తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Winter Stroke | చలిపులి పంజా విసిరితే గుండెపోటు ఖాయం.. శీతలగాలుల నుంచి భద్రం!

Winter Stroke | చలిపులి పంజా విసిరితే గుండెపోటు ఖాయం.. శీతలగాలుల నుంచి భద్రం!

Manda Vikas HT Telugu

28 February 2022, 15:45 IST

google News
    • శీతాకాలపు ఉదయం, సాయంకాలాల్లో అసాధారణమైన గుండెపోట్లు ఎక్కువగా సంభవిస్తాయి. దీంతో ఆకస్మిక మరణాలతో సహా ఇతర గుండె జబ్బుల ప్రమాదాలు శీతాకాలంలో వేగంగా పెరుగుతాయి. చలికాలంలో గుండెపోటు వచ్చే ప్రమాదం వేసవి కాలంలో కంటే రెండింతలు అధికం.
Heart Stroke
Heart Stroke (Shutterstock)

Heart Stroke

సాధారణంగా చలికాలంలో జలుబు, ఫ్లూ కేసులు పెరుగుతాయని ప్రజలు నమ్ముతారు. అయితే సీజనల్ వ్యాధులతో పాటు ఆకస్మికంగా గుండెపోటు వచ్చే ప్రమాదమూ పొంచి ఉందని మీకు తెలుసా? చలిగాలులు ప్రారంభమయ్యే కొద్దీ హృదయ సంబంధ వ్యాధులతో కలిగే మరణాల రేటు గణనీయంగా పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది.

అసాధారణమైన గుండెపోట్లు..

శీతాకాలపు ఉదయం, సాయంకాలాల్లో అసాధారణమైన గుండెపోట్లు ఎక్కువగా సంభవిస్తాయి. దీంతో ఆకస్మిక మరణాల సహా ఇతర హృద్రోగాల వల్ల కలిగే మరణాలు ఈ కాలంలో వేగంగా పెరుగుతాయి. గుండెపోటు వచ్చే ప్రమాదం వేసవి కంటే ఈ కాలంలో రెండింతలు ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా చలికాలంలో వచ్చే గుండెపోట్లు మిగిలిన సమయాలతో పోలిస్తే ప్రాణాంతకమని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. 

మొహాలిలోని ఫోర్టిస్ హాస్పిటల్ సీనియర్ కార్డియాలజీ డాక్టర్ అరుణ్ కొచార్ చెప్పిన ప్రకారం, శీతాకాలంలో మన గుండె చిన్నపాటి సర్దుబాట్లు చేసుకుంటుంది, తద్వారా సాధారణ శారీరక ప్రక్రియలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతాయి. అయినప్పటికీ చల్లని వాతావరణం స్ట్రోక్ లేదా కార్డియాక్ అరెస్ట్ లాంటి విపత్కర పరిస్థితులకు దారితీస్తుంది. ఉష్ణోగ్రతలో ప్రతి ఒక-డిగ్రీ సెల్సియస్ తగ్గుదల.. మరణాలలో 0.49% పెరుగుదలకు కారణమవుతుంది. ముఖ్యంగా రక్త ప్రసరణలో కలిగే ఇబ్బందుల వల్లనే ఈ విధంగా జరిగే అవకాశముంటుంది.

గుండెజబ్బులు రావడానికి కారణాలు..

శీతాకాలంలో గుండెజబ్బులు ఎక్కువగా రావడానికి గల కారణాలను కచ్చితంగా చెప్పలేం. కానీ చలి ప్రభావం చేత గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలు సంకోచించే అవకాశముంది. ఈ కారణంగా రక్త సరఫరాకు ఆటంకం ఏర్పడి అది 'స్ట్రోక్' కు దారితీసే అవకాశం ఉంటుంది. శరీరంలోని రక్తప్రసరణకు- పర్యావరణ ఉష్ణోగ్రతకు విలోమ సంబంధం ఉందని కూడా తేలింది. చలికాలంలో, రక్తపోటు పెరుగుతుంది, కాబట్టి రక్తాన్ని పంప్ చేయడానికి గుండె అదే స్థాయిలో కష్టపడి పని చేస్తుంది. ఇలాంటి సమయంలో కొత్తగా ఏవైనా అలవాటు లేని వ్యాయామాలు చేస్తే అది గుండెపై ఒత్తిడిని పెంచి, గుండెపోటును ప్రేరేపిస్తుంది.

చాలా మంది వ్యక్తులలో ఉదయాన్నే రక్తపోటు పెరిగి అది గుండెపోటుకు దారితీసే ప్రమాదాన్ని పెంచుతుందని వివిధ పరిశోధనలు సూచిస్తున్నాయి. అదనంగా, చలికాలంలో సాధారణంగా తలెత్తె శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఉదయం వేళల్లో కలిగే హార్మోన్ల అసమతుల్యత గుండె ఆరోగ్యానికి మరింత ప్రాణాంతక కారకాలుగా పరిణమిస్తున్నాయి. తరచుగా అధిక కేలరీలు కలిగిన ఆహారం తినడం, ఆల్కహాల్ అతిగా సేవించడం, ధూమపానం తదితర అలవాట్లు ఇందుకు కారణమవుతున్నట్లు వెల్లడైంది.

బయటపడే మార్గాలు:

- చలికాలంలో కఠోరమైన వ్యాయామాలను చేయకపోవడం మంచిది.

- చలి తీవ్రతను ఎదుర్కోవడానికి వెచ్చని దుస్తులు ధరించాలి.

- చలిగాలుల నుంచి రక్షణగా తల, చెవులను కప్పి ఉంచడం ప్రయోజనకరం

- తక్కువ కేలరీలు కలిగిన ఆహారం తీసుకోవాలి.

- ఆల్కహాల్, ధూమపానం మొదలగు వాటికి దూరంగా ఉండాలి.

- యోగా, ధ్యానం లాంటివి చేస్తుండాలి.

- ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవాలి.

గుండె జబ్బులకు అనేక కారణాలు ఉంటాయి. గుండె సంబంధిత ఇబ్బందులు ఉన్నవారు, హృద్రోగ సమస్యలు తలెత్తె అవకాశం ఉన్నవారు ముందుజాగ్రత్త చర్యగా కార్డియాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది.

 

తదుపరి వ్యాసం