Cauliflower Pickle Recipe | కమ్మటి భోజనం చేయాలంటే.. కాలీఫ్లవర్ అవకాయ కలుపుకోండి!
07 February 2023, 13:36 IST
- Cauliflower Pickle Recipe: గోబి పువ్వుతో సులభంగా రుచికరమైన ఊరగాయను చేసుకోవచ్చు, వేడివేడి అన్నంతో కమ్మగా తినవచ్చు, రెసిపీని ఇక్కడ చూడండి.
Cauliflower Pickle Recipe
అవకాయ రోజూ తిన్నా బోర్ కొట్టదు. భోజనంలో ఎన్ని రకాల వంటకాలు ఉన్నా, ఒక స్పూన్ అవకాయతో వచ్చే రుచే వేరు. అసలైన తెలుగింటి భోజనంను అవకాయ పరిపూర్ణం చేస్తుంది, అందుకే అవకాయ మన సంస్కృతి, సంప్రదాయాల్లోనూ ఒక భాగం అయింది. రానున్నది ఎండాకాలం, అంటే మామిడికాయల సీజన్. మనకు వివిధ రకాల ఫ్లేవర్లలో అవకాయలు పెట్టుకోవడానికి సీజన్ వచ్చేస్తుంది. మరి ఆలోపు ముందస్తు ప్రాక్టీస్ కూడా ఉండాలి. మన తెలుగు వారు ఏ కాయతోనైనా అవకాయ పెట్టేయగల నైపుణ్యం కలవారు. కూరగాయల్లో క్యారెట్, ముల్లంగి మొదలైన వాటితో అవకాయలు పెట్టడం మీకు తెలిసింది. ఇంతేనా గోబి పువ్వుతో రుచికరంగా అవకాయ పెట్టవచ్చు. కాలీఫ్లవర్ అవకాయ రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం, మీరు ట్రై చేయండి.
కాలీఫ్లవర్ ఏ సీజన్ లోనైనా లభించే ఒక కూరగాయ. గోబితో వండే ఎలాంటి వంటకమైన ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే కాలీఫ్లవర్ అవకాయ కూడా చాలా రుచిగా ఉంటుంది. మీరు కమ్మటి భోజనం చేయాలంటే కాలీఫ్లవర్ అవకాయను కలుపుకోవచ్చు.
Cauliflower Pickle Recipe కోసం కావలసినవి
- 3 కప్పుల కాలీఫ్లవర్ ముక్కలు
- 1 ½ టేబుల్ స్పూన్లు ఆవాలు
- 1/2 టేబుల్ స్పూన్ మెంతులు
- 3 నుండి 4 నిమ్మకాయలు
- 100 గ్రాముల కారం
- పావు లీటర్ వేరుశెనగ నూనె లేదా నువ్వుల నూనె
- 1/4 టీస్పూన్ పసుపు పొడి
- 9- 10 వెల్లులి రెబ్బలు (ఐచ్ఛికం)
- రుచికి తగినంత ఉప్పు
కాలీఫ్లవర్ అవకాయ తయారీ విధానం
- కాలీఫ్లవర్‌ను శుభ్రం చేసి, కావలసిన పరిమాణంలో ముక్కలుగాకత్తిరించండి, అనంతరం ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటిలో 10 నిమిషాలు నానబెట్టండి.
- ఆపైన నీటిని పూర్తిగా తీసేసి 3 నుండి 4 గంటలు ఎండలో ఎండబెట్టండి లేదా కాటన్ క్లాత్‌పై ఫ్యాన్ కింద ఆరబెట్టండి, మొత్తంగా నీరు ఆవిరైపోయేలా చూడండి.
- ఇప్పుడు వెడల్పాటి పాన్‌లో కావలసిన మొత్తంలో నూనెను వేడి చేసి, అందులో ఆరబెట్టిన కాలీఫ్లవర్ ముక్కలను వేసి, మీడియం నుంచి అధిక మంటపై 2 నుండి 3 నిమిషాలు వేయించాలి. కరకరలాడుతుండగా తీసి వేరే గిన్నెలోకి మార్చండి.
- ఇప్పుడు మెంతులను దోరగా వేయించి, పొడిగా గ్రైండ్ చేసుకోవాలి.
- అనంతరం పాత్రలో వేయించిన కాలీఫ్లవర్ ముక్కలు, మెంతిపొడి, కారం, పసుపు, వెల్లుల్లి సహా పైన పేర్కొన్న పదార్థాలు అన్నీ వేయండి. నిమ్మరసం పిండుకొని కలపండి, ఆపైన వేయించిన నూనెను పోయాలి.
అంతే, కాలీఫ్లవర్ అవకాయ రెడీ అయినట్లే. వేడివేడి అన్నంలో కలుపుకొని తినవచ్చు. దీనిని శుభ్రమైన కూజాలో ఉంచి నెల రోజుల వరకు తినవచ్చు.
టాపిక్