Good Friday: గుడ్ ఫ్రైడే సంతోషకరమైన రోజా? లేక విషాదకరమైన రోజా? .. ఆ రోజు ప్రాముఖ్యత ఏంటి?
Good Friday: ఈస్టర్ సండేకు ముందు వచ్చే శుక్రవారం రోజు ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్లు గుడ్ ఫ్రైడే జరుపుకుంటారు. ఈ సంవత్సరం గుడ్ ఫ్రైడే మార్చి మార్చి 29 న వస్తుంది. యేసుక్రీస్తును శిలువ వేసిన రోజుగా ఈ రోజును విషాదకరమైన రోజుగా మెజారిటీ క్రైస్తవులు భావిస్తారు.
Good Friday significance: ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు జరుపుకునే గుడ్ ఫ్రైడే అనేక రకాల భావోద్వేగాలను రేకెత్తించే రోజు. "గుడ్ ఫ్రైడే" అనే పేరు ఒక సంతోషకరమైన సందర్భాన్ని సూచిస్తున్నప్పటికీ, ఆ రోజు నిజానికి యేసుక్రీస్తును శిలువ వేసిన రోజు. అందువల్ల ఈ రోజును సాధారణంగా క్రైస్తవులు ఒక విచారకరమైన రోజుగా భావిస్తారు. అయితే, కొందరు క్రైస్తవ పండితులు గుడ్ ఫ్రైడే ను విషాధ కరమైన రోజుగా భావించకూడదని, ఆ రోజును జీసస్ క్రైస్ట్ పునరుత్థానం చెందడానికి దారితీసిన రోజుగా భావించాలని వాదిస్తుంటారు.
సంతాపం ప్రకటించే రోజా?
చాలా మంది క్రైస్తవులకు గుడ్ ఫ్రైడే (Good Friday) అనేది.. ఏసు క్రీస్తుకు శిలువ వేసిన రోజుగా, సంతాపం ప్రకటించే విషాదకరమైన రోజు. ఆ రోజు యేసుక్రీస్తు ఎన్నో బాధలు అనుభవించిన రోజుగా వారు భావిస్తారు. ఈ రోజున చర్చి సేవలు తరచుగా శిలువ వేయడానికి దారితీసే సంఘటనలపై దృష్టి పెడతాయి. వీటిలో యూదా చేసిన ద్రోహం, పొంటియస్ పిలాతు ముందు విచారణ, కల్వరి ప్రయాణం మొదలైనవి ఉంటాయి.
విమోచన వాగ్దానం
అయితే, కొంతమంది క్రైస్తవులు గుడ్ (Good Friday) విచారకరమైన రోజుగా పరిగణించకూడదని వాదిస్తారు. గుడ్ ఫ్రైడే అనేది మరణంపై, పాపంపై యేసుక్రీస్తు సాధించిన అంతిమ విజయానికి గుర్తుగా భావించాలని వారు కోరుతారు. శిలువ వేయడం ఒక విషాద సంఘటనగా కాకుండా, మానవాళిపై దేవుని ప్రేమను వ్యక్తీకరించే ఘటనగా చూడాలని వారు చెబుతారు. ఈస్టర్ సండే నాడు జీసస్ క్రైస్ట్ (Jesus Christ) పునరుత్థానం (resurrection) కారణమైన రోజుగా గుడ్ ఫ్రైడే ను పరిగణించాలని వారు కోరుతారు. గుడ్ ఫ్రైడేలోని "గుడ్" అనేది క్రీస్తు బలి ద్వారా ఇవ్వబడిన విమోచన, నిత్య జీవితం యొక్క వాగ్దానాన్ని సూచిస్తుందని వారు వివరిస్తారు.