Fee Reimbursement Go77: ఏపీ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌, జీవో 77 రద్దుకు ఏపీ సర్కారు సన్నాహాలు-good news for andhra students ap government prepares to repeal go 77 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Fee Reimbursement Go77: ఏపీ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌, జీవో 77 రద్దుకు ఏపీ సర్కారు సన్నాహాలు

Fee Reimbursement Go77: ఏపీ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌, జీవో 77 రద్దుకు ఏపీ సర్కారు సన్నాహాలు

Bolleddu Sarath Chandra HT Telugu
Nov 21, 2024 02:53 PM IST

Fee Reimbursement Go77: ఆంధ్రప్రదేశ్‌ యువతకు సర్కారు త్వరలో తీపి కబురు చెప్పనుంది. నాలుగేళ్ల క్రితం ఎయిడెడ్‌, అన్‌ ఎయిడెడ్‌ కాలేజీల్లో చదువులకు ఫీజు రియంబర్స్‌మెంట్‌ రద్దు ఉత్తర్వులను ఉపసంహరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. యువగళం యాత్రలో లోకేష్‌ఇచ్చిన హామీ మేరకు జీవో 77కు మార్పులు చేయనున్నారు.

వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 77
వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో 77

AP Fee ReImbursement: ఆంధ్రప్రదేశ్‌‌లో ఉన్నత విద్య కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం తీపి కబురు చుబతోంది. 2020-21 విద్యా సంవత్సరం నుంచి ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్‌ ఎయిడెడ్ కాలేజీల్లో చదువుకునే విద్యార్దులకు రద్దైన ఫీజు రియింబర్స్‌మెంట్‌ పథకాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

2020 డిసెంబర్‌లో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 77తో ప్రైవేట్ కాలేజీల్లో చదివే వారికి ప్రొఫెషనల్ కోర్సులతో పాటు, పీజీ కోర్సులు, సాంకేతిక కోర్సుల్లో ఫీజుల చెల్లింపు రద్దు చేశారు. ఎంబిఏ, ఎంసిఏ వంటి కోర్సులతో పాటు అన్ని రకాల పీజీ కోర్సులు, సాంకేతిక విద్యకు సంబంధించిన కోర్సులు ప్రభుత్వ కాలేజీల్లో చదివితే మాత్రమే ఫీజు రియింబర్స్‌మెంట్ వర్తింప చేయాలని నిర్ణయించారు.

ఏపీలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లో నాలుగేళ్లుగా ఈ నిబంధనలు అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో ఆంధ్రా, ఆదికవి నన్నయ్య, కృష్ణా, నాగార్జున, ఎస్కేయూ, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్న క్యాంపస్ కాలేజీలు, పీజీ కాలేజీలలో మాత్రమే విద్యార్దులకు ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తోంది.

ప్రైవేట్ కాలేజీల్లో చదువుకునే విద్యార్దులకు 2017-18 విద్యా సంవత్సరం నుంచి ఫీజులను చెల్లించకపోవడంతో చాలా మంది ఇప్పటికీ కోర్సులు పూర్తి చేసినా సర్టిఫికెట్లు అందని పరిస్థితిలో ఉన్నారు. విద్యార్ధులకు ఫీజు రియింబర్స్‌మెంట్‌ అమలు చేసే సమయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో బీసీ వర్గాలకు లేని పూర్తి రాయితీలు ఎస్సీ, ఎస్టీలకు ఎందుకని భావించడంతో వైఎస్‌ జగన్‌ వాటిని రద్దు చేసినట్టు ప్రచారం జరిగింది.

పీజీ కోర్సులు, ప్రొఫెషనల్ కోర్సుల ఫీజు రియింబర్స్‌మెంట్‌, మెస్ ఛార్జీల విషయంలో ఎస్సీ, ఎస్టీలకు పూర్తి ఫీజు రాయితీ వర్తింపచేయడం అదే సమయంలో బీసీ విద్యార్ధులకు ఆ అవకావం లేకపోవడంతో ఎస్సీ, ఎస్టీలకు రద్దు చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు చెబుతున్నారు.

విద్యార్దులకు నష్టం చేసిన సంస్కరణలు..

