తమ ఆస్తుల వివరాలను ప్రభుత్వ మానవ సంపద పోర్టల్ (మానవ వనరుల నిర్వహణ వ్యవస్థ)లో సమర్పించాలని గత ఏడాది ఆగస్టులో ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఆదేశాలు అన్ని కేటగిరీల అధికారులు, ఉద్యోగులకు వర్తిస్తాయని, వాటిని పాటించడంలో విఫలమైతే జీతాలను ఫ్రీజ్ చేయడంటో పాటు పదోన్నతులకు అనర్హులవుతారని ప్రభుత్వం తాజాగా పేర్కొంది.
అవినీతిని అరికట్టి పాలనను మెరుగుపరిచేందుకు ఉద్యోగులందరు తమ ఆస్తుల వివరాలను ప్రకటించాలని ప్రభుత్వం చెబుతోంది.
వాస్తవానికి ఈ ప్రక్రియ గడవు ఇప్పటికే ముగిసిపోయింది. కానీ మాటిమాటికి గడువును పెంచుతూ వచ్చింది యూపీ ప్రభుత్వం. మొదటి డిసెంబర్ 31 గడువును జూన్ 30 వరకు, తరువాత జులై 31 వరకు అనేకసార్లు పొడిగించినప్పటికీ, రాష్ట్రంలోని 1.78 మిలియన్ల ఉద్యోగుల్లో 26% మంది మాత్రమే ఆదేశాలను పాటించారు. గడువులోగా ఆస్తుల వివరాలు సమర్పించిన వారికే జీతాలు అందుతాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ సింగ్ స్పష్టం చేశారు. దీంతో 1.3 మిలియన్లకు పైగా ఉద్యోగులకు ఆగస్టు జీతాలు అందని ప్రమాదం ఉంది.
ఇదీ చూడండి:- India Post GDS merit list: ‘గ్రామీణ్ డాక్ సేవక్’ మెరిట్ లిస్ట్ విడుదల చేసిన ఇండియా పోస్ట్; ఆ రెండు రాష్ట్రాల్లో వాయిదా
2023 ఆగస్టులో, ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం 70 మందికి పైగా ప్రాంతీయ అటవీ అధికారుల బదిలీ ఉత్తర్వులను రద్దు చేసి, బదిలీలో అవకతవకలపై దర్యాప్తునకు ఆదేశించిన తరువాత ప్రభుత్వ సిబ్బంది మెరిట్ ఆధారిత ఆన్లైన్ బదిలీ కోసం మానవ్ సంపద పోర్టల్లో అన్ని ప్రభుత్వ అధికారులు / ఉద్యోగుల డేటాను అప్లోడ్ చేయాలని, ధృవీకరించాలని అన్ని విభాగాల అధిపతులను ఆదేశించింది.
మరోవైపు వచ్చే రెండేళ్లలో 2,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని యోచిస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం ఒక అధికారిక ప్రకటనలో తెలిపారు.
శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 60 వేలకు పైగా పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుందని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
రాబోయే ఉద్యోగ నియామకాల్లో స్థానిక యువత చురుగ్గా పాల్గొనాలని, వారి సామర్థ్యాలను ఎవరూ ప్రశ్నించబోరని స్పష్టం చేశారు. యువత భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నం చేస్తే జైలు శిక్ష, ఆస్తుల జప్తు సహా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.