Radish Pickle Recipe । ముల్లంగి పికిల్.. ఒక్కసారి రుచి చూశారో, పూనకాలు లోడింగ్!
19 January 2023, 13:55 IST
- Radish Pickle Recipe: అవకాయ ఎప్పుడూ తిన్నా బోర్ కొట్టదు, ఒకవేళ కొడితే ఇలా కొత్త వెరైటీ చేసుకోండి. ముల్లంగి ఊరగాయ రెసిపీ ఇక్కడ ఉంది చూడండి.
Radish Pickle Recipe
అచ్ఛమైన తెలుగింటి భోజనం అంటే అన్నం, పప్పు, కూర, రసం, అప్పడంతో పాటు అవకాయ లేదా పచ్చడి కచ్చితంగా ఉండాల్సిందే. ఇలాంటి భోజనం మనకు ప్రతిరోజూ కావాలనిపిస్తుంది. ఎందుకంటే మనకు అమ్మ, అన్నం, అవకాయ అనేవి ఎప్పటికీ బోర్ కొట్టవు. అయితే మనకు అవకాయ అంటే మామిడికాయతో చేసే ఊరగాయ చాలా ఇష్టం, అలాగే నిమ్మకాయ, గోంగూర వంటి వెజిటెబుల్ పికిల్స్ కూడా తినే ఉంటారు. మరి ఎప్పుడైనా ముల్లంగితో చేసే పికిల్ తిన్నారా? తినకపోతే ఇప్పుడు దాని రెసిపీ గురించి తెలుసుకోండి.
ముల్లంగి కొంచెం కారంగా, ఘాటు రుచిని, వాసనను కలిగి ఉంటుంది. దీనితో పికిల్ చేసుకుంటే దాని రుచి ఎంత నాటుగా ఉంటుందో ఊహించుకోండి. ఇందులో క్యారెట్ కూడా కలిపి ఊరగాయ చేసుకోవచ్చు. ముల్లంగి, క్యారెట్లలలో అనేక పోషకాలు ఉంటాయి, ఈ చలికాలంలో వీటిని ఎక్కువగా తింటారు కూడా. మరి మీరు వీటితో పికిల్ చేసుకోవాలనుకుంటే, ముల్లంగి పికిల్ రెసిపీ ఇక్కడ ఉంది చూడండి, ఇచ్చిన సూచనల ఆధారంగా మీరు కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు.
Radish Pickle Recipe కోసం కావలసినవి
- ముల్లంగి ముక్కలు - 2 కప్పులు
- క్యారెట్ ముక్కలు 2 కప్పులు,
- పచ్చిమిర్చి - 2
- వెల్లుల్లి - 4
- అల్లం - 1/2 tsp
- కారం పొడి - 1 టేబుల్ స్పూన్
- పసుపు - 1/2 tsp
- ఎండు యాలకుల పొడి - 1/2 tsp
- వెనిగర్ - 3 టేబుల్ స్పూన్లు
- కలోంజి - 1/2 tsp
- ఇంగువ - 1 చిటికెడు
- ఆవాల నూనె - 1/4 కప్పు
- ఉప్పు - రుచి ప్రకారం
- మెంతులు - 1/2 tsp
- జీలకర్ర - 1 tsp
- వాము - 1/4 tsp
- సోంఫు విత్తనాలు - 1/2 tsp
- ధనియాలు - 1 tsp
ముల్లంగి ఊరగాయ తయారీ విధానం
- ఊరగాయ కోసం ముల్లంగిని, క్యారెట్లను నిలువుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి.
- ముందుగా పాన్ వేడి చేసి అందులో జీలకర్ర, ధనియాలు, శొంఠి, వాము, మెంతులు వేసి తక్కువ మంట మీద వేడిచేయాలి. మసాలా వాసన వచ్చే వరకు వేయించాలి. ఆపై స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. అనంతరం వీటిని మిక్సీలో వేసి ముతకగా రుబ్బుకోవాలి.
- ఇప్పుడు పాన్‌లో ఆవాల నూనె వేసి మీడియం మంట మీద వేడి చేయాలి.
- నూనె వేడయ్యాక సోంఫు, చిటికెడు ఇంగువ వేసి వేయించండి, ఆపైన అల్లం, వెల్లుల్లి, మిర్చి వేసి వేయించాలి.
- ఇప్పుడు ముల్లంగి, క్యారెట్లను వేసి వాటిని బాగా కలపాలి. అవి మృదువుగా మారే వరకు 1 నిమిషం ఉడికించాలి.
- ఇప్పుడు, గ్రైండ్ చేసుకున్న మసాలా పొడిని వేయండి, ఆపైన కారం పొడి, పసుపు, ఎండు యాలకుల పొడి, రుచి ప్రకారం ఉప్పు వేసి మరొక నిమిషం ఉడికించాలి.
- చివరగా స్టవ్ ఆఫ్ చేసి, సిద్ధమైన ఊరగాయకు వెనిగర్ వేసి, ప్రతిదీ బాగా కలపండి. ఈ వెనిగర్ ఊరగాయకు పుల్లని రుచిని అందిస్తుంది.
అంతే ముల్లంగి పికిల్ రెడీ, వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అదిరిపోతుంది.