తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Winter Workout Tips । చలికాలంలో వ్యాయామాలు చేసే ముందు, ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Winter Workout Tips । చలికాలంలో వ్యాయామాలు చేసే ముందు, ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Manda Vikas HT Telugu

30 October 2022, 7:08 IST

    • Winter Workout Tips: చలికాలంలో బయటకు వాకింగ్ కోసం, జాగింగ్ కోసం వెళ్తున్నారా? అయితే ముందు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఇక్కడ పేర్కొన్న చిట్కాలు పాటించండి.
Winter Workout Tips:
Winter Workout Tips: (Pixabay)

Winter Workout Tips:

Winter Workout Tips: చలికాలం వచ్చేసింది ఉదయం వేళ, సాయంత్రం వేళల్లో చల్లటి గాలులు వణికిస్తున్నాయి. ఇప్పుడు వాతావరణం మారింది కాబట్టి మీ దుస్తులు, మీరు ధరించే ఇతరత్రా వస్తువుల్లో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా బయటకు వెళ్లి వాకింగ్, రన్నింగ్ మొదలైన వ్యాయామాలు చేసేవారు, క్రీడల కోసం ప్రాక్టీసు చేసేవారు లేదా మార్నింగ్ వాక్‌కు వెళ్లే పెద్దలెవరైనా చలిలో బయటకు వెళ్లేముందు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.

చల్లటి వాతావరణం జలుబు, ఫ్లూ, చర్మం పగలటం వంటి సాధారణ అనారోగ్య సమస్యల నుండి, గుండెపోటులు, శ్వాసకోశ సమస్యలు, న్యుమోనియా, డిప్రెషన్ వంటి తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులను కలిగిస్తుంది. అదేవిధంగా ఈ సీజన్ లో గాయాలైతే తొందరగా మానవు. కాబట్టి ముందు జాగ్రత్తలను పాటించడం మరిచిపోవద్దు. అయితే ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటం కూడా ఏ సీజన్‌లో అయినా ముఖ్యమే. మీరు చల్లటి వాతావరణంలో బయటకు వెళ్లి మీ ఫిట్‌నెస్ కోసం సాధన చేసే వారైతే ఇక్కడ కొన్ని టిప్స్ అందిస్తున్నాం, వీటిని పాటించండి.

రెండు పొరల దుస్తులు

చలికాలంలో పొట్టి బట్టలు కాకుండా నిండుగా మీ శరీరాన్ని కప్పే దుస్తులు ధరించండి. మీ ఎగువ, దిగువ శరీరాలను కప్పి ఉంచేలా లోపలి నుంచి ఒక లేయర్ ధరించండి, పై నుంచి వదులుగా ఉండే అథ్లెటిక్ దుస్తులను ధరించండి. మెడ ప్రాంతాన్ని కప్పి ఉంచే మందమైన విండ్ బ్రేకర్-స్టైల్ జాకెట్లు ధరించాలి. మీ శరీరం వేడెక్కడం ప్రారంభించినపుడు, పై లేయర్ దుస్తులను తొలగించవచ్చు. అలాగే పాదాలకు సాక్సులు, చేతులకు గ్లోవ్స్, చెవులను కప్పి ఉంచే తలపాగాలు కూడా ధరించాలి. తగిన షూస్ ధరించాలి. అదేవిధంగా మీరు ధరించేవన్నీ తడి లేకుండా పొడిగా ఉండేలా చూసుకోండి.

వార్మప్ చేయండి

ఏ వ్యాయామం ప్రారంభించే ముందైనా వార్మప్ చేయడం తప్పనిసరి. ఈ వార్మప్ ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే, ఇది మీ అంతర్గత శరీర ఉష్ణోగ్రతను పెంచి, మీ ప్రధాన కీళ్లలో చలనశీలతను కలిగిస్తుంది. అలాగే మీ కండరాలను సక్రియం చేసి మీరు సౌకర్యంగా శరీరాన్ని కదిలించగలిగే ఫ్లెక్సిబిలిటీని అందిస్తుంది. శరీరం తగినంతగా వేడెక్కించడం వల్ల అవయవాలకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. చలిలో ఇది చాలా ముఖ్యమైనది. అందువల్ల మీరు సమర్థవంతంగా సిద్ధం అవుతారు. ఉన్నచోటే స్ట్రెచింగ్‌లను చేస్తూ మీ శరీరాన్ని వార్మప్ చేసుకోవచ్చు.

తినండి, తాగండి

ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తే శక్తిని కోల్పోతారు, కాబట్టి వ్యాయామానికి ముందు తేలికపాటి అల్పాహారం తీసుకోండి. సులభంగా జీర్ణమయ్యే ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు తీసుకోండి. కనీసం ఒక పండునైనా తినండి. తద్వారా గ్లైకోజెన్ క్షీణతను నివారించవచ్చు, శక్తి లభిస్తుంది.

అలాగే ఈ చలికాలంలో ఎక్కువగా దాహం వేయదు, కానీ మీరు అలాగే వ్యాయామాలు చేస్తూ ఉంటే డీహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల గోరువెచ్చని నీటితో నింపిన వాటర్ బాటిల్‌ను మీ వెంట తీసుకెళ్లండి, అప్పుడప్పుడు త్రాగండి.

తగినంత విశ్రాంతి

మీరు ఏ వ్యాయామం చేసేటపుడైనా మీరు సరిగ్గా నిద్రపోయారా, మీ శరీరానికి తగినంత విశ్రాంతి లభించిందా? అన్నది చూసుకోండి. సరైన విశ్రాంతి లేకుండా అభ్యాసాలు చేస్తే అస్వస్థతకు గురవుతారు. అలాగే మీరు ఆస్తమా లేదా ఇతర శ్వాస సమస్యలతో బాధపడుతుంటే, మీరు సమయానికి మందులు తీసుకునేలా జాగ్రత్తపడండి.