Cheating Couple: షేర్ మార్కెట్లో పెట్టుబడులు, ఉద్యోగాల పేరున 5 కోట్ల వరకు టోకరా, దంపతుల అరెస్ట్-in the name of investments and jobs in the share market a couple was arrested for extorting up to 5 crores ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cheating Couple: షేర్ మార్కెట్లో పెట్టుబడులు, ఉద్యోగాల పేరున 5 కోట్ల వరకు టోకరా, దంపతుల అరెస్ట్

Cheating Couple: షేర్ మార్కెట్లో పెట్టుబడులు, ఉద్యోగాల పేరున 5 కోట్ల వరకు టోకరా, దంపతుల అరెస్ట్

HT Telugu Desk HT Telugu
Aug 23, 2024 06:06 AM IST

Cheating Couple: జనాల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఓ జంట మోసాలకు తెరలేపింది. వివిధ భాషల్లో నైపుణ్యం సంపాదించి, పుణె, వైజాగ్, హైదరాబాద్, వరంగల్ లాంటి నగరాల్లో జనాలను షేర్ మార్కెట్ లో పెట్టుబడులు, మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు అంటూ మోసాలకు పాల్పడింది. చివరకు కటకటాల పాలయ్యారు.

వరంగల్‌లో మోసాలకు పాల్పడిన జంట అరెస్ట్
వరంగల్‌లో మోసాలకు పాల్పడిన జంట అరెస్ట్

Cheating Couple:

జనాల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఓ జంట మోసాలకు తెరలేపింది. వివిధ భాషల్లో నైపుణ్యం సంపాదించి, పుణె, వైజాగ్, హైదరాబాద్, వరంగల్ లాంటి నగరాల్లో జనాలను షేర్ మార్కెట్ లో పెట్టుబడులు, మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు అంటూ మోసాలకు పాల్పడింది. చివరకు ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారి అసలు రంగు బయట పడింది. షేర్ మార్కెట్ లో పెట్టుబడులు, మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు అంటూ మోసాలకు పాల్పడుతున్న దంపతులను వరంగల్ టాస్క్ ఫోర్స్, సుబేదారి పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. వారి అరెస్ట్ కు సంబంధించిన వివరాలను సుబేదారి సీఐ పి.సత్యనారాయణ రెడ్డి గురువారం వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్ కతాకు చెందిన నిమిత్ కపాసి అలియాస్ అమిత్ కుమార్ షా కొంతకాలం కిందట తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహా నగరానికి వచ్చాడు. అక్కడ కోఠి బస్టాండ్ సమీపంలోని ఇస్లామియా బజార్ కు చెందిన కాసోజు జయ అలియాస్ సుమన్ కపాసితో పరిచయం ఏర్పడగా ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇదివరకే ఈజీ మనీకి అలవాటు పడిన నిమిత్ కపాసి తామిద్దరూ బతకడానికి మోసాలను ఎంచుకున్నారు.

నకిలీ ఐడీ కార్డులతో బురిడీ

నిమిత్ కపాసి అలియాస్ అమిత్ కుమార్ షా భార్య అయిన కాసోజు జయ అలియాస్ సుమన్ కపాసి గతంలో ఓ అధార్ ఏజెన్సీలో పని చేసింది. కాగా ఆమెకు ఉన్న అనుభవాన్ని తమ ఆదాయ వనరుగా మార్చేందుకు నిమిత్ కపాసి ప్లాన్ వేశాడు. ఈ మేరకు ఇద్దరూ కలిసి హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, బెంగాళి భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. అనంతరం పెట్టుబడులు, ఉద్యోగాల పేరున అమాయలకు మోసం చేసేందుకు ప్లాన్ రచించారు. తమ ప్లాన్ లో భాగంగా ముందుగా తమ ఫొటోలు, నకిలీ పేర్లతో కూడిన సీబీఐ, మీడియా, బ్యాంక్ మేనేజర్లు, కన్సల్టెన్సీ ఓనర్లమంటూ ఐడీ కార్డులు తయారు చేసుకున్నారు. అనంతరం ఎదుటి వారి భాషను బట్టి హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, బెంగాలి భాషల్లో అనర్గళంగా మాట్లాడుతూ జనాలతో మాట కలిపేవారు. అనంతరం అవతలి వ్యక్తుల స్వభావాన్ని బట్టి సీబీఐ, ప్రెస్, బ్యాంక్ మేనేజర్ తదితరుల పేరున నకిలీ ఐడీ కార్డులు చూపించి పరిచయం పెంచుకోవడం స్టార్ట్ చేసేవారు. ఆ తరువాత షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని, వివిధ మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ అమాయకులను బోల్తా కొట్టించేవారు. వారిని నమ్మించి డబ్బులు వసూలు చేసిన అనంతరం అక్కడి నుంచి ఉడాయించేవారు.

రూ.5 కోట్ల వరకు వసూలు.. చివరకు చిక్కారిలా..

నిమిత్ కపాసి, సుమన్ కపాసి దంపతులు విశాఖపట్నం, పుణె, హైదరాబాద్, వరంగల్ తదితర నగరాల్లో ఒకదాని తరువాత ఒకటి కన్సల్టెన్సీ కంపెనీలు ఓపెన్ చేశారు. ఆయా చోట్లా జనాలను పెట్టుబడులు, ఉద్యోగాల పేరున మోసం చేసి రూ.5 కోట్ల వరకు వసూలు చేశారు. చివరకు వరంగల్ ట్రై సిటీలోని హనుమకొండ సుబేదారి సాయినగర్ కాలనీకి తమ మకాం మార్చారు. అక్కడ ఓ రూమ్ ను అద్దెకు తీసుకుని స్పీకింగ్ సీస్ కన్సల్టెంట్ కంపెనీ పెట్టారు. ఉద్యోగాల పేరున వివిధ వ్యక్తుల నుంచి రూ.1.30 కోట్ల వరకు వసూలు కూడా చేశారు. అదే కన్సల్టెన్సీ కంపెనీని అప్రోచ్ అయిన జులైవాడకు చెందిన రియాజ్ అనే వ్యక్తి ఉద్యోగం కోసం వారికి, రూ.లక్షల్లో ముట్టజెప్పాడు. అయినా కపాసి దంపతులు చెప్పిన ప్రకారం ఉద్యోగం విషయంలో కదలిక లేకపోవడంతో తాను మోసపోయినట్టు తెలుసుకున్నాడు. కొద్దిరోజుల కిందట వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బాధితుని ఫిర్యాదు మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితుల కూపీ లాగారు. ఈ క్రమంలో తాము కపాసి దంపతులు హనుమకొండ నుంచి ఇతర ప్రాంతాలకు పరార్ అవుతుండగా.. టాస్క్ ఫోర్స్, సుబేదారి పోలీసులు సంయుక్తంగా వారిని అరెస్ట్ చేశారు. వారి నుంచి నకిలీ సీబీఐ, ప్రెస్, బ్యాంక్ మేనేజర్ ఐడీ కార్డులతో పాటు నకిలీ ఆధార్, పాన్ కార్డులు, రూ.7,800 నగదు, 13 నకిలీ బ్యాంక్ చెక్ బుక్స్ సీజ్ చేశారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సిబ్బందిని సీఐ సత్యనారాయణ రెడ్డి అభినందించారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)