తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Lat Purchase | ఫ్లాట్ కొంటున్నారా? ఈ ఖర్చులు మరిచిపోకండి..

lat purchase | ఫ్లాట్ కొంటున్నారా? ఈ ఖర్చులు మరిచిపోకండి..

28 December 2021, 15:37 IST

    • Flat purchase | ఫ్లాట్ కొంటే మనకు చదరపు అడుగుకు ఎంత ధర అన్నదే పైకి కనిపిస్తుంది. ఫ్లాటు విస్తీర్ణాన్ని బట్టి ఉజ్జాయింపుగా ఫ్లాటు ధరను లెక్కకడతాం. కానీ పైకి కనిపించని అనేక ఛార్జీలు ఉంటాయి. మనకు అసలు ధరపై అంచనాలు ఏర్పడతాయి కానీ ఈ కొసరు ఖర్చులే తడిసి మోపెడవుతాయి. అవేంటో ఒకసారి చూద్దాం.
ప్రతీకాత్మక చిత్రం: నివాసం
ప్రతీకాత్మక చిత్రం: నివాసం (unsplash)

ప్రతీకాత్మక చిత్రం: నివాసం

మూలలు, దిక్కులు ఎంచుకుంటే తడిసిమోపెడు

వాస్తు ఎంచుకోవడంపై వినియోగదారులకు ఉన్న మోజును గ్రహించిన బిల్డర్లు ఎక్కువ సొమ్ము చేసుకునేందుకు దిక్కులకు అదనంగా రేటు లెక్కగడతారు. ముఖ్యంగా ఈస్ట్, నార్త్, నార్త్ ఈస్ట్ ఫ్లాట్లకు ఒక్కో చదరపు అడుగుకు రూ. 50 లేదా రూ. 100 ఎక్కువ చెల్లించాలంటారు. అంతేకాకుండా కార్నర్ ఫ్లాట్ అయితే ఒక ధర, హైరైజ్ అయితే ఒక ధర, అలాగే పార్క్ వ్యూ అయితే ఒక ధర, పూల్ వ్యూ అయితే ఇంకో ధర.. ఇలా ఒకే భవనంలో ఒక్కోరీతిలో ధరలు ఉంటాయి. అందువల్ల మీరు ఫ్లాట్ కొనేముందు వీటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

ట్రెండింగ్ వార్తలు

Ashwagandha powder: ప్రతిరోజూ అశ్వగంధ చూర్ణాన్ని ఇలా తీసుకోండి, ఎలాంటి ఆరోగ్య సమస్యలే రావు

Ivy gourd and Diabetes: డయాబెటిస్ అదుపులో ఉండాలంటే ప్రతిరోజూ దొండకాయలు తింటే చాలు, వాటితో ఎన్నో అద్భుత ప్రయోజనాలు

Gongura Chicken Pulao: స్పైసీగా గోంగూర చికెన్ పులావ్, దీన్ని తింటే మామూలుగా ఉండదు, రెసిపీ ఇదిగో

Quitting Job: మీరు చేస్తున్న ఉద్యోగాన్ని విడిచి పెట్టేముందు ఈ విషయాలను గురించి ఆలోచించండి

రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ

మనకు సాధారణంగా పన్ను లేకుండా ఏదీ మార్కెట్లో దొరకదు. చివరకు పన్ను లేకుండా మనం నివాస గృహం కూడా కొనుక్కోలేం. ఇలా ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ, జీఎస్టీ చెల్లించాల్సి వస్తుంది. ప్రధానంగా రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ప్రభుత్వానికి తప్పనిసరిగా చెల్లించాల్సిన రుసుము. ఇది రాష్ట్రాన్ని బట్టి 5 నుంచి 7 శాతం ఉంటుంది. దీనికి అదనంగా స్టాంప్ డ్యూటీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. మహిళల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయిస్తే కొన్ని రాష్ట్రాలు కొద్దిగా మినహాయింపు ఇస్తున్నాయి.

జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్)

నిర్మాణంలో ఉన్న ఏ అపార్ట్‌మెంట్‌కు అయినా మనం ఈ వస్తు సేవల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. నిర్మాణంలో ఉన్న ఫ్లాటుకు 5 శాతం జీఎస్టీ చెల్లించాలన్న నిబంధన ఉంది. అలాగే నిర్మాణం పూర్తయి, ఆక్యుపేషన్ సర్టిఫికెట్ వచ్చిన ఫ్లాట్లకు జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ కొందరు మోసపూరిత బిల్డర్లు నిర్మాణం పూర్తయ్యాక జీఎస్టీ పైకి చూపించరు గానీ, ఆమేరకు భవన నిర్మాణ ఖర్చులో కలిపి చూపుతారు. ఇక అఫర్డబుల్ ఇళ్ల పరిధిలోకి వచ్చే వాటికి జీఎస్టీ కేవలం 1 శాతం మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.

