తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sleeping Tips: రాత్రి పడుకునే ముందు లైట్లు ఎందుకు ఆఫ్ చేయాలి? చీకట్లో పడుకుంటే కలిగే లాభాలేంటి?

Sleeping Tips: రాత్రి పడుకునే ముందు లైట్లు ఎందుకు ఆఫ్ చేయాలి? చీకట్లో పడుకుంటే కలిగే లాభాలేంటి?

Ramya Sri Marka HT Telugu

22 December 2024, 19:30 IST

google News
    • Sleeping Tips: ఆరోగ్యంగా ఉండాలంటే నిద్రపోవడం చాలా ముఖ్యం. హాయిగా ప్రశాంతంగా నిద్రపోవడం మరింత ముఖ్యం. రాత్రి హాయిగా పడుకోవాలంటే లైట్లు ఎందుకు ఆఫ్ చేయాలి?  చీకట్లో పడుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
రాత్రి పడుకునే ముందు లైట్లు ఎందుకు ఆఫ్ చేయాలి?
రాత్రి పడుకునే ముందు లైట్లు ఎందుకు ఆఫ్ చేయాలి?

రాత్రి పడుకునే ముందు లైట్లు ఎందుకు ఆఫ్ చేయాలి?

గజిబిజీ జీవితాల్లో కాస్తంత ప్రశాంతత దొరికేది నిద్రలోనే. మరి ఆ నిద్రకు ఉపక్రమించే ముందు మనం సరైన విధంగానే సిద్ధం అవుతున్నామా.. చక్కటి, ప్రశాంతమైన నిద్రకు కారణమయ్యే బెడ్ రూం ఏర్పాట్లు, గది వెలుతురు విషయాల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ చర్చించుకుందాం.

హై స్ట్రెస్ లెవల్స్, బిజీ లైఫ్ స్టైల్ నుంచి బ్రేక్ దొరికేందుకు రాత్రుళ్లు లైట్ ఆఫ్ చేసుకుని పడుకోవాలట. అలా పడుకోవడం వల్ల నిద్ర బాగా పడుతుందని నిపుణులు చెబుతున్నారు. వాళ్లు చెబుతున్నట్లుగా లైట్ కు, నిద్రకు మధ్యగల సంబంధేమిటంటే..

నిద్రపోయే ముందు లైట్లు ఎందుకు ఆఫ్ చేయాలి?

కాంతి లేదా తేలికపాటి కాంతి రాత్రి సమయాల్లో నిద్రకు కారణమయ్యే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. ఫలితంగా మీరు నిద్రకు ఉపక్రమించినా సరే, పూర్తి స్థాయి నిద్రపట్టకుండా మీ మెదడు పనిచేసేలా ప్రేరేపిస్తుంటుంది. ఇది నిద్ర నాణ్యతను మరింత తగ్గించి, అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలకు దారితీస్తుంది. చివరిగా సరిగా నిద్రపోకపోవడం వలన, డయాబెటిస్, ఊబకాయం, అధిక రక్తపోటు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

చీకట్లో నిద్రపోవడం ఎందుకు ముఖ్యం?

పూర్తి విశ్రాంతి: వెలుతురులో ప్రశాంతమైన నిద్ర ఉండదు. అదే చీకట్లో శరీరం రిలాక్స్ అవుతుంది. అలా మెదడుకు కాస్త విశ్రాంతి దొరికి చీకట్లో చక్కటి నిద్రకు కారణమవుతుంది. దీనివల్ల మన శరీరానికి పూర్తి విశ్రాంతి లభించి, మరుసటి రోజుకు నూతన ఉత్తేజంతో నిద్ర లేచేందుకు సహకరిస్తుంది. ప్రతిరోజూ ఉదయాన్ని ఫ్రెష్ గా మొదలుపెట్టేందుకు సహాయపడుతుంది.

మనస్సు స్థిరీకరణ: చీకటిలో నిద్రపోవడం వల్ల సరైన మొత్తంలో మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది మంచి నిద్రకు దారితీస్తుంది. ప్రశాంతంగా నిద్రపోవడం వల్ల ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది. అదే సమయంలో, చీకటిలో నిద్రపోవడం అనేది మరో ఆలోచన లేకుండా మనస్సును స్థిరీకరిస్తుంది. ఇతర ఆలోచనలు రాకుండా చేసి మంచి నిద్రలోకి జారుకునేందుకు తోడ్పడుతుంది.

కళ్లకు విశ్రాంతి: పగలంతా కళ్లతో చూసి పని చేస్తుంటాం. వెలుతురును రోజంతా చూసిన కళ్లకు చీకటిలో ఉంటే ఉపశమనంగా ఉంటుంది. ఫలితంగా కళ్లపై ఒత్తిడి తగ్గి విశ్రాంతి దొరుకుతుంది.

మెలటోనిన్ ఉత్పత్తి: బెడ్ రూంలో లైట్లు ఉండటం వల్ల మెదడులోని అన్ని భాగాలు విశ్రాంతి తీసుకోలేవు. ఫలితంగా చీకటిలో మన శరీరం ఉత్పత్తి చేసే నిద్రకు తోడ్పడే హార్మోన్ అయిన మెలటోనిన్ ఉత్పత్తి కాకుండా ఆగిపోతుంది.

శరీర ఉష్ణోగ్రత నియంత్రణ: లైట్లు వేసి ఉండటం వల్ల ఉత్పన్నమయ్యే ఉష్ణోగ్రతకు శరీర ఉష్ణోగ్రత నియంత్రణ కాదు. పద్ధతిగా నిద్రపట్టకపోవడంతో మరుసటి ఉదయం కాస్త బద్దకం నిండి ఉంటుంది. ఇది మన రోగ నిరోధక వ్యవస్థపై ప్రభావం చూపించవచ్చు.

ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరం: చక్కటి నిద్రలోకి జారుకోవాలని అనుకుంటే, గదిలోని అన్ని లైట్లను ఆఫ్ చేయండి. నిద్రపోయే ముందు టీవీ, మొబైల్, ల్యాప్టాప్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను వీలైతే ఆఫ్ చేయండి. లేదంటే బెడ్ రూం బయట ఉంచండి. ఎందుకంటే వాటి నుంచి వెలువడే నీలిరంగు కాంతి నిద్రకు భంగం కలిగిస్తుంది. ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి వెలువడే రేడియేషన్ బ్రెయిన్ ను యాక్టివ్ గా ఉంచుతుంది. అలాగే, మంచి నిద్ర కోసం వాతావరణాన్ని బట్టి గది ఉష్ణోగ్రతను సెట్ చేయండి. సన్నని సువాసన మంచి నిద్ర పొందడానికి మీకు సహాయపడుతుంది.

తదుపరి వ్యాసం