Biryani Leaves Benefits : బిర్యానీ ఆకులతో ఇలాంటి ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలియదు
17 February 2024, 7:00 IST
- Health Benefits Of Biryani Leaves : బిర్యానీ ఆకులతో శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వలన చాలా ఉపయోగాలు పొందవచ్చు.
బిర్యానీ ఆకుల ప్రయోజనాలు
బిర్యానీ ఆకులు మార్కెట్‌లో సులభంగా దొరుకుతాయి. బిర్యానీ వంటి వంటకాలకు రుచిని జోడించడానికి ఇది ప్రధాన మసాలాగా పనిచేస్తుంది. ఇది గొప్ప మసాలా మాత్రమే కాదు.. మంచి ఔషధంగా కూడా పనికి వస్తుంది. దీనిద్వారా అపారమైన ప్రయోజనాలు పొందవచ్చు.
మీరు చుండ్రు సమస్యతో బాధపడుతుంటే.. కొన్ని బిర్యానీ ఆకులను నీటిలో వేసి మరిగించాలి. చల్లారాక తలని శుభ్రం చేసుకోవాలి. తరువాత షాంపూని అప్లై చేసి శుభ్రం చేసుకోవాలి. తల దురద ఉన్నవారు ఈ ఆకులను మెత్తగా రుబ్బుకుని తలకు మాస్క్‌లా వేసుకుని అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో జుట్టును శుభ్రం చేసుకోవాలి.
దాల్చిన చెక్క ఆకులను రోజుకు రెండుసార్లు తీసుకునే వ్యక్తులు శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రించుకోవచ్చు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఇది సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అతిసారం, తరచుగా మూత్రవిసర్జన వంటి సమస్యలకు ఇది ఔషధంగా ఉపయోగిస్తారు. ఇది శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడానికి సహాయపడుతుంది. జీర్ణ రుగ్మతలను సరిచేసి సక్రమంగా పనిచేసేలా చేస్తుంది.
క్యాన్సర్ కణాలను అదుపులో ఉంచడంలో దాల్చిన చెక్క ఉపయోగపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ఆకులో ఏ, సీ, బీ6 లాంటి విటమిన్లు ఉంటాయి. ఐరన్, పొటాషియం, మాంగనీసు, డైటరీ ఫైబర్లు, ఫోలిక్ యాసిడ్ దొరుకుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకనే దీన్ని ఆహార పదార్థాల్లో ఉపయోగించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు దొరుకుతాయి.
మనం తినే ఆహారంలో తరచుగా బిర్యానీ ఆకును చేర్చుకోవడం వల్ల నాడీ వ్యవస్థ పని తీరు బాగుంటుంది. దీంతో మెదడు మరింత బాగా పని చేస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల వాపులు, నొప్పులు తగ్గుతాయి. కీళ్ల నొప్పి, ఆర్థరైటిస్ లాంటి వాటిని తగ్గించడంలో సహాయపడుతుంది.
జలుబు, దగ్గు, గొంతు నొప్పి తదితర శ్వాస కోశ సంబంధిత సమస్యలతో బాధ పడే వారు ఈ ఆకుల టీని తాగడం వల్ల ఉపశమనం పొందవచ్చు. గర్భిణీలకు ఫోలిక్ యాసిడ్ అవసరం ఉంటుంది. ఇది ఈ ఆకులో దొరుకుతుంది. పది గ్రాముల బిరియానీ ఆకులో 18 గ్రాముల ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది. గర్భవతులు తమ రోజు వారీ కూరల్లో ఈ ఆకుల్ని చేర్చుకోవచ్చు.
బరువు తగ్గాలనుకునే వారికి ఈ ఆకులు బాగా పని చేస్తాయి. రోజూ వీటితో చేసుకున్న టీ తాగడం వల్ల ఊబకాయం, అధిక బరువు సమస్యలు తగ్గుతాయి. ఈ ఆకుల్ని నీటిలో మరిగించి టీలా తాగడం వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. జీవ క్రియ మెరుగవుతుంది. బిర్యానీ ఆకులో ఉండే రుటిన్, కెఫిన్ ఆమ్లం తదితరాల వల్ల రక్త సరఫరా మెరుగై హైపర్ టెన్షన్ లాంటివి రాకుండా ఉంటాయి.