Good friday: గుడ్ ఫ్రైడేకి ముందు పాటించే లెంట్ డేస్ అంటే ఏంటి? ఎందుకు పాటిస్తారు?
29 March 2024, 6:00 IST
- Good friday: గుడ్ ఫ్రైడేతో లెంట్ డేస్ ముగుస్తాయి. అసలు ఈ లెంట్ డేస్ అంటే ఏంటి? క్రైస్తవ సోదరులు ఎందుకు పాటిస్తారు? వీటి వెనుక ఉన్న అర్థం ఏంటి? అనేది తెలుసుకుందాం.
లెంట్ డేస్ అంటే ఏంటి?
Good friday: భస్మ బుధవారంతో ప్రారంభమైన శ్రమల దినాలు నేటితో ముగియనున్నాయి. రేపు మార్చి 29 గుడ్ ఫ్రైడే జరుపుకోనున్నారు. యేసుక్రీస్తుని శిలువ వేసిన రోజు గుడ్ ఫ్రైడేకి ముందు ఈ శ్రమల దినాలు పాటిస్తారు. 40 రోజులపాటు ఉపవాసం ఉండి క్రైస్తవులు క్రీస్తును ఆరాధిస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14 నుంచి శ్రమల కాలం మొదలైంది. మార్చి 29 గుడ్ ఫ్రైడే. అందువల్ల గురువారంతో శ్రమల కాలాలు ముగుస్తాయి. ఈ శ్రమల దినాలలో ఆదివారాలను లెక్కించరు.
ఈ 40 రోజులపాటు ఒక్కరోజు మాత్రమే ఆహారం తీసుకుంటూ క్రైస్తవులు ఉపవాసం చేస్తారు. క్రీస్తుని స్తుతిస్తూ, పాటలు పాడుతూ, వాక్య సందేశాలు వింటారు. ప్రతిరోజు సాయంత్రం వేళ జరిగే ప్రార్థనలకు చర్చికి వెళ్తారు. హృదయ శుద్ది గలవారు ధన్యులు వారు ఓదార్చబడతారని బైబిల్ లో ఉంటుంది. ఎటువంటి పాపపు ఆలోచనలు లేకుండా కన్నీటితో క్షమించమని వేడుకుంటూ ప్రార్థనలు చేసిన వారి మీద దేవుని అనుగ్రహం ఉంటుంది. బైబిల్ లో 40 అనే సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది.
40 దినాలు ఎందుకు?
మానవుల పాపాలు పెరిగిపోవడంతో జలప్రళయం సంభవించింది. దీని గురించి దేవుడు ముందుగానే నోవాహుని హెచ్చరిస్తాడు. జలప్రళయం రాబోతుంది.. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడం కోసం ఒక పెద్ద ఓడని సిద్ధం చేసుకుని పెట్టుకో అందులో దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాళ్ళు మొత్తం ఉండేలా చూసుకోమని చెప్తాడు. ఆలాగునే నోవాహు ఓడని సిద్ధం చేసుకుని అందులో ఉంటాడు. రాబోతున్న జల ప్రళయం గురించి నోవాహు ప్రజలకు చెప్పగా వాళ్ళు చెడు మార్గంలో ఉండటంతో పెడచెవిన పెట్టారు. అటువంటి వాళ్ళందరూ జలప్రళయంలో కొట్టుకునిపోయారు. ఈ జల ప్రళయం 40 రోజుల పాటు సాగింది.
మోషే దైవ సన్నిధిలో గడిపిన రోజులు 40 దినాలు. ఏలియా 40 రోజులు ఉపవాసం ఉండి శక్తిని పొందాడు. అలాగే మోషే సినాయి కొండమీద 40 రోజులు గడిపి పది ఆజ్ఞలు రూపొందించాడు. ఈ పది ఆజ్ఞల గురించి బైబిల్లో సవివరంగా ఉంటుంది. ఈ ఆజ్ఞల ప్రకారమే మనుషులు నడుచుకోవాలని చెబుతారు. అలాగే ఇశ్రాయేలీయులు గోల్యాతును ఎదుర్కొన్న రోజులు కూడా 40 దినాలు. యేసుక్రీస్తు దేవుని పరిచర్య ప్రారంభించడానికి ముందు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. అలా 40 అనే సంఖ్యకు బైబిల్ పరంగా ఎంతో పవిత్రమైన ప్రాముఖ్యత ఉంది. ఈ శ్రమల కాలాన్ని లెంట్ డేస్ అంటారు.
40 రోజులు పాటించే ఆచారాలు ఏంటి?
క్రైస్తవులు కొంతమంది 40 రోజులు ఉపవాసం ఉంటే మరి కొందరు మాత్రం సోమవారం లేదా శుక్రవారం ఉపవాసం చేస్తారు. శుక్రవారం పూట సాయంత్రం నిర్వహించే ఉపవాస ప్రార్థన కూడికల్లో పాల్గొంటారు. ఉపవాసం అనగా ఉ-ఉపేక్షించుకొని, ప- పరీక్షించుకొని, వా- వాక్య, స-సందేశంతో, ము- ముందుకు సాగటం అని అర్థం. ప్రభువు మానవుడై మన రక్షణ కోసం శ్రమపడి తనను తాను బలిదానం చేసుకున్న రోజు గుడ్ ఫ్రైడే. శుక్రవారం రోజు ఆయనను శిలువ వేశారు. మన శ్రమలను ఉపవాసం ద్వారా నలగగొట్టబడి ప్రార్థనతో దేవుని దగ్గరగా ఉండగలుగుతాము. హృదయ శుద్ధితో పాపపు తలంపులు, ఆలోచనలు లేకుండా ప్రార్థనలు చేస్తే రెండవ రాకడ సమయంలో యేసు క్రీస్తు తనతో పాటు లేవనెత్తుతాడని క్రైస్తవులు విశ్వసిస్తారు.