తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  World Ibd Day 2023 । మలంలో రక్తం వస్తుందా? పేగు వాపు వ్యాధి కావచ్చు, చికిత్స ఇదీ!

World IBD Day 2023 । మలంలో రక్తం వస్తుందా? పేగు వాపు వ్యాధి కావచ్చు, చికిత్స ఇదీ!

HT Telugu Desk HT Telugu

19 May 2023, 11:24 IST

    • World IBD Day: 30 ఏళ్లలోపు వ్యక్తులకు ఈ పేగు వ్యాధి ఎక్కువగా సంభవిస్తుంది. కానీ సాధారణంగా పేగు వ్యాధులు 50- 60 ఏళ్ల వారిలో సంభవిస్తాయి. ప్రేగు వాపు వ్యాధి (IBD) లక్షణాలు, చికిత్స, నివారణ ఇక్కడ తెలుసుకోండి.
World IBD Day
World IBD Day (Unsplash)

World IBD Day

World IBD Day 2023: ఇన్‌ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి (IBD) అనేది దీర్ఘకాలిక అనారోగ్య సమస్య. ఇది ప్రేగులలో మొదలవుతుంది కానీ మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది పెద్దపేగులోని కణజాలంలో వాపు, పుండ్లు ఏర్పడే పరిస్థితి. ఈ సమస్య ఉన్నప్పుడు నిరంతరం విరేచనాలు, పొత్తి కడుపులో నొప్పి, మలంతో పాటు రక్తస్రావం లేదా రక్తంతో కూడిన మలం రావడం మొదలైన లక్షణాలను గమనించవచ్చు. దీని కారణంగా అలసట, నీరసం కూడా ఉంటుంది.

30 ఏళ్లలోపు వ్యక్తులకు ఈ పేగు వ్యాధి ఎక్కువగా సంభవిస్తుంది. కానీ సాధారణంగా పేగు వ్యాధులు 50- 60 ఏళ్ల వారిలో సంభవిస్తాయి. పేగు వాపు వ్యాధి (Inflammatory bowel disease) రావడానికి కచ్చితమైన కారణం తెలియదు, కానీ పర్యావరణ కారకాలు, వైరస్‌లు, బాక్టీరియా మొదలైన కారకాలకు రోగనిరోధక వ్యవస్థ తప్పుగా ప్రతిస్పందన వలన ఇది సంభవిస్తుంది. జన్యుపరమైన కారణాలు కూడా ఉండవచ్చు.

ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను అలవాటు చేసుకోవడం వల్ల పేగు వాపు వ్యాధి ప్రమాదాన్ని తగ్గించవచ్చు. పేగు వాపు వ్యాధి నివారణపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ప్రతి సంవత్సరం మే 19న ప్రపంచ ఇన్‌ఫ్లమేటరీ పేగు వ్యాధి దినోత్సవంగా పాటిస్తారు. ఈ సంవత్సరం IBD డే థీమ్ 'IBDకి వయస్సు లేదు'.

ప్రేగు వాపు వ్యాధి (IBD) లక్షణాలు

  • అతిసారం
  • పొత్తి కడుపు నొప్పి
  • మలంలో రక్తం
  • ఆకలి లేకపోవడం
  • బరువు తగ్గడం

ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

IBDని ఎలా నిర్ధారిస్తారు?

శరీర సంకేతాలు, లక్షణాల ఆధారంగా IBD నిర్ధారణకు వైద్యులు ఈ క్రింది పరీక్షలను సూచించవచ్చు.

CBC, ESR, CRP వంటి రక్త పరీక్షలు, మల పరీక్ష.

కోలనోస్కోపీ లేదా ఎండోస్కోపీ

CT స్కాన్ లేదా MRI.

IBD చికిత్స ఎలా?

పేగు వ్యాధికి చికిత్స లేదు. అయినప్పటికీ లక్షణాలను తగ్గించడానికి వివిధ చికిత్సలు అందుబాటులో ఉంటాయి. పేగు వ్యాధిలో వివిధ రకాలు ఉంటాయి. వ్యాధి రకాన్ని బట్టి అలాగే వ్యాధి ముదిరిన దశను బట్టి వైద్యులు చికిత్స అందిస్తారు.

మెసలమైన్ వంటి యాంటీ ఇమేటరీ డ్రగ్స్ సాధారణంగా ఇస్తారు, వ్యాధి తీవ్రంగా ఉంటే ఓరల్ లేదా ఇంట్రావీనస్ స్టెరాయిడ్స్ ఇస్తారు. మందులు విఫలమైతే లేదా వ్యాధి తీవ్రంగా మారితే, శస్త్రచికిత్స అవసరం కావచ్చు.

పేగు వ్యాధి ఉన్నప్పుడు డైట్

ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు (ఓట్ ఊక, బార్లీ) తీసుకోవాలి.

మీ ఆహారంలో భాగంగా చికెన్, చేపలు వంటి తేలికపాటి మాంసం రకాలు, గుడ్లు, గింజలు, పౌల్ట్రీ, సోయా వంటి ప్రోటీన్లను చేర్చండి.

ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, ఆలివ్ నూనె, కనోలా నూనె వంటి ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకోండి.

మీ డాక్టర్ సూచించిన విధంగా విటమిన్, మినరల్ సప్లిమెంట్లను తీసుకోండి.

తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులను తీసుకోండి.

రోజంతా తప్పనిసరిగా 8-10 గ్లాసుల నీరు త్రాగాలి.

తదుపరి వ్యాసం