ప్రైవేట్ కాలేజీలు, అన్‌ఎయిడెడ్‌ కాలేజీల్లో అడ్మిషన్లు పొందే విద్యార్దుల్లో చాలా మంది తరగతులకు హాజరు కాకపోవడం, కోర్సులను పూర్తి చేయడం కోసమే స్కాలర్‌షిప్‌లను దుర్వినియోగం చేస్తున్నారనే భావనతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఫీజు రియింబర్స్‌మెంట్‌ రద్దు చేసింది. అయితే ఇది నిజంగా అర్హులైన విద్యార్దుల అవకాశాలను కూడా గండికొట్టింది. ఫీజులు చెల్లించలేని విద్యార్దులు ప్రొఫెషనల్ విద్యకు పూర్తిగా దూరం అయ్యారు. వీరిలో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్యార్థులు ఉన్నారు.

డిగ్రీ తర్వాత ప్రొఫెషనల్ కోర్సులైన ఎంబిఏ, ఎంసిఏ వంటి కోర్సులతో పాటు ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంటెక్ వంటి కోర్సుల్లో క్యాంపస్ కాలేజీల్లో ప్రతికోర్సులో 30కు మించి సీట్లు ఉండవు. రాష్ట్రం మొత్తం ఉన్న యూనివర్శిటీల సంఖ్యను పరిగణలోకి తీసుకున్నా విద్యార్ధుల అవకాశాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఈ పరిణామాలను అంచనా వేయకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు 2019కు ముందు అడ్మిషన్లు పొంది, కోర్సులు పూర్తి చేసిన వారికి కూడా ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో సర్టిఫికెట్లు చేతికి అందక ఇబ్బంది పడ్డారు.

ఫీజులు చెల్లించలేక చదువులకు దూరం…

ఆర్ట్స్‌, సైన్స్‌ కోర్సుల్లో సాధారణ సబ్జెక్టుల ఫీజులు అందుబాటులో ఉన్నా, ఉపాధి కల్పించే కోర్సులు సాంకేతిక విద్యకు సంబంధించిన కోర్సులు, ఎంటెక్, హోటల్ మేనేజ్‌మెంట్‌ ,టూరిజం వంటి కోర్సుల ఫీజులు ఏడాదికి రూ.70వేల నుంచి లక్ష వరకు ఫీజులు వసూలు చేస్తుంటారు.ఇక కొన్ని యూనివర్శిటీల్లో ఇంజనీరింగ్‌ డిగ్రీలతో పాటు ఎంటెక్‌ కోర్సులను కలిపి ఇంటిగ్రేటెడ్‌ కోర్సులుగా నిర్వహిస్తున్నారు. ఇలాంటి కోర్సులకు ఫీజు రియింబర్స్‌మెంట్‌ వర్తించదని అయా వర్శిటీలు ప్రకటిస్తున్నాయి.

2020-21 విద్యా సంవత్సరం నుంచి ఏపీలో ప్రైవేట్ ఎయిడెడ్, ప్రైవేట్ అన్‌ ఎయిడెడ్ కాలేజీల్లో చదువుకునే విద్యార్దులకు ఫీజు రియింబర్స్‌మెంట్‌ రద్దు చేస్తూ ఉత్తర్వులుజారీ చేశారు. 2020 డిసెంబర్ 25వ తేదీన ఈ జీవో జారీ చేశారు. వరుసగా ఐదో ఏడాది కూడా ఈ జీవో పేద, బలహీన వర్గాల విద్యార్ధుల పాలిట శాపంగా మారుతోంది. జీవోను ఉపసంహరించుకోవాలని విద్యార్ధి సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఇప్పటికే కొత్త ప్రభుత్వానికి వినతులు కూడా అందించాయి.

పేద విద్యార్ధుల అవకాశాలకు గండి…

జీవో 77 రద్దు చేయాలని గత నాలుగేళ్లుగా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం స్పందించలేదు. గత ఏడాది నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్రలో ఫీజు రియంబర్స్‌మెంట్‌ సదుపాయాన్ని పునరుద్ధరించాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. యువతకు ఇచ్చిన హామీ మేరకు జీవో 77 రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫీజు బకాయిలను సకాలంలో చెల్లించడంతో పాటు పీజీ, ప్రొఫెషనల్ కోర్సులకు రీయింబర్స్‌మెంట్‌ వర్తింప చేయాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ భావిస్తున్నారు.

 

Whats_app_banner

సంబంధిత కథనం