తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jhansi Hospital Fire : మాటలకందని విషాదం! హాస్పిటల్​లో అగ్నిప్రమాదంతో 10 మంది శిశువులు మృతి

Jhansi Hospital fire : మాటలకందని విషాదం! హాస్పిటల్​లో అగ్నిప్రమాదంతో 10 మంది శిశువులు మృతి

Sharath Chitturi HT Telugu

16 November 2024, 6:02 IST

google News
    • Jhansi medical college fire : ఉత్తర్​ ప్రదేశ్​లో తీవ్ర విషాదం నెలకొంది. ఝాన్సీలోని ఓ హాస్పిటల్​లో అగ్నిప్రమాదం కారణంగా 10మంది పసికందులు ప్రాణాలు కోల్పోయారు. మరో 16మంది గాయపడ్డారు.
ఘటనాస్థలం వద్ద దృశ్యాలు..
ఘటనాస్థలం వద్ద దృశ్యాలు.. (via HT)

ఘటనాస్థలం వద్ద దృశ్యాలు..

ఉత్తరప్రదేశ్​ ఝాన్సీలో తీవ్ర విషాదం నెలకొంది! మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్​ఐసీయూ)లో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం 10 మంది నవజాత శిశువులు మృతి చెందారు. మరో 16 మంది గాయపడ్డారు!

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని, మరణించిన పిల్లలు ఆ సమయంలో ఇంక్యుబేటర్లలో ఉన్నారని కాన్పూర్ జోన్ ఏడీజీ అలోక్ సింగ్ వెల్లడించారు. ఝాన్సీ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం ఘటన సమయంలో వార్డులో మొత్తం 47 మంది చిన్నారులు ఉన్నారని తెలిపారు.

ఘటనా స్థలాన్ని సందర్శించిన ఝాన్సీ డీఐజీ కళానిధి నైతానీ మృతులంతా చిన్నారులేనని, మరో 16 మంది గాయపడ్డారని వివరించారు.

ఝాన్సీ జిల్లా మెజిస్ట్రేట్ మాట్లాడుతూ.. రాత్రి 10:30 నుంచి 10:45 గంటల మధ్య ఎన్​ఐసీయూ యూనిట్​లో షార్ట్ సర్క్యూట్ సంభవించి మంటలు చెలరేగాయని తెలిపారు. యూనిట్ బయట ఉన్న పిల్లలను సిబ్బంది కాపాడినట్టు స్పష్టం చేశారు.

“లోపల ఉన్న వారిలో చాలా మందిని రక్షించారు, కానీ దురదృష్టవశాత్తు, ఇప్పటివరకు 10 మంది పిల్లలు మరణించారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీం వెంటనే స్పందించి పలువురు చిన్నారులను కాపాడగలిగారు. తీవ్రంగా గాయపడిన వారికి వైద్య సేవలు అందిస్తున్నాం. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగిందని డ్యూటీ సిబ్బంది చెబుతున్నారు,” అని అన్నారు.

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం యోగి ఆదిత్యనాథ్ సహాయక చర్యలను వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు సరైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

ఝాన్సీ జిల్లాలో ఉన్న మెడికల్ కాలేజీ ఎన్ఐసీయూలో జరిగిన అగ్నిప్రమాదంలో చిన్నారులు మృతి చెందడం చాలా బాధాకరమని సీఎం యోగి అన్నారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని, సంబంధిత అధికారులను ఆదేశించారు. మరణించిన చిన్నారుల ఆత్మకు శాంతి చేకూరాలని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని శ్రీరాముడిని ప్రార్థిస్తున్నట్టు వెల్లడించారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఉపముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్.. ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిని ఝాన్సీకి పంపి పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ ఘటనపై విచారణ జరిపి 12 గంటల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని కమిషనర్, డీఐజీలను సీఎం యోగి ఆదేశించారు.

రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని, వీలైనంత ఎక్కువ మంది పిల్లలను రక్షించేందుకు బృందాలు పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు.

మరోవైపు, రికవరీ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి తాము కట్టుబడి ఉన్నామని, జేడీఎన్ ఎంఎల్​బీ ఝాన్సీ కళాశాల బృందాన్ని సమీకరించామని, సహాయక చర్యలకు మద్దతు ఇస్తున్నట్లు ఐఎంఏ జూనియర్ డాక్టర్స్ నెట్​వర్క్ ఒక ప్రకటన విడుదల చేసింది.

తదుపరి వ్యాసం
నోటిఫికేషన్ సెంటర్