Alcohol Harmful Effects । ఆల్కాహాల్ వలన పేగుల్లో లీకేజీ, దీని దుష్ప్రభావాలు ఇలా ఉన్నాయి!
పేగులపై ఆల్కాహాల్ ఎలాంటి దుష్ప్రభాలను చూపుతుందో మణిపాల్ హాస్పిటల్, గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగం కన్సల్టెంట్ డాక్టర్ అమోల్ దహలే హెచ్‌టి డిజిటల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.
Alcohol Harmful Effects: ఫార్మసీ స్టోర్లలో కొన్ని రకాల ఔషధాలు, డ్రగ్స్ అనేవి వైద్యుల ప్రిస్క్రిప్షన్ మేరకు స్వల్ప మోతాదులో రోగులకు అందిస్తారు. ఆల్కాహాల్ అనేది కూడా డ్రగ్ కిందకే వస్తుంది. కానీ దీనికి పరిమితి అనేది ఉండదు. మద్యం సేవించడం విషయంలో ఎవరికి వారే పరిమితి విధించుకోవాల్సి ఉంటుంది. మోతాదుకు మించి విపరీతంగా ఆల్కాహాల్ సేవిస్తే, అది గుండె జబ్బులు, స్ట్రోక్, కాలేయ వ్యాధి, క్యాన్సర్ సహా ఇతర స్వల్పకాలిక, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను ఎన్నో కలిగిస్తుంది.
ఒక్కసారి ఆల్కహాల్ సేవిస్తే అది కొంతకాలం పాటు మీ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది, జ్ఞాపకశక్తి సమస్యలు, ఒత్తిడి- ఆందోళన, ఇతర మానసిక రుగ్మతలకు కారణమవుతుంది. ఆల్కహాల్ సేవనం నోరు, గొంతు, స్వరపేటిక, అన్నవాహిక, రొమ్ము, ప్రేగు, కాలేయ క్యాన్సర్లకు కూడా కారకం. ఇదే కాకుండా ఆల్కహాల్ మీ కడుపును చాలా ఇబ్బంది పెడుతుంది, పేగుల్లో సమస్యలను సృష్టిస్తుంది.
ఇది గట్ మైక్రోబయోమ్‌లోని బ్యాక్టీరియా సమతుల్యతను ప్రభావితం చేస్తుంది. ఫలితంగా మీ పేగులలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా తగ్గిపోయి, హానికరమైన బ్యాక్టీరియాల వృద్ధికి దారితీస్తుంది. ఉబ్బరం, గ్యాస్, పేగుల లీకేజీ, లూజ్ మోషన్స్ వంటి సమస్యలను కలిగిస్తుంది. పూణేలోని మణిపాల్ హాస్పిటల్, గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగం కన్సల్టెంట్ డాక్టర్ అమోల్ దహలే హెచ్‌టి డిజిటల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేగులపై ఆల్కాహాల్ ఎలాంటి దుష్ప్రభాలను చూపుతుందో వివరించారు.
1. లీకీ గట్
ఆల్కాహాల్ తీసుకోవడం వల్ల పేగు గోడలు మరింత పలుచగా మారతాయి. ఇది పేగు లీకేజీకి దారితీస్తుంది. దీనివల్ల మలం, మలినాలు టాక్సిన్స్, బ్యాక్టీరియా, ఇతర హానికరమైన పదార్థాలు రక్తప్రవాహంలోకి లీక్ అవుతాయి, ఇది దీర్ఘకాలిక నొప్పి, వాపులు, మంటకు దారితీస్తుంది. ఈ పరిస్థితి ఆటో ఇమ్యూన్ వ్యాధులు, క్యాన్సర్ , హృదయ సంబంధ వ్యాధులతో సహా అనేక రకాల ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంది.
2. గ్యాస్ట్రిటిస్
ఆల్కహాల్ అధిక వినియోగం కడుపు లైనింగ్‌ను నాశనం చేస్తుంది , గ్యాస్ట్రిటిస్‌కు దారితీస్తుంది. ఈ అనారోగ్యం వేగంగా పెరుగుతుంది, లక్షణాలు తీవ్రమవుతాయి.
3. కడుపు క్యాన్సర్
అతిగా మద్యం సేవించడం వల్ల కడుపు క్యాన్సర్ వచ్చే ప్రమాదం రెట్టింపు అవుతుంది, ఇది కొలొరెక్టల్ క్యాన్సర్‌కు కూడా దారితీయవచ్చు.
4. కాలేయ వైఫల్యం
మోతాదుకు మించిన ఆల్కాహాల్ కాలేయ వైఫల్యానికి దారి తీస్తుంది. కాలేయ కణాల పెరుగుదల, పునరుత్పత్తి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఏ దశలోనూ కోలుకోలేని పరిస్థితిని కలిగిస్తుంది.
5. ప్యాంక్రియాస్‌కు నష్టం
అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అని పిలిచే ప్యాంక్రియాటిక్ ఇన్ల్ఫమేషన్‌కు దోహదపడే రెండు ప్రధాన కారకాల్లో ఒకటి మద్యం సేవించడం.
ఆల్కహాల్ మీ ఆరోగ్యంపై గణనీయమైన ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంది. అయితే మద్యం మానేయడం ద్వారా పరిస్థితులు మెరుగుపడతాయని వైద్యులు అంటున్నారు.
సంబంధిత కథనం