Pradosha Vratam: శని దోషాల నుంచి విముక్తి కలగాలంటే రేపు శివయ్యను ఇలా ఆరాధించండి-tomorrow march 22 shukra pradosha vratham follow these tips to lord shiva puja you will get shani dev blessings ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Pradosha Vratam: శని దోషాల నుంచి విముక్తి కలగాలంటే రేపు శివయ్యను ఇలా ఆరాధించండి

Pradosha Vratam: శని దోషాల నుంచి విముక్తి కలగాలంటే రేపు శివయ్యను ఇలా ఆరాధించండి

Gunti Soundarya HT Telugu
Mar 21, 2024 05:42 PM IST

Pradosha Vratam: మార్చి 22 ప్రదోష వ్రతం. ఆరోజు శివుడిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. శని సడే సతీ, దయ్యా ప్రభావాల నుంచి విముక్తి కలగడం కోసం రేపు ఈ విధంగా శివయ్యను ఆరాధించాలి. మాంగల్య దోషం నుంచి బయట పడతారు.

శివయ్యని ఇలా ఆరాధిస్తే శని దోషం నుంచి విముక్తి
శివయ్యని ఇలా ఆరాధిస్తే శని దోషం నుంచి విముక్తి (Unsplash)

Pradosha vratam: ప్రతినెల ప్రదోష వ్రతం జరుపుకుంటారు. ఈ నెల మార్చి 22వ తేదీన ప్రదోష వ్రతం వచ్చింది. హిందూ మతంలో ప్రదోష వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. శుక్రవారం ప్రదోష వ్రతం రావడం వల్ల దీన్ని శుక్ర ప్రదోష వ్రతంగా పిలుస్తారు. ఈ రోజున శివపార్వతులను పూజిస్తారు. శివుడిని ఆరాధించడం వల్ల విశేషమైన అనుగ్రహం లభిస్తుంది. ప్రదోష సమయంలో పూజ చేయడం వల్ల జాతకంలో దోషాలు ఏమైనా ఉంటే శివుడి ఆశీస్సులతో అవి తొలగిపోతాయి.

ఈ ఏడాది మకర రాశిపై ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. అలాగే కుంభం, మీన రాశి, వృశ్చికం, కర్కాటక రాశిపై అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది. శనికి సంబంధించిన దోషాలు ఉన్న వ్యక్తి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యక్తిగత జీవితం సమస్యలతో నిండిపోతుంది. వాటిని తొలగించుకోవడం కోసం ప్రదోష వ్రతం రోజు భోళా శంకరుడికి ప్రత్యేక ఆరాధన చేయాలి. ఆ రోజు శివలింగానికి కొన్ని వస్తువులు సమర్పించడం వల్ల మహా దేవుడు అనుగ్రహం పొందుతారు.

శివుడు అభిషేక ప్రియుడని అందరికీ తెలిసిందే. అందుకే ప్రదోష వ్రతం రోజున శివలింగానికి తప్పనిసరిగా పంచామృతాలతో అభిషేకం చేస్తే శివుని ఆశీస్సులు లభిస్తాయి. శని దేవుడి చెడు దృష్టి తొలగిపోతుంది. జీవితం సాఫీగా సాగుతుంది. సమస్యల నుంచి బయట పడతారు.

పెరుగు

శివలింగానికి పెరుగుతో అభిషేకం చేయడం వల్ల జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది. శని దోషం నుంచి ఉపశమనం కలుగుతుంది.

నెయ్యి

ప్రదోష వ్రతం రోజు శివలింగానికి స్వచ్ఛమైన నెయ్యితో అభిషేకం చేస్తే శివుని అనుగ్రహం లభిస్తుంది. నెయ్యితో అభిషేకం చేయడం వల్ల మనసు ధైర్యంగా ఉంటుంది. సమస్యల్ని ఎదుర్కోగల సామర్థ్యం వస్తుంది.

గంధం

శివలింగానికి గంధం రాయాలి. అలా చేయడం ఎలా జీవితంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలకు ఎప్పుడు లోటు ఉండదు.

తేనె

పంచామృతాలలో ఒకటైన తేనెతో కూడా శివలింగాన్ని అభిషేకించాలి. మత విశ్వాసాల ప్రకారం తేనె సమర్పించడం వల్ల మాటల్లో మాధుర్యం పెరుగుతుంది.

నీరు

పంచామృతాలు లేకపోయినా చెంబుడు స్వచ్చమైన నీటితో అభిషేకం చేసినా చాలు శివుడు ప్రసన్నడు అవుతాడు. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ శివలింగానికి నీటిని సమర్పించాలి. ఫలితంగా మనశ్శాంతి లభిస్తుంది.

పాలు

శివలింగానికి పాలతో అభిషేకం చేయడం వల్ల శివుడు సంతోషిస్తాడు. ఆవుపాలతో మాత్రమే అభిషేకం చేయాలి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, వ్యాధుల నుంచి ఉపశమనం పొందేందుకు శివలింగానికి పాలతో అభిషేకం చేయాలి.

పంచదార

పంచామృతాల్లో ఒకటైన పంచదారతో శివలింగానికి అభిషేకం చేస్తారు. ఇలా చేయడం శుభప్రదంగా భావిస్తారు. శివలింగానికి పంచదార సమర్పిస్తే ఇంట్లో సుఖసంతోషానికి ఎటువంటి లోటు ఉండదు.

కుంకుమపువ్వు

శివలింగానికి కుంకుమ పువ్వు సమర్పించడం వల్ల శివుని ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. అలాగే శివునికి కుంకుమపుతో తిలకం పెట్టడం వల్ల మాంగల్య దోషం నుంచి విముక్తి కలుగుతుంది.

సుగంధ ద్రవ్యాలు

శివలింగానికి సుగంధ ద్రవ్యాలు సమర్పించడం వల్ల శివయ్య ఆశీస్సులు లభిస్తాయి. మనసు శుద్ధి అవుతుంది. తామసిక ధోరణుల నుంచి బయటపడతారు. వీటితో పాటు శని అనుగ్రహం పొందటం కోసం రావి, శమీ చెట్టును పూజించాలి. వాటి కింద నెయ్యి దీపం వెలిగించాలి.