తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Home Loan | హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? ఒక్క క్షణం ఈ విషయాలు గమనించండి

Home Loan | హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? ఒక్క క్షణం ఈ విషయాలు గమనించండి

28 February 2022, 17:46 IST

google News
    • Home Loan | మీ కలల గృహాన్ని కొనుగోలు చేయాలంటే మీకు హోం లోన్ అవసరం పడొచ్చు. ఒకేసారి మొత్తం చెల్లించి కొనుగోలు చేయడం అందరికీ సాధ్యం కాదు కూడా. అందువల్ల మీ ఆర్థిక స్తోమతను బట్టి, మీ చెల్లింపు సామర్థ్యాన్ని బట్టి, మీ భవిష్యత్తు ఆదాయాన్ని బట్టి హోం లోన్ ఎంచుకోవాల్సి రావొచ్చు.
ప్రతీకాత్మక చిత్రం: కలల గృహానికి హోమ్ లోన్ అవసరమవ్వొచ్చు
ప్రతీకాత్మక చిత్రం: కలల గృహానికి హోమ్ లోన్ అవసరమవ్వొచ్చు (unsplash)

ప్రతీకాత్మక చిత్రం: కలల గృహానికి హోమ్ లోన్ అవసరమవ్వొచ్చు

ఒక వేళ మీరు హోం లోన్ తీసుకోవాలని నిర్ణయానికి వస్తే ఈ కింది విషయాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాలపై మీకు అవగాహన ఏర్పడితే మీరు హోం లోన్ దరఖాస్తు నుంచి చెల్లింపుల వరకు అన్నీ సులభంగా చేసేయొచ్చు.

హోమ్ లోన్ ఎలిజిబులిటీ

మీకు ఎంతమేర హోమ్ లోన్ పొందే అవకాశం ఉందో తెలుసుకోవాలి. పలు బ్యాంకులు, గృహ రుణాలు ఇచ్చే ఆర్థిక సంస్థల వెబ్ సైట్లలో హోం లోన్ ఎలిజిబులిటీ కాలుక్యులేటర్లు అందుబాటులో ఉన్నాయి. వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు మీ హోమ్ లోన్ ఎలిజిబులిటీ పెరుగుతుంది. ఒకవేళ మీరు ఇతర రుణాలకు ఈఎంఐ చెల్లించాల్సి ఉంటే ఆమేరకు లోన్ ఎలిజిబులిటీ తగ్గుతుంది. మొత్తంగా మీ నెలవారీ ఆదాయంలో 45-50 శాతానికి లోపే మీ ఈఎంఐ ఉండేలా బ్యాంకులు హోం లోన్ మంజూరు చేస్తాయి.

సిబిల్ క్రెడిట్ స్కోర్

మీకు బ్యాంకులు రుణం ఇవ్వాలంటే తొలుత మీ గత రుణ చరిత్ర, చెల్లింపుల సామర్థ్యం, ఇప్పటికే మీరు చెల్లిస్తున్న ఈఎంఐలు.. ఇలా అన్నింటిపై ఒక అంచనాకు రావాలి. అందుకు బ్యాంకులకు దోహదపడేది మీ క్రెడిట్ స్కోర్.

బ్యాంకులన్నీ కలిపి ఏర్పాటు చేసుకున్న ఒక సంస్థ సిబిల్. ఈ సిబిల్ మీ రుణ చరిత్ర, తదితర అంశాల ఆధారంగా మీకు క్రెడిట్ స్కోర్ ఇస్తుంది. ఈ స్కోర్ 750 కంటే ఎక్కువ ఉంటే మీకు మంచి సిబిల్ స్కోరు ఉన్నట్టు లెక్క. ఎంత ఎక్కువగా ఉంటే వడ్డీ రేట్లపై కొంత మినహాయింపు కూడా లభించే అవకాశం ఉంది. 

మంచి క్రెడిట్ స్కోరు ఉండాలంటే మీ అప్పుల చరిత్ర, వాటి చెల్లింపుల చరిత్ర చక్కగా ఉంటే సరిపోతుంది. మీ మొత్తం నెలవారీ ఆదాయంలో సుమారు 45 శాతం మాత్రమే ఈఎంఐ ఉండేలా బ్యాంకులు లెక్కగట్టి రుణం మంజూరు చేస్తాయి. ఇప్పటికే ఇతర రుణాలకు ఈఎంఐ చెల్లిస్తూ ఉన్నట్టయితే ఆమేరకు కత్తిరించి రుణం మంజూరు చేస్తాయి.

