World Oral Health Day 2023 । ఈ పండ్లు తింటే.. మీరు పళ్లు తోమినట్లే!
19 March 2023, 21:49 IST
- World Oral Health Day 2023: ఏదైనా తిన్నప్పుడు దంతాలు రంగు మారతాయి, అయితే కొన్ని పండ్లను తినడం ద్వారా దంతాలు వాటంతటవే శుభ్రపడతాయి. నోటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఆ పండ్లు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
World Oral Health Day 2023
World Oral Health Day 2023: ఉదయం నుంచి రాత్రి వరకు మనం ప్రతీపూట ఏదో ఒకటి తినడం, తాగటం చేస్తూ ఉంటాం. దీంతో నోరు మురికిగా మారుతుంటుంది, నోటిలో హానికర బ్యాక్టీరియా వృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి నోటి పరిశుభ్రత చాలా ముఖ్యం. రోజువారీ బ్రషింగ్ , ఫ్లాసింగ్ వంటివి బ్యాక్టీరియాను అదుపులో ఉంచుతాయి. అయితే, రోజుకు కనీసం రెండు సార్లు దంతాలను బ్రష్ చేసుకోవడం ఉత్తమం. అంతేకాకుండా ఏదైనా తిన్నవెంటనే నోటిని పుక్కిలించాలి. సరైన నోటి పరిశుభ్రత లేకపోతే దంతాలు పసుపు రంగులోకి మారతాయి, నోటి నుంచి దుర్వాసన వస్తుంది. దంత క్షయం, చిగుళ్ల వ్యాధి సహా ఇతర నోటి ఇన్ఫెక్షన్లకు ఇది దారితీస్తుంది.
నోరు ఆరోగ్యంగా ఉంటేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు. నోటి ఆరోగ్యానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. అందుకే ప్రతీ ఏడాది మార్చి 20న ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవంగా పాటిస్తారు. నోటి పరిశుభ్రత, దంతాల పరిశుభ్రత, నోటి ఆరోగ్యానికి తీసుకోవాల్సిన సంరక్షణ చర్యలు మొదలైన వాటివి అవగాహన కల్పించేందుకు ఈ ప్రత్యేకమైన రోజును జరుపుకోవడం వెనక ఉన్న ఉద్దేశ్యం.
Fruits That Whiten Teeth- దంతాలను తెల్లగా చేసే పండ్లు
ఏదైనా తిన్నప్పుడు దంతాలు రంగు మారతాయి, దంతాలను శుభ్రం చేసుకోవడాని బ్రష్ చేసుకోవాలని మనకు తెలుసు. అయితే కొన్ని పండ్లను తినడం ద్వారా దంతాలు శుభ్రపడతాయి. నోటి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఆ పండ్లు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
ఆపిల్
"An apple a day keeps the doctor away" అనే ఆంగ్ల సామెత పూర్తిగా నిజం. రోజుకు ఒక ఆపిల్ పండు వివిధ వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడటమే కాకుండా దంతాలను పరిశుభ్రంగా ఉంచుతుంది. ఆపిల్‌లోని ఫైబర్ కంటెంట్ దంతాలపైన బ్యాక్టీరియా వృద్ధికి కారణమయ్యే కుహరాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. ఆపిల్ తినడం వల్ల నోటిలో ఎక్కువ లాలాజలం వస్తుంది, ఈ లాలాజలం నోటి మురికిని శుభ్రం చేయడంలో సహాయపడుతుంది.
అనాస పండు
పియర్, పైనాపిల్ పండ్లను తినడం వల్ల దంతాలు శుభ్రపడతాయి. అనాస పండు దంతాల మీద కావిటీస్ ఏర్పడకుండా చేస్తుంది. పైనాపిల్‌లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది, ఇది దంతాలలో పేరుకుపోయిన ఫలకాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. సహజంగా దంతాల పసుపు రంగును తొలగిస్తుంది.
జామ
జామ ఆకులు చిగుళ్ల ఆరోగ్యానికి మాత్రమే కాదు. ఇది మొత్తం నోటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. జామపండును తినడం ద్వారా దంతాలకు బ్రషింగ్, స్క్రబ్బింగ్ చేసినట్లు అవుతుంది. దీనివల్ల దంతాలపై పేరుకున్న మురికిపోయి , దంతాలు తెల్లగా మెరుస్తాయి.
క్యారెట్
పండ్లతో పాటు క్యారెట్ వంటి కూరగాయలు కూడా సహజంగా దంతాల మీద పేరుకుపోయిన మురికిని తొలగించడంలో సహాయపడతాయి. పచ్చి క్యారెట్ తినడం వల్ల నోటిలో లాలాజలం ఉత్పత్తి అవుతుంది, కాబట్టి ఇది క్లెన్సర్‌గా పనిచేస్తుంది. ఇది చిగుళ్లను దృఢపరచడమే కాకుండా దంతాల మీద పేరుకుపోయిన ఫలకాలను సులభంగా తొలగిస్తుంది.
విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు
విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లు దంతాల పసుపు రంగును పోగొట్టి నోటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఆరెంజ్, స్ట్రాబెర్రీ వంటి పండ్లు తినడం వల్ల దంతాల మీద పేరుకున్న పసుపు మురికి సులభంగా తొలగిపోతుంది.