TG Farmers : మట్టిలో మాణిక్యాలు మన తెలంగాణ రైతులు.. వరి దిగుబడిలో సరికొత్త రికార్డ్-telangana farmers records highest rice yield in india ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Farmers : మట్టిలో మాణిక్యాలు మన తెలంగాణ రైతులు.. వరి దిగుబడిలో సరికొత్త రికార్డ్

TG Farmers : మట్టిలో మాణిక్యాలు మన తెలంగాణ రైతులు.. వరి దిగుబడిలో సరికొత్త రికార్డ్

Basani Shiva Kumar HT Telugu
Nov 17, 2024 05:46 PM IST

TG Farmers : తెలంగాణ రైతులు మరో ఘనత సాధించారు. వరి దిగుబడిలో రికార్డ్ సృష్టించారు. 66.77 లక్షల ఎకరాల్లో ఏకంగా 153 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి పొందారు. యావత్ భారతదేశంలొనే ఇంతటి వరి దిగుబడిని పొంది.. అరుదైన రికార్డ్ నమోదు చేశారు. దీనిపై మంత్రి ఉత్తమ్ హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణ రైతులు
తెలంగాణ రైతులు

వరి దిగుబడిలో తెలంగాణ రికార్డ్ సృష్టించిందని.. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. 66.77 లక్షల ఎకరాల్లో వరి సాగుచేస్తే.. 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయ్యిందని వివరించారు. ఇది తెలంగాణ రైతులు సాధించిన ఘన విజయమని వ్యాఖ్యానించారు.

ఏఐసీసీ మహారాష్ట్ర ఎన్నికల పరిశీలకుడిగా నియమితులైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. అక్కడ జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూనే ఇక్కడి పరిస్థితులను మానిటరింగ్ చేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లు, ధాన్యం దిగుబడిని తెలుసుకున్న ఆయన.. మహారాష్ట్ర నుండి ప్రకటన విడుదల చేశారు. ధాన్యం దిగుబడి ఘనత ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

'కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన మూడు బ్యారేజీలు పనిచేయక పోయినా.. వరి దిగుబడిలో సాధించిన ఈ రికార్డ్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుంది. రైతులకు ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోంది. రాష్ట్ర చరిత్రలోనే కాకుండా యావత్ భారతదేశంలొనే ఇంతటి ధాన్యం దిగుబడి అరుదైన రికార్డ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనూ తెలంగాణ ప్రాంతంలో ఇంతటి పంట పండిన సందర్భం లేదు' అని ఉత్తమ్ అభిప్రాయపడ్డారు.

'ప్రభుత్వంతో మమైకమైన రైతులు.. అంకిత భావంతో చేసిన సాగుతోనే ఈ విజయం సాధ్యపడింది, అందుకు తెలంగాణ రైతులకు అభినందనలు. ఈ ఘనత సాధించడానికి చేయూత అందించిన నీటిపారుదల, వ్యవసాయ శాఖల సిబ్బంది పాత్ర అభినందనీయం' అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనియాడారు.

రైతులకు గుడ్ న్యూస్..

తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ చేస్తుంది. సన్నరకం వరి ధాన్యం క్వింటాకు రూ.500 చొప్పున జమ చేస్తుంది. ఈ నెల 11న ప్రయోగాత్మకంగా ఓ రైతు ఖాతాలో క్వింటాకు రూ.500 చొప్పున రూ.30 వేలు జమ చేశారు. శనివారం సుమారు రూ.కోటి పైగా బోనస్ చెక్కులపై పౌర సరఫరాల శాఖ సంతకాలు చేసి జారీ చేసింది.

రైతులకు తిప్పలు..

తెలంగాణ వ్యాప్తంగా 7 వేల 572 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వాటిలో ఇప్పటికే 4 వేలకు పైగా కొనుగోలు కేంద్రాలను కూడా తెరిచినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ చాలాచోట్ల ఇంతవరకు వడ్ల కొనుగోలు ప్రారంభమే కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు వడ్ల కుప్పలు పోసి రోజుల తరబడి ఎదురు చూస్తున్నారు. వడ్ల కుప్పలతో కొనుగోలు కేంద్రాలన్నీ నిండిపోయాయి. స్థలం లేక వడ్లను తీసుకొచ్చిన రైతులు రోడ్లపై రాశులుగా పోస్తున్నారు. అటు రైతులకు, ఇటు వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు.

Whats_app_banner