ఎమినిటీస్ ఛార్జీలు

గేటెడ్ కమ్యూనిటీ అయితే ఈ ఎమినిటీ ఛార్జీలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. కానీ ఇతర స్టాండ్ అలోన్ అపార్ట్‌మెంట్ల విషయంలో మనమే తరచి చూడాల్సి ఉంటుంది. ఇందులో పార్కింగ్ ఛార్జీలు సహా అన్ని విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కొందరు ఎమినిటీస్ ఛార్జెస్‌లోనే పార్కింగ్, ఇతర అన్ని అంశాలను చూపుతారు. మరికొందరు బిల్డర్లు పార్కింగ్ కోసం సెపరేట్ ఛార్జ్ చేస్తారు. 

మెయింటేనెన్స్ డిపాజిట్

బిల్డర్లు భవన నిర్మాణం పూర్తికాకముందే ఈ వ్యయాన్ని కూడా చెల్లించాలని ఒత్తిడి తెస్తారు. వాస్తవానికి ఎమినిటీస్, బిల్డింగ్ మెయింటెనెన్స్ కోసం వెచ్చించాల్సిన ఈ డిపాజిట్ ముందుగానే వసూలు చేస్తారు. భవన నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని పోగు చేయడానికి ఇలా చేస్తారు. ఒక్కో బిల్డరు ఒక్కోలా దీనిని వసూలు చేస్తారు. కొందరు రెండేళ్లకు, మరికొందరు మూడేళ్లకు, ఇంకొందరు ఇంకా ఎక్కువ సంవత్సరాలకు వసూలు చేస్తారు.

బ్రోకరేజ్ ఛార్జీలు

రియల్ ఎస్టేట్ ఏజెంట్ ద్వారా వెళ్లాల్సి వస్తే ఒక్కోసారి ఒక శాతం నుంచి రెండు శాతం వరకు బ్రోకరేజ్ లేదా కమీషన్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఒక్క రుసుము తప్పించుకోవాలనుకుంటే నేరుగా భవన నిర్మాణ సంస్థను సంప్రదించడం మేలు. అలా అయితే ఈ కమిషన్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. అయితే కొన్ని భవన నిర్మాణ సంస్థలు నేరుగా అమ్మకాలు జరపకుండా ఛానల్ పార్ట్‌నర్ ద్వారా అమ్మకాలు జరుపుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో కమీషన్ చెల్లించాల్సి వస్తుంది.

ఇంటీరియర్ వ్యయం..

భవన నిర్మాణ సంస్థ కేవలం మీకు బేసిక్ ఫ్లాట్ నిర్మించి ఇస్తుంది. అందులో వుడ్ వర్క్, తదితర ఇంటీరియర్ పని మీరే చేయించుకోవాల్సి వస్తుంది. సాధారణంగా మీ ఫ్లాటు సైజ్ బట్టి ఈ ఇంటీరియర్ వర్క్ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. కనీసం రూ. 3 లక్షల నుంచి గరిష్టంగా మీ ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి వెచ్చించుకోవచ్చు.

బ్యాంక్ ఇన్స్‌పెక్షన్ ఛార్జీలు

మీరు ఒకవేళ హోమ్ లోన్ తీసుకోవాల్సి వస్తే, మీ బ్యాంకర్ సంబంధిత ఫ్లాట్ తనిఖీ కోసం ఛార్జీలు వసూలు చేస్తారు. ఒకవేళ సదరు ప్రాజెక్టును ఆ బ్యాంకు ఇప్పటికే ఒకే చేసి ఉంటే ఈ ఛార్జీలు మీకు ఉండకపోవచ్చు.

మున్సిపల్ నీటి కోసం..

కొందరు బిల్డర్లు కక్కుర్తితో తాగునీటి సౌకర్యం కూడా కల్పించరు.  మున్సిపల్ కార్పొరేషన్ సరఫరా చేసే నీటి కనెక్షన్ కూడా పెట్టించరు. దానిని కూడా మనమే పెట్టించుకోవాలని చెబుతారు. ఇది కూడా అడిగితేనే చెబుతారు. అందువల్ల ముందుగానే ఈ విషయం అడగండి.

టాపిక్

తదుపరి వ్యాసం