Gut health: జీర్ణ వ్యవస్థ మెరుగయ్యేందుకు ఈ ఆహారం తీసుకోండి
23 February 2023, 16:09 IST
- Gut health: జీర్ణ వ్యవస్థ మెరుగవ్వాలంటే పేగు ఆరోగ్యం బాగుండాలి. ఇందుకు తగిన ఆహారాన్ని ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
పేగు వ్యవస్థ బాగుండడానికి తగిన ఆహారం అవసరం
కడుపులో ఉండే పేగు వ్యవస్థ మన సంపూర్ణ ఆరోగ్యాన్ని నిర్దేశిస్తుంది. పేగు ఆరోగ్యం బాగుంటే దానిలో ఉండే వైవిధ్యమైన, సమతులమైన మైక్రోఆర్గానిజమ్ జీర్ణ క్రియకు తోడ్పడుతుంది. రోగ నిరోధకతకు అండగా ఉంటుంది. తిన్న ఆహారం నుంచి అవసరమైన పోషకాలను వెలువరిస్తుంది. పేగు ఆరోగ్యాన్ని భిన్నమైన కారకాలు ప్రభావితం చేస్తాయి. స్ట్రెస్, మందులు, జీవనశైలి అలవాట్లు, ఆహారం పేగు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. సమతుల పోషకాహారం తీసుకోవడం వల్ల పేగులో ఆరోగ్యకరమైన మైక్రోబయోమ్ నిర్వహణ సాధ్యమవుతుంది. ఇలా ఉన్నప్పుడు జీర్ణ క్రియ సంబంధిత సమస్యలు, ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతాయి. దీర్ఘకాలిక వ్యాధులకు ఆస్కారం ఉండదు. మరి సమతుల పోషకాహారం ఎలా పేగు వ్యవస్థకు మేలు చేస్తుందో చూద్దాం.
సర్టిఫైడ్ న్యూట్రీషన్ కోచ్ తనీషా బవా హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంబంధిత అంశాలను చర్చించారు. మంచి బ్యాక్టీరియాను, పేగు ఆరోగ్యాన్ని పెంచే ఆహారం గురించి వివరించారు.
1. మొక్కల నుంచి ఆహారం, ఫైబర్
మొక్కల నుంచి లభించే ఆహారం వల్ల భిన్నమైన ఫైబర్ లభిస్తుంది. ఫైబర్‌తో కూడిన ఆహారం గుండె, జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. అలాగే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ కలిగిన ఈ ఆహారం డయాబెటిస్ అదుపులో ఉండేందుకు దోహదపడుతుంది. చిరుధాన్యాలు, తోటకూర, క్వినోవా, పప్పులు, పండ్లు, క్యారెట్లు, బ్రకోలి, వంటివి మీ రోజువారీ ఆహారంలో భాగంగా ఉండాలి.
2. ప్రోబయోటిక్స్
ప్రోబయోటిక్స్ అంటే ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు. ఇవి పులియబెట్టిన ఆహారాల్లో సహజంగా లభిస్తాయి. లేదా సప్లిమెంట్ల రూపంలోనూ లభిస్తాయి. వ్యాధి నిరోధకత కోసం ప్రొబయోటిక్స్ వినియోగిస్తారు. ఇవి గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్‌పై కూడా పోరాడుతాయి. ప్రోబయాటిక్స్ పచ్చళ్లు, గ్రీక్ యోగర్ట్ వంటి వాటిలో లభిస్తాయి.
3. ప్రిబయాటిక్స్
మీ డైట్‌లో ప్రిబయాటిక్స్‌ను చేర్చుకుంటే మీ పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రొబయోటిక్స్‌పై ఆధారపడే జీర్ణం కాని పదార్థాలు ఇవి. రోగనిరోధకతను, నాడీ వ్యవస్థను, గుండె ఆరోగ్యాన్ని, ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు దోహదపడుతాయి. వెల్లుల్లి, ఉల్లి, అరటి పండ్లు, వాటర్ మెలన్, యాపిల్, చెర్రీస్, జీడిపప్పు, చియా విత్తనాలు, పిస్తాల్లో ఉంటాయి.
4. మంచి కొవ్వులు
మీ పేగు ఆరోగ్యాన్ని మంచి కొవ్వులు కాపాడుతాయి. మీ మూడ్‌ను మెరుగుపరుస్తాయి. సెరొటోనిన్ వంటి ఆహ్లాదపరిచే హార్మోన్లు పేగు వ్యవస్జలోనే పుడతాయి. అందువల్ల మీరు మంచి కొవ్వులను తీసుకోవడం వల్ల మీ మూడ్ సానుకూలంగా మారుతుంది. మీ చర్మం, శిరోజాల ఆరోగ్యం కూడా మీ పేగు ఆరోగ్యంతో ముడివడి ఉంటుంది.