Faking Orgasm: కలయికలో భావప్రాప్తి పొందినట్లు ఎందుకు నటిస్తారు? ఆ తప్పు మీరూ చేస్తున్నారా?
29 September 2024, 16:30 IST
Faking Orgasm: కలయిక సమయంలో అత్యంత ఆనందాన్నిచ్చేది భావప్రాప్తి. ఈ అనుభూతిని పొందినట్లు నటిస్తే లాభాలు లేకపోగా మరింత నష్టాల్ని మిగులుస్తుంది. అసలు ఆర్గాజ్మ్ పొందినట్లు ఎందుకు నటిస్తారు, దానివల్ల నష్టాలేంటో తెల్సుకోండి.
భావప్రాప్తి నటిస్తే ఏమవుతుంది?
భావప్రాప్తి లేదా ఆర్గాజ్మ్ అంటే కలయిక సమయంలో పొందే అత్యంత ఆనందకరమైన అనుభూతి. ఈ సమయంలో పురుషుల్లో వీర్యం విడుదలవుతుంది. మహిళల్లో యోని కండరాల్లో సంకోచ వ్యాకోచాలుంటాయి. కలయికలో ఈ అనుభూతి పొందటం అత్యావశ్యకం. కానీ చాలా మంది ఈ అనుభూతి పొందినట్లు నటిస్తారు.
భాగస్వామిని ఆనందం పర్చడం కోసమో, ఇంకేవైనా కారణాల వల్లనో ఇలా చేస్తుంటే శారీరక సంబంధానికి అర్థం లేదు. అంతేకాక దీనివల్ల మానసికంగా, శారీరకంగా ప్రభావాలుంటాయి.ఆహ్.. దానివల్ల ఏం నష్టం ఉంటుందిలే🤷♂️ అని మీకనిపిస్తే ఇది చదవాల్సిందే. భావప్రాప్తి పొందినట్లు నటించడం వల్ల చెడు ప్రభావాలుంటాయని అనేక పరిశోధనలు, నిపుణులు చెబుతున్నారు. అసలు అలా నటించాల్సిన అవసరం ఏంటంటే..
భావప్రాప్తి పొందినట్లు ఎందుకు నటిస్తారు?
భావప్రాప్తి లేదా ఆర్గాజ్మ్ పొందినట్లు మహిళలు, పురుషులు ఇద్దరూ నటిస్తారు. అయితే మహిళల్లో ఈ శాతం ఎక్కువ. సైక్రియాట్రిస్టుల మాటల ప్రకారం దానికి కారణాలివే.
1. భావప్రాప్తి కలగాలంటే భాగస్వామి పాత్ర కీలకం. ఈ అనుభూతి పొందినట్లు నటించక పోతే వాళ్లు దిగాలు పడతారని, ఆత్మన్యూనతకు లోనవుతారని చాలా మంది భాగస్వామి సంతృప్తి కోసం వాళ్లకు అత్యంత సంతృప్తి దొరికినట్లు నటిస్తారు.
2. అక్రమ సంబంధాలు పెట్టుకున్న వ్యక్తులకు భాగస్వామి మీద ఆకర్షణ, ఆసక్తి తగ్గుతుంది. దాంతో వాళ్లకు అనుమానం రావద్దని కూడా భావప్రాప్తిని నటిస్తారు.
3. యాంటీ డిప్రెసెంట్ మందులు వాడకం శృంగార సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఈ మందులు వాడుతున్న వాళ్లు కూడా ఆర్గాజ్మ్ పొందినట్లు నటించొచ్చు.
4. దిగులు, ఆందోళన, డిప్రెషన్ సమస్యలతో భాదపడేవాల్లు కలయికను ఆస్వాదించలేరు. వాళ్లకు ఆత్మస్థైర్యం తగ్గిపోతుంది. కోరికలు తగ్గుతాయి. దాంతో భావప్రాప్తి పొందినట్లు నటిస్తారు.
5. శృంగారం మీద ఆసక్తి తగ్గినవాళ్లు కూడా ఎక్కువ సేపు సమయం గడపడం ఇష్టం లేక ఇలా వాళ్లకు అనుభూతి కలిగినట్లు నటిస్తారు.
ఆర్గాజ్మ్ పొందినట్లు నటిస్తే ఏమవుతుంది?
బంధం బలహీనం:
ఆర్గాజ్మ్ అనుభూతి వల్ల శరీరంలో ఆక్సిటోసిన్ విడుదలవుతుంది. ఇది ఇద్దరి మనుషుల మధ్య బంధాన్ని బలపరిచే శక్తివంతమైన ఆనంద హార్మోన్. దీంతోనే ఒకరికొకరు మరింత దగ్గరవుతారు. ఎప్పుడైతే అసలు ఈ అనుభూతినే పొందకుండా నటిస్తారో హార్మోన్ విడుదలయ్యే అవకాశమే లేదు.
అతిపెద్ద నష్టం ఇదే:
ఈ విషయం చెబితే మీరు నమ్మలేరు. షాకింగ్ గానూ అనిపించొచ్చు. మీరు భావప్రాప్తి పొందినట్లు, శృంగారంలో మీ భాగస్వామిని సంతృప్తి పరచడం కోసం నటిస్తూ ఉంటే అసలు మీరెప్పుడూ నిజమైన ఆర్గాజ్మ్ అనుభూతి పొందలేకపోవచ్చు. నిజంగా భావప్రాప్తి పొందడం పోను పోను చాలా కష్టంగా మారుతుంది. దీంతో ఆనందమే లేక శృంగార జీవితం మీద విసుగొస్తుంది. ఒకరి ఆనందం కోసం మీరు నటించడం లాభదాయకంగా అనిపించినా మీ బంధాన్ని దీర్ఘకాలికంగా ప్రభావితం చేసే అంశం ఇది. క్రమంగా శారీరక సంబంధాలకు దూరం చేసే అంశంగా మారిపోతుంది.
ఏం చేయాలి?
భావప్రాప్తి పొందలేకపోవడానికి కారణం ఇద్దరి మధ్య సరైన అవగాహన లేకపోవడం. మీ ఇష్టాలను, ఇబ్బందులను మీ పార్ట్‌నర్ తో మనసు విప్పి పంచుకోండి. మీకెలా సౌకర్యంగా ఉంటుందో, మీకున్న ఇబ్బందులేంటో మాట్లాడండి. ఇవన్నీ మీ లైంగిక జీవితాన్ని, బంధాన్ని బలపరిచే అంశాలు.
టాపిక్