Good friday 2024 date: గుడ్ ఫ్రైడే ఎప్పుడు? యేసు క్రీస్తు శిలువలో పలికిన ఏడు మాటలు ఏంటి?-good friday 2024 date and significance of this holy day ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Good Friday 2024 Date And Significance Of This Holy Day

Good friday 2024 date: గుడ్ ఫ్రైడే ఎప్పుడు? యేసు క్రీస్తు శిలువలో పలికిన ఏడు మాటలు ఏంటి?

Gunti Soundarya HT Telugu
Mar 27, 2024 03:46 PM IST

Good friday 2024 date: యేసు క్రీస్తు వారిని శిలువ వేసిన రోజు గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారు. క్రైస్తవులు ఆరోజు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేస్తారు. తాము చేసిన పాపాల నుంచి రక్షించమని వేడుకుంటారు.

గుడ్ ఫ్రైడే ఎప్పుడు?
గుడ్ ఫ్రైడే ఎప్పుడు? (pixabay)

Good friday 2024 date: క్రైస్తవులు జరుపుకునే ముఖ్యమైన పండుగలు మూడు. లోకరక్షకుడు పుట్టిన రోజు క్రిస్మస్, శిలువ వేసిన రోజు గుడ్ ఫ్రైడే, సమాధి నుంచి తిరిగి పునరుత్థానుడిగా వచ్చిన రోజు ఈస్టర్.

యేసుక్రీస్తుని శిలువ వేసిన రోజుగా గుడ్ ఫ్రైడే జరుపుకుంటారు. ఈ ఏడాది గుడ్ ఫ్రైడే మార్చి 28న వచ్చింది. కల్వరి గిరి మీద ఆయన మరణాన్ని గుర్తు చేసుకుంటూ క్రైస్తవులు గుడ్ ఫ్రైడేని జరుపుకుంటారు. అందరూ ఆరోజు చర్చికి వెళ్లి ప్రార్థనలు చేస్తారు. తమ పాపాల నుంచి విముక్తి కలిగించమని వేడుకుంటారు. బైబిల్ ప్రకారం గుడ్ ఫ్రైడే అనేది ఒక విచారకరమైన రోజు కానీ మానవాళిని పాపాల నుంచి రక్షించడం కోసం ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రాణాలను అర్పించిన రోజు. పాపాల నుంచి విముక్తి కలిగించడం కోసం తనని తాను సంతోషంగా త్యాగం చేసుకున్న రోజు. అందుకే ఆ రోజునే మంచి రోజుగా భావిస్తారు. గుడ్ ఫ్రైడే గా పిలుస్తారు.

గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యత

లోక రక్షణ కోసం యేసుక్రీస్తు వారు తల్లి మరియ గర్భాన జన్మించారు. ప్రజలను చెడు నుంచి మంచివైపు నడిపించడం కోసం శ్రమించారు. దైవ కుమారుడైన యేసుక్రీస్తు సాధారణ మనిషిగా భూమి మీదకు వచ్చి మనుషులు పడే కష్టాలన్నీ అనుభవించాడు. పాపాలు చేస్తున్న వారిని సన్మార్గంలో నడిపించడం కోసం ప్రయత్నించాడు. ఆయన వెంట ఎప్పుడూ 12 మంది శిష్యులు ఉంటారు. ప్రభు బోధనలు వినేందుకు ఎంతో మంది ఆసక్తి చూపించేవారు.

అయితే ప్రజలందరూ యేసుక్రీస్తు మాటలకు ప్రభావితమవుతున్నారని రోమీయులు కక్షగడతారు. ఎలాగైనా ఆయన్ను అణిచివేయాలని చూస్తారు. రోమా సైనికులకు యేసుక్రీస్తు శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు సహాయం చేస్తాడు. అతడు డబ్బు మనిషి. యూదుల రాజుగా తనని తాను ప్రకటించుకున్నాడని అబద్ధపు నింద మోపి యేసుక్రీస్తుని రోమా సైనికులకు అప్పగిస్తాడు.

ఇస్కరియోతు చేసే ద్రోహం గురించి యేసుక్రీస్తు వారికి ముందుగానే తెలుసు. అయినప్పటికీ ఆయన ప్రజలను పాపాల నుంచి రక్షించడం కోసం ప్రాణత్యాగం చేయాలనేది తన కర్తవ్యంగా భావించారు. గుడ్ ఫ్రైడే ముందు రోజు తన శిష్యులు అందరికీ యేసుక్రీస్తు ప్రభు రాత్రి భోజనం ఇచ్చారు. మరుసటి రోజు గెత్సెమని తోటలో ప్రార్థన చేసుకుంటుండగా రోమా సైనికులు వచ్చి యేసుక్రీస్తుని బందీగా చేసుకుంటారు. ఆయన మీద ద్వేషంతో రగిలిపోతారు. యేసుక్రీస్తు అంటే నచ్చని కొందరు వ్యక్తులు ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి దుర్భాషలాడుతూ శిలువ వేయాలని గట్టిగా అరుస్తారు. రోమ్ చక్రవర్తి అలాగే శిలువ శిక్ష విధిస్తాడు.

