Peddapalli Deaths: పెద్దపల్లి జిల్లాలో షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం.. తల్లి కూతురు సజీవ దహనం
Peddapalli Deaths:పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్దమయింది. ఇంట్లో ఉన్న తల్లి కూతురు సజీవ దహనం అయ్యారు. ఇద్దరు మహిళలతో పాటు ఇంట్లో పెంపుడు కుక్క, కోళ్ళు సామాగ్రి అంతా కాలిబూడిదయ్యాయి
Peddapalli Deaths: రామగిరి మండలం రత్నాపూర్ గ్రామ పంచాయితీ పరిధిలోని రాంనగర్ లో ఈ దారుణం జరిగింది. గడ్డం కనకయ్య ఇంట్లో రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్న కనకయ్య భార్య కోమురమ్మ (45), కొమురమ్మ తల్లి కల్వల పోచమ్మ (65) సజీవ దహనం అయ్యారు. వారిద్దరితో పాటు ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క, కోళ్ళు కాలిపోయాయి. మంటలు చెలరేగి ఇంట్లో సామాగ్రి అంతా కాలి బూడిదయ్యాయి. కరెంట్ షార్ట్ సర్క్యూట్ తోనే అగ్నిప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు.
ప్రమాద సమయంలో ఇంట్లో లేని కనకయ్య
ఇంత ఘోర ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో కనకయ్య లేరు. రాత్రి లేటుగా వచ్చే సరికి ఇళ్ళు కాలిపోయి, మంచంపైనే భార్య, అత్త సజీవ దహనం కావడం చూసి బోరున విలపించారు. కనకయ్య తన భార్య, అత్తతో కలిసి ఇల్లు అద్దెకు తీసుకొని జీవనం సాగిస్తున్నారు. అగ్ని ప్రమాదంతో కనకయ్య కట్టు బట్టలతో మిగిలాడు.
ప్రమాదానికి కరెంటు షార్ట్ సర్క్యూటే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అగ్ని ప్రమాదంతో ఇంట్లోని గృహపకరణాలు కూలర్, విద్యుత్ వైర్లు, కాలిపోయాయని గోదావరిఖని ఏసీపి రమేష్ తెలిపారు. ప్రమాదంలో రెండు మూగజీవాలు బలి కావడంతో పశువైద్యాధికారులతో పంచనామా నిర్వహించారు.
అనుమానాలు…
కరెంట్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాద సంభవించి ఇల్లు దగ్ధమైందని పోలీసులు భావిస్తున్నప్పటికీ ఘటన స్థలాన్ని పరిశీలిస్తే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంటలు చెలరేగి ఇళ్ళంతా వ్యాపించి సామాగ్రిఅంతా దగ్ధం కాక తల్లి కూతురు మంచం పైనే ప్రాణాలు వదిలారు. కూతురు ఒంటిపై ఉన్న బట్టలు కాలిపోగా, తల్లి ఒంటిపై ఉన్న బట్టలు కొద్దిగానే కాలాయి. ఒంటిపై మాత్రం కాలిన గాయాలు ఉన్నాయి. మంచం కిందనే పెంపుడు కుక్క కాస్త కాలి ప్రాణాలు కోల్పోయింది.
మంటలు ధాటికి కుక్క బయటకి పరిగెత్తే ప్రయత్నం చేయలేదా?.. ఇంట్లో వాళ్ళు అరుపులు కేకలు బయట వాళ్లకు వినపడలేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ కుక్క అరిచినా, మంటల దాటికి తల్లి కూతురు కేకలు వేసిన చుట్టుపక్కల వాళ్ళు లేచే అవకాశం ఉంటుంది. కానీ కాలిబూడిదయ్యే వరకు ఎవరు చూడలేదంటే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఎవరైనా వారిని హతమార్చి నిప్పంటించారా అనే అనుమానాలు ఉన్నాయి. పోలీసులు మాత్రం కరెంటు షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగినట్లు భావిస్తూ ప్రమాదంపై సమగ్ర విచారణ జరుగుతుందని ప్రకటించారు.
(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)