వడ్డీ రేటు ఇంపార్టెంట్

మీరు హోమ్ లోన్ తీసుకునేటప్పుడు తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం వడ్డీ రేటు. ఎందుకంటే మీరు హోం లోన్ తిరిగి చెల్లింపు వ్యవధి సుదీర్ఘకాలాన్ని ఎంచుకోవాలని అనుకుంటారు. అది పదిహేనేళ్లు అవ్వొచ్చు. అంతకు మించి అవ్వొచ్చు. అందువల్ల వడ్డీ రేటులో కొద్దిపాటి మార్పులు మీ చెల్లింపుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. తక్కువ వడ్డీ రేటు ఆఫర్ చేసే గృహ రుణాల సంస్థలు, బ్యాంకుల వైపే మొగ్గు చూపండి.

అలాగే హోం లోన్ విషయంలో వడ్డీ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ఫ్లోటింగ్ రేట్ అయితే మరొకటి స్థిర వడ్డీ రేటు. స్థిర వడ్డీ రేటు ఎప్పటికీ మారదు. కానీ ఫ్లోటింగ్ వడ్డీ రేటు అయితే ఎంసీఎల్ఆర్ ఆధారంగా ఎప్పటికప్పుడు వడ్డీ రేటు మారుతుంది.  ఇది తగ్గొచ్చు. పెరగొచ్చు.

హోమ్ లోన్ కాలవ్యవధి..

హోమ్ లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఆలోచించాల్సిన మరో ముఖ్య విషయం కాల వ్యవధి. అంటే ఎన్నేళ్లలో తిరిగి చెల్లించాలనుకుంటున్నారన్న విషయం మీ భవిష్యత్తు ఆదాయాన్ని బట్టి ఉండాలి. మీరు సాధారణంగా 60 ఏళ్లకు పదవీ విరమణ పొందుతారు. బ్యాంకులు కూడా ఈ విషయాన్ని గమనంలోకి తీసుకుంటాయి. 

అలాగే తక్కువ వ్యవధిలో అయితే మీ ఈఎంఐ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ వ్యవధి అయితే మీ ఈఎంఐ తక్కువగా ఉంటుంది. కానీ దీర్ఘకాలంలో అయితే మీరు చెల్లించాల్సిన వడ్డీ ఎక్కువగా ఉంటుంది. సో హోం లోన్ తీసుకునేముందు కాల వ్యవధి కూడా ఇంపార్టెంట్ అంశమే.

డౌన్ పేమెంట్..

మీరు మీ వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న సొమ్మును బట్టి డౌన్ పేమెంట్ చేస్తారు. అయితే ప్రాజెక్టు కాస్ట్‌లో ఎంత మేర డౌన్ పేమెంట్ చేయాలనుకుంటున్నారో ముందుగా లెక్కించుకోండి. ఒకవేళ మీ వద్ద తగినంత సొమ్ము ఉన్నప్పటికీ మొత్తం డౌన్ పేమెంట్ చెల్లించాల్సిన అవసరం లేదు. మీకు ఎలిజిబులిటీని బట్టి మీ రుణం తీసుకుని, మీ వద్ద డౌన్ పేమెంట్ పోగా ఇంకా మిగిలి ఉంటే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు.

రుసుములు, పెనాల్టీలు..

హోమ్ లోన్ మంజూరు చేసేటప్పుడు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు హోమ్ లోన్ డాక్యుమెంట్లో అనేక షరతులు, నిబంధనలను ప్రస్తావిస్తాయి. ఇందులో వివిధ రకాల ఛార్జీలు, రుసుములు, జరిమానాలు వివరిస్తాయి. వీటన్నింటినీ క్షుణ్ణంగా తెలుసుకోవడం మంచిది. హోమ్ లోన్ ఈఎంఐలు కాకుండా ఏవైనా అదనపు రుసుములను వసూలు చేస్తున్నాయో గమనించాలి. ముందస్తుగా హోమ్ లోన్ కట్టేస్తే ఏవైనా రుసుములు చెల్లించాల్సి ఉంటుందేమో గమనించాలి.

 

టాపిక్

తదుపరి వ్యాసం