ముళ్ళ కిరీటం పెట్టి

రోమ్ సైనికులు యేసుక్రీస్తు వారిని అత్యంత దారుణంగా హింసిస్తూ ముళ్ళ కొరడాలతో కొడుతూ చిత్రహింసలకు గురిచేస్తారు. యూదుల రాజువి కదా అంటూ హేళనగా మాట్లాడుతూ ఆయన తలకు ముళ్ళ కిరీటాన్ని గుచ్చుతారు. శరీరమంతా మాంసం ముద్దలా మారి, రక్తం ధారలై ప్రవహిస్తూ ఉన్న బాధను ఆయన అనుభవించారు.

శిలువను భుజాలపై మోస్తూ కల్వరి గిరి వరకు రోమా సైనికులు నడిపిస్తారు. దారి మధ్యలో కొరడాలతో కొడుతూ హేళన చేస్తూ తీవ్రంగా అవమానిస్తారు. చేతులు కాళ్లను మేకులతో కొట్టి ఆయనను శిలువపై వేలాడదీశారు.

యేసు క్రీస్తు శిలువ మీద పలికిన ఏడు మాటలు

యేసుక్రీస్తు వారు శిలువ మీద ఏడు మాటలు పలికారు. గుడ్ ఫ్రైడే రోజు క్రైస్తవులు ప్రతి ఒక్కరూ ఆ ఏడు మాటలు జ్ఞాపకం చేసుకుంటారు. తమని పాపాల నుంచి రక్షించడం కోసం యేసు క్రీస్తు అనుభవించిన బాధను తలుచుకుంటారు.

మొదటి మాట: తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు కనుక వీరిని క్షమించుము

శరీరం మొత్తం మాంసం ముద్దగా మారి రక్తం ధారలై ప్రవహిస్తున్న యేసుక్రీస్తు తన గురించి కాకుండా తనని హింసించిన వారి కోసం శిలువ మీద ఉండి ప్రార్థించారు. వారిని క్షమించమని తన శత్రువులను విడిచిపెట్టమని తండ్రిని కోరుకుంటున్నాడు.

రెండో మాట: నేడు నీవు కూడా నాతో పరదైశులో ఉంటావు

యేసుక్రీస్తుని శిలువ వేసినప్పుడు ఆయనకు కుడివైపున ఒక దొంగ, ఎడమవైపున మరొక దొంగని కూడా శిలువ వేస్తారు. అయితే అందులో ఎడమవైపు ఉన్న దొంగ నువ్వు ప్రభువు బిడ్డవని చెప్పుకుంటున్నావు కదా నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని కూడా కాపాడమని మాట్లాడతాడు. అయితే కుడివైపు ఉన్న దొంగ మాత్రం యేసుక్రీస్తు మహిమను గ్రహించి నీవు నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని అడుగుతాడు. ఆ సమయంలో యేసుక్రీస్తు వారు ఆ దొంగకి పాప క్షమాపణ కలిగిస్తూ నేడు నీవు నాతో కూడా పరదైశులో ఉంటావని చెప్పారు.

మూడో మాట: యోహాను అనే శిష్యుడిని తన తల్లికి చూపిస్తూ అమ్మా ఇదిగో నీ కుమారుడు.. శిష్యుడి వైపు చూస్తూ ఇదిగో నీ తల్లి

యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో యోహాను ఒకరు. నిత్యం యేసును వెంబడిస్తూ వాక్యానుసారం జీవించాడు. తను చనిపోయిన తర్వాత తన తల్లి బాధ్యతను తీసుకోవాల్సిందిగా యోహానుకి అప్పగించాడు.

నాలుగో మాట: యేసు బిగ్గర శబ్దంతో ఏలోయి ఏలోయి లామా సభక్తామి అని అరిచాడు అంటే ఆ మాటకు అర్థం నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి

ఐదో మాట: నేను దప్పిగొనుచున్నాను

భూమ్యాకాశాలను సృష్టించిన సృష్టికర్త కుమారుడు అయిన యేసుక్రీస్తు దప్పికొనుచున్నాను అని అంటారు. ఆ సమయంలో రోమా సైనికులు తమ వికృతి చేష్టలు చేస్తూ చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తారు. ఒక చేదు చిరకలో స్పాంజి ముంచి ఆయన నోటికి అందించి దప్పిగొనుచున్నాను అన్నావ్ కదా తాగు అని చెప్పి అందిస్తారు.

ఆరో మాట: యేసు ఆ చిరకను పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి తలవంచెను

ఆ సమయంలో యేసుక్రీస్తు నీరసంగా బాధగా చెప్పలేదు. బిగ్గరగా కేక వేస్తూ విజయోత్సాహంతో సమాప్తం అయినది అని అన్నారు. తాను ఈ లోకానికి వచ్చిన పని అయిపోయినదని చెప్తూ సమాప్తమైనదని పలికెను.

ఏడో మాట: గట్టిగా కేక వేస్తూ.. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పి ప్రాణము విడిచెను.

అప్పుడు సమయం 3 గంటలు. ఆ సమయంలో లోకమంతా చీకటి అలుముకుంది. మొత్తం నిశ్శబ్ద వాతావరణంతో నిండిపోయింది. మరియమ్మ తన కుమారుడిని తలుచుకుని రోదించింది.

WhatsApp channel

టాపిక్