Home Loan | హోం లోన్ కోసం ఏయే డాక్యుమెంట్స్ అవసరం?
28 February 2022, 17:50 IST
- హోం లోన్ మన కలల నివాస గృహం సాకారం కావడంలో అండగా నిలిచేది. మీకు నచ్చిన ఫ్లాటు లేదా విల్లా లేదా ఇండిపెండెంట్ హౌజ్ ఎంచుకున్నాక గానీ, మీ స్థలంలో ఇల్లు కట్టుకునే సందర్భంలో గానీ మీకు హోం లోన్ అవసరం అవ్వొచ్చు.
ప్రతీకాత్మక చిత్రం: నివాస గృహం
Home Loan.. హోమ్ లోన్ మీ ఆర్థిక పరిస్థితిని బట్టి, మీ ఎలిజిబిలిటీని బట్టి ఉంటుంది. అయితే హోం లోన్ పొందాలంటే మనం పలు ధ్రువీకరణ పత్రాలను మన దరఖాస్తుతో పాటు పొందుపరచాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
హోం లోన్ దరఖాస్తు ఫారం
హోం లోన్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే విధిగా దరఖాస్తు ఫారం నింపాల్సి ఉంటుంది. ఇందులో మీ వ్యక్తిగత వివరాలు, ఆదాయ వివరాలు, చిరునామా, వంటి వివరాలన్నీ పొందుపరచాల్సి ఉంటుంది. బ్యాంకర్ పంపే సందేశాలు మీకు చేరాలంటే ఈ వివరాలన్నీ జాగ్రత్తగా పూరించాల్సి ఉంటుంది.
మీ గుర్తింపు కార్డులు
హోం లోన్ దరఖాస్తు ఫారంతో పాటు మీరు మీ గుర్తింపు కార్డును జతపరచాల్సి ఉంటుంది. పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, పాస్ పోర్టు తదితర గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి జత పరిస్తే సరిపోతుంది.
నివాస ధ్రువీకరణ
మీ ప్రస్తుత నివాసం ఎక్కడ ఉందో తెలుపుతూ తగిన ధ్రువీకరణ పత్రం జత చేయాల్సి ఉంటుంది. నివాస ధ్రువీకరణ పత్రంగా ఓటరు గుర్తింపు కార్డు గానీ, రేషన్ కార్డు గానీ, విద్యుత్త బిల్లు, వాటర్ బిల్లు, గ్యాస్ బిల్లు, బీఎస్ఎన్ఎల్ లాండ్ లైన్ బిల్లు, పాస్ పోర్ట్, ఎమ్మార్వో జారీ చేసిన నివాస ధ్రువీకరణ పత్రం.. ఇలా వీటిలో ఏదో ఒకటి జతపరచవచ్చు. బ్యాంకులు దరఖాస్తు ఫారాల్లో నిర్ధిష్టంగా సూచిస్తాయి. వాటికి అనుగుణంగా మీరు నివాస ధ్రువీకరణను ఎంచుకోవచ్చు.
ఆదాయ ధ్రువీకరణ
మీ ఆదాయాన్ని బట్టే మీకు గృహ రుణం మంజూరవుతుంది. మీరు నెలకు ఎంత తిరిగి చెల్లించగలరో కూడా దీనిని బట్టే నిర్ధారిస్తారు. సాధారణంగా వేతన జీవులకైతే మూడు నెలల పే స్లిప్పులు, మూడేళ్ల ఐటీ రిటర్నులు, మూడేళ్ల ఫామ్-16 ప్రతులు, పాన్ కార్డు తప్పనిసరిగా అడుగుతారు. కొన్ని బ్యాంకులు 6 నెలల బ్యాంకు స్టేట్‌మెంట్లను జత చేయమని అడుగుతాయి. మరికొన్ని షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటి పెట్టుబడులకు సంబంధించిన ధ్రువపత్రాలు అడుగుతాయి.
ఇక వ్యాపారాలు చేసే వారైతే సీఏ మంజూరు చేసిన ప్రాఫిట్ లాస్ స్టేట్ మెంట్, బిజినెస్ లైసెన్స్, డాక్టర్లు, లాయర్లు తదితర ప్రొఫెషనల్స్ అయితే ప్రాక్టీస్ లైసెన్స్, బిజినెస్ చిరునామా ప్రూఫ్, మూడేళ్ల ఆదాయ పన్ను రిటర్నులు జత చేయాల్సి ఉంటుంది.
ఆస్తి పత్రాలు
హోం లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు అత్యంత కీలకమైనవి ఆస్తి పత్రాలు. మీరు కొనుగోలు చేయబోయే ప్రాపర్టీకి సంబంధించిన చట్టబద్ధమైన పత్రాలు తప్పనిసరిగా చూపాల్సి ఉంటుంది. బ్యాంకులు వీటి ఆధారంగానే లోన్ మంజూరు చేస్తాయి. బిల్డింగ్ ప్లాన్, అనుమతులు, సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, అగ్రిమెంట్ ఆఫ్ సేల్, బిల్డర్‌కు చెల్లించిన అడ్వాన్స్ ప్రూఫ్, బిల్డింగ్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్, బిల్డర్ ఎన్వోసీ, ప్రాపర్టీ టాక్స్ పత్రాలు, ఎలక్ట్రిసిటీ బిల్స్, మెయింటేనెన్స్ బిల్స్ వంటివన్నీ అవసరం.
బ్యాంకులు ఎలా నిర్ణయం తీసుకుంటాయి?
మీ అప్పుల చరిత్ర, మీ చెల్లింపు సామర్థ్యం, మీ సిబిల్ స్కోరు, చట్టబద్ధమైన భవన నిర్మాణ అనుమతులు, టైటిల్ క్లియరెన్స్ వంటి అనేక అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి బ్యాంకర్ మీకు హోం లోన్ మంజూరు చేస్తారు. సో అవసరమైన డాక్యుమెంట్లను సేకరించి పెట్టుకోవడమే కాకుండా, మీ క్రెడిట్ హిస్టరీ కూడా బాగుండేలా చూసుకుంటే మీకు హోం లోన్ గ్యారంటీ.