RERA Act | రెరా చట్టం ఫ్లాటు కొనుగోలుదారులకు ఎలాంటి రక్షణ ఇస్తుంది?
28 February 2022, 15:20 IST
- కేంద్రం స్థిరాస్థి నియంత్రణ ప్రాధికార సంస్థ (RERA: రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) చట్టాన్ని 2017లో తీసుకొచ్చింది. రియల్ ఎస్టేట్ మోసాలను అరికట్టి కొనుగోలుదారులకు రక్షణ కల్పించేందుకు కేంద్రం ఈ చట్టం తెచ్చింది. ఈ చట్టం ఆధారంగా రాష్ట్రాలు చట్టం చేసి కట్టుదిట్టంగా అమలు చేస్తున్నాయి.
ప్రతీకాత్మక చిత్రం: నివాస గృహం
ప్రతి రాష్ట్రం RERA దరఖాస్తులు, ఫిర్యాదులకు వీలుగా ప్రత్యేకంగా వెబ్‌సైట్లు రూపొందించాయి. ఆయా వెబ్‌సైట్లు పరిశీలిస్తే మీకు రెరా గురించి, సమస్య వచ్చినప్పుడు ఫిర్యాదు చేయడం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు.
RERA రక్షణ నిబంధనలు ఇలా..
500 చదరపు మీటర్లు, ఆపై విస్తీర్ణం గల స్థలంలో భవన నిర్మాణాలకు RERA గుర్తింపు తప్పనిసరి. అంటే సదరు ప్రతి ప్రాజెక్టును రెరా పరిధిలో నమోదు చేసుకోవాలి.
ప్రాజెక్టు మూలధన వివరాలు, భవన నిర్మాణ ప్రణాళిక, స్థల పత్రాలు, అనుభవం తదితర వివరాలు రెరా దరఖాస్తుతో పాటు సమర్పించాలి.
నిర్మాణానికి సహకరించే నిపుణుల వివరాలను కూడా దరఖాస్తుతో పాటు జత పరచాలి.
ఫ్లాటు బుకింగ్ కోసం ఫ్లాటు విలువలో పది శాతం కంటే ఎక్కువగా వసూలు చేయరాదు.
ప్రతి మూడు నెలలకోసారి నిర్మాణ ఖర్చులను రెరా సంస్థకు తెలియపరచాలి. కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన సొమ్మును ప్రత్యేక ఖాతాలో జమచేసి దాని నుంచి నిర్మాణ అవసరాలకు మాత్రమే వినియోగించాలి. ఒక ప్రాజెక్టు కోసం తీసుకున్న సొమ్మును ఇంకో ప్రాజెక్టు కోసం వినియోగించడం సాధ్యపడదు.
ఒప్పంద పత్రంలో ఫ్లాటు డెలివరీ తేదీ, వసతులు, సేవలు ప్రస్తావించాలి. దానికి అనుగుణంగానే బిల్డర్ సేవలు అందించాలి.
ప్లాన్‌లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నా వినియోగదారుడికి ముందస్తుగా తెలియపరచాలి.
వడ్డీ చెల్లించాల్సిందే..
ఒప్పందం ప్రకారం ఫ్లాట్ డెలివరీ చేయకుంటే జాప్యం చేసిన రోజులకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కొనుగోలుదారు ఒకవేళ సమయానికి చెల్లింపులు చేయకపోయినా అదే వడ్డీ రేటుతో వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
నిర్మాణంలో లోపాలు ఉంటే ఐదేళ్లపాటు మరమ్మతు సేవలు అందించాల్సి ఉంటుంది.
నిర్మాణంలో లోపాలు ఉన్నప్పుడు ఫిర్యాదు చేసిన 30 రోజుల్లోపు వాటిని మరమ్మతు చేయాల్సి ఉంటుంది.
నిర్మాణం పూర్తయ్యాక రెసిడెంట్స్ వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు చేసి మెయింటెనెన్స్ ఫండ్ అప్పగించి నిర్వహణ బాధ్యతలు నిర్వర్తింపజేయాలి.
ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు రాష్ట్రస్థాయి రెరా ప్రాధికార సంస్థలో ఫిర్యాదులు చేయవచ్చు. అవి చూపే పరిష్కారం సరిపోలేదనుకుంటే వాటిపై అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చు.
రెరా వేటికి వర్తించదు?
500 చదరపు మీటర్లలోపు విస్తీర్ణం గల స్థలంలో చేపట్టే భవనాలకు రెరా నుంచి మినహాయింపు ఉంటుంది.
కేవలం 8 ఫ్లాట్లు మాత్రమే ఉండే భవనాలకు రెరా వర్తించదు.
టాపిక్