Stairs Climbing: ప్రతిరోజూ అరగంట పాటు మెట్లు ఎక్కుతూ, దిగుతూ ఉండండి చాలు, ఈ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది
22 February 2024, 5:30 IST
- Stairs Climbing: మెట్లు ఎక్కుతూ, దిగుతూ ఉండటం వల్ల బరువు తగ్గుతారని తెలుసు. కానీ కొన్ని రకాల క్యాన్సర్లను అడ్డుకునే శక్తి మెట్లు ఎక్కే వ్యాయామానికి ఉంది.
మెట్లు ఎక్కి దిగితే ఎన్ని ఉపయోగాలో
Stairs Climbing: ఇప్పుడు కాలం మారిపోయింది. ఒకటో ఫ్లోర్‌కి వెళ్ళాలన్నా కూడా లిఫ్ట్ మీదే వెళ్తున్నారు. కానీ మెట్లు ఎక్కేందుకు ఇష్టపడడం లేదు. నిజానికి మెట్లు ఎక్కడం, దిగడం అనేది శరీరానికి ఎంతో మేలు చేసే వ్యాయామం. ప్రతిరోజూ అరగంట పాటు మెట్లు ఎక్కుతూ, దిగుతూ ఉండండి. దాన్ని ఒక వ్యాయామంలాగా చేయండి. ఇలా చేయడం వల్ల మీకు కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. అంతేకాదు మెట్లు ఎక్కుతూ, దిగుతూ ఉండడం వల్ల కండరాలకు మంచి వ్యాయామం అవుతుంది. అవి గట్టిగా, ఫిట్ గా మారుతాయి.
ఎవరైతే ప్రతిరోజూ మెట్లు ఎక్కుతూ, దిగుతూ ఉంటారో... వారిలో తొమ్మిది రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని స్వీడన్లో జరిగిన ఒక అధ్యయనం చెబుతోంది. ఈ అధ్యయనంలో భాగంగా 16 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉన్న యువతను పరిగణలోకి తీసుకున్నారు. వారిని ప్రతిరోజూ మెట్లు ఎక్కుతూ, దిగుతూ ఉండమని సూచించారు. ఎవరైతే అలా చేస్తూ ఉన్నారో... వారిలో కాలేయం, పేగు, మూత్రపిండాలు, పొట్ట, క్లోమం, గొంతు, మెడ, ఊపిరితిత్తులు, గుండె వంటి భాగాల్లో క్యాన్సర్ కణితులు పెరిగే అవకాశం చాలా తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. కాబట్టి క్యాన్సర్‌ను అడ్డుకునే శక్తి మెట్లు ఎక్కే వ్యాయామానికి ఉంది. ప్రతిరోజూ మెట్లు ఎక్కడానికి ప్రయత్నించండి.
లిఫ్టు వాడే కన్నా ప్రతిరోజూ మెట్లు ఎక్కుతూ, దిగుతూ ఉండడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు. ఇది క్యాలరీలు బర్న్ చేస్తుంది. అదనపు కిలోలను తగ్గిస్తుంది. అది అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు ప్రతిరోజూ మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉండడం వల్ల వారిలో రక్త పోటు పెరుగుదల చాలావరకు మందగిస్తుంది.
మెట్లు ఎక్కడం వల్ల మీ కండరాలు బలంగా మారుతాయి. కండరాల దగ్గర చేరిన అధిక కొవ్వును ఇది కాల్చేస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈ వ్యాయామం ఎంతో ఉపయోగపడుతుంది. వ్యాయామం చేయడం వల్ల మానసిక శ్రేయస్సు పెరుగుతుందని మీరు వినే ఉంటారు. మెట్లు ఎక్కడం కూడా దీనికి మినహాయింపు ఏమీ కాదు. ఇది మీకు మంచి నిద్ర పట్టేలా చేస్తుంది. మెట్లు ఎక్కడం అనేది శక్తిని కరిగించే వ్యాయామమే కాదు, మీ జీవశక్తిని పెంచే మార్గం కూడా. ప్రతిరోజూ మెట్లు ఎక్కే వారిలో అర్ధాంతరంగా మరణించి అవకాశం తక్కువగా ఉంటుంది. అకాల మరణాలు అంటే కొన్ని ఆరోగ్య పరిస్థితుల రీత్యా సంభవించే మరణాల నుంచి మీరు బయటపడతారు. కాబట్టి ప్రతిరోజు లిఫ్ట్ వాడే కన్నా మెట్లు ఎక్కడం, దిగడం అలవాటుగా మార్చుకోండి.