TG Farmers : రైతులు వరి కొయ్యలను కాలబెట్టొద్దు.. నష్టాలు ఉన్నాయంటున్న శాస్త్రవేత్తలు
TG Farmers : వరి కోతల తర్వాత రైతులు వరి కొయ్యలను తగలబెడుతున్నారు. అయితే.. దీని ద్వారా రైతులకు నష్టం జరుగుతోందని.. పర్యావరణంలో కాలుష్యం పెరుగుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అటు ప్రభుత్వం కూడా వరి కొయ్యలు తగలబెట్టొద్దని అన్నదాతలకు సూచిస్తోంది.
రైతులు వరి పంటను కోసిన తర్వాత కొయ్యలను కాలబెడితున్నారు. దీంతో భూమిలో ఉన్న కోట్ల సూక్ష్మజీవులు నశించిపోతాయని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి వివరించారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ రైతు నేస్తం కార్యక్రమంలో డాక్టర్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. చాలామంది రైతులు వరి పంట కోసిన తర్వాత మొదళ్లను కలబెడుతున్నారు. దీనివలన అనేక అనర్ధాలు జరుగుతాయని ఆయన వ్యాఖ్యానించారు. వరికొయ్యలను తగులబెట్టడం ద్వారా నేలకు మేలు చేసే క్రిమికీటకాలు కాలిపోయి నశిస్తాయని చెప్పారు. భూమిలో సారం తగ్గిపోవడం, వాయు కాలుష్యం పెరిగిపోవడం లాంటి నష్టాలు కలుగుతున్నాయని వివరించారు. మట్టిలోని సూక్ష్మజీవులు దెబ్బతింటాయని, నీటి నిల్వ తగ్గుతుందన్నారు.
అనేక ప్రయోజనాలు..
వరి కొయ్యల మొదళ్లలో ఉన్న సూక్ష్మజీవులు భూమిని సారవంతం చేయుటలో తోడ్పడతాయని ప్రభాకర్ రెడ్డి వివరించారు. మొక్కలకు అన్ని రకాల పోషక పదార్ధాలు అందించడంలో సహకరిస్తాయని చెప్పారు. భూమిని గుల్లగా మార్చి.. నీరు, గాలిని పట్టి ఉంచి మొక్కలకు అందిస్తాయన్నారు. మొక్కల వ్యర్ధాలు, సేంద్రియ పదార్ధాలు భూమిలో కుళ్లి పోవడానికి సూక్ష్మజీవులు సహకరిస్తాయన్నారు. రసాయన ఎరువులు భూమిలో వేసినప్పుడు అవి మొక్కలు తీసుకునే రూపంలో మార్చునకు తోడ్పడతాయన్నారు. ఈ సూక్ష్మజీవులు పంటపై చీడ పురుగులు రాకుండా కాపాడుతాయని చెప్పారు.
పొలానికి ఎరువుగా..
రైతులు ఈ వరి కొయ్యలను భూమిలో కలియబెట్టి మురిగేటట్లు చేస్తే.. అది పొలానికి మంచి ఎరువుగా పనిచేస్తుందని ప్రభాకర్ రెడ్డి వివరించారు. మరల వేసుకునే పంట అధికంగా పండే అవకాశం ఉందన్నారు. మాములుగా పంట అధికంగా పండాలంటే రైతులు పంట కోసిన తర్వాత పశువుల ఎరువు, కోళ్ల ఎరువు కానీ పోస్తుంటారు. అలాకాకుండా ఈ వరి కొయ్యలనే మురగబెడితే మంచి సేంద్రియ ఎరువుగా పనిచేస్తుందన్నారు. రైతులు అలాగే కొయ్యలను కాలబెట్టుకుంటూ పోతే వ్యవసాయం పాతిక సంవత్సరాలు వెనక్కి పోవడమే కాకుండా.. చివరికి పంటలు పండించడానికి పనికిరాకుండా పోతాయన్నారు.
ఆయిల్ ఫామ్ సాగుకు..
ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేయడం వలన రైతులు అధిక లాభాలు పొందవచ్చని.. ఉద్యాన శాఖ అధికారి రమేష్ స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని హబ్సీపూర్ గ్రామంలో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యాన శాఖ అధికారి రమేష్ మాట్లాడుతూ.. నీటి వసతులున్న వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ ఫామ్ తోటలు సాగు చేస్తే అధిక లాభాలు పొందవచ్చని వివరించారు.
ఫామాయిల్ సాగుకు ఇతర పంటతో పోల్చితే తక్కువ పెట్టుబడి అవసరమవుతుందని రమేష్ వివరించారు. ఫామాయిల్ సాగు చేసే రైతులు మొదటి మూడు సంవత్సరాలు అంతర పంటల ద్వారా ఆదాయం సమకూర్చుకోవచ్చన్నారు. ఈ పంటలో ఎటువంటి చీడపీడల బెడద ఉండకపోవడం వలన రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గి.. ఆదాయం పెరుగుతుందన్నారు. ఫామాయిల్ పంటకు కచ్చితమైన మార్కెట్ సదుపాయం ఉండడం వలన నీటి సదుపాయం కలిగిన రైతులు ఈ పంట సాగుకు ఆసక్తి చూపాలని సూచించారు.
(రిపోర్టింగ్- ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)