తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Vinesh Phogat: ఒక్క రాత్రిలో రెండు కిలోల బరువు తగ్గిన వినేష్ ఫోగట్, ఎలా తగ్గిందో తెలిస్తే షాక్ అవుతారు

Vinesh Phogat: ఒక్క రాత్రిలో రెండు కిలోల బరువు తగ్గిన వినేష్ ఫోగట్, ఎలా తగ్గిందో తెలిస్తే షాక్ అవుతారు

Haritha Chappa HT Telugu

08 August 2024, 9:00 IST

google News
    • Vinesh Phogat: వినేష్ ఫోగట్ పారిస్ ఒలింపిక్స్ నుంచి బయటికి రావడం భారతదేశంలో క్రీడాభిమానులకు ఎంతో నిరాశ కలిగించింది. కానీ వినేష్ ఫోగట్ ఒలింపిక్స్ లో పోరాడేందుకు ఎంతో కష్టపడింది. కేవలం ఒక్క రాత్రిలోనే ఆమెను నరకాన్ని చూసింది.
వినేష్ ఫోగట్
వినేష్ ఫోగట్ (Instagram)

వినేష్ ఫోగట్

Vinesh Phogat: వినేష్ ఫోగట్ పారిస్ ఒలింపిక్స్ లో రెజ్లింగ్ పోటీలో పాల్గొంది. ఆమె మహిళల విభాగంలో 50 కేజీల ఫ్రీ స్టైల్ ఈవెంట్లో పోటీ పడింది. కేవలం 150 గ్రాముల బరువు అధికంగా ఉందనే కారణంగా ఆమెను ఒలింపిక్స్ నిర్వహకులు పోటీ నుంచి తప్పించారు. అలా పోటీ నుంచి తప్పించకపోతే ఆమె మన దేశానికి స్వర్ణ పతకాన్ని తెచ్చే అవకాశం ఉంది.

అసలు ఏం జరిగింది?

అంతర్జాతీయ నిబంధనలు చెబుతున్న ప్రకారం ఒలింపిక్స్ పోటీలో పాల్గొనే రెజ్లర్ల బరువును ప్రతిరోజూ తనిఖీ చేస్తూ ఉంటారు. 50 కిలోల విభాగంలో వినేష్ ఫోగట్ పోటీపడింది. ఆమె ప్రస్తుతం ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్‌కు వెళ్లే ముందు ఆమె బరువును మరొకసారి చూశారు ఒలింపిక్స్ నిర్వాహకులు. ఆమె 50 కిలోల కన్నా రెండు కిలోలు అదనంగా బరువు పెరిగినట్టు గుర్తించారు. అంటే 52 కిలో బరువు ఆమె పెరిగినట్టు గుర్తించారు. దీంతో వినేష్ ఫోగట్ ఆ రాత్రి రెండు కిలోల బరువు తగ్గేందుకు ప్రయత్నించింది. ఇందుకోసం ఆమె నరకాన్ని చూసింది. బరువు తగ్గేందుకు రాత్రంతా జాగింగ్ స్కిప్పింగ్, సైకిల్ తొక్కడం, ఆవిరి స్నానాలు చేయడం వంటివి చేస్తూనే ఉంది. ఆ రాత్రి ఆమె నిద్రపోలేదు కూడా. ఆహారము, నీరు వంటివి తీసుకోలేదు. జుట్టును కత్తిరించుకుంది. గోళ్లు కూడా కత్తిరించుకుంది. తన డ్రెస్‌ను మరింత పొట్టిగా మార్చుకుంది. చివరికి తన శరీరం నుంచి రక్తాన్ని కూడా కొంతవరకు తీయించుకుంది. ఇన్ని చేసినా ఆమె 150 గ్రాముల బరువు అదనంగా ఉన్నట్టు మరుసటి రోజు ఉదయం గుర్తించారు. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఉండాల్సిన బరువు కన్నా మరొక 100 గ్రాముల వరకు అనుమతిస్తారు. కానీ వినేష్ ఫోగట్ మరో 50 గ్రాములు బరువు ఎక్కువగా ఉండడం వల్ల ఫైనల్ పోటీల నుంచి ఆమెను తొలగించారు. దీంతో ఒక్కసారిగా క్రీడాలోకం షాక్‌కు గురైంది.

రాత్రికి రాత్రి ఇలా రెండు కిలోల బరువు తగ్గడం అనేది ఆమె ఆరోగ్యానికి కూడా ఏమాత్రం మంచిది కాదు. నిజానికి అది అసాధ్యమైన పని కూడా. అయినా కూడా ఆమె పట్టుదలతో తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా బరువు తగ్గేందుకు ప్రయత్నించింది. అంతకుముందు ఆమె 56 కిలోల బరువు ఉండేది. ఆరోగ్య సమస్యలు, కరోనా సోకడం వంటి వాటి వల్ల ఆమె బరువు తగ్గి 50 కిలోల విభాగంలో పోటీ పడింది.

ఇలా రాత్రికి రాత్రే ఫైనల్ కోసం బరువు తగ్గేందుకు ప్రయత్నించడంతో ఆమె ఆరోగ్యం పై తీవ్రంగా ప్రభావం పడినట్టు వైద్యులు చెబుతున్నారు. తీవ్రమైన డీహైడ్రేషన్ సమస్యతో పారిస్ ఆసుపత్రిలో ఆమె చేరారు. సెమీఫైనల్ లో గెలిచిన వినేష్ రజిత పతకాన్ని అయినా తీసుకొస్తారని అనుకున్నారు అంతా. కానీ ఖాళీ చేతులతోనే ఆమె తిరిగి వచ్చే పరిస్థితి వచ్చింది.

బరువు తగ్గడం కోసం ఆమె ఎంచుకున్న విధానాలు మాత్రం ఆమె ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు వైద్య నిపుణులు. బరువు తగ్గేందుకు ఒక రాత్రంతా నిద్రపోకుండా వ్యాయామాలు చేయడం, శరీరం నుంచి రక్తాన్ని తీయడం అనేది ఆమె దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయని వివరిస్తున్నారు.

బరువు తగ్గేందుకు ఆరోగ్యకరమైన పద్ధతులను మాత్రమే పాటించాలి. అనుకోని పరిస్థితుల వల్ల వినేష్ అలా చేయాల్సి వచ్చింది కానీ బరువు తగ్గాలనుకునే వారు అలా ఒక్క రాత్రిలో లేదా ఒక్క రోజులో బరువు తగ్గేందుకు ఎప్పుడూ ప్రయత్నించకండి. కనీసం నెలరోజుల నుంచి మూడు నెలల వరకు టార్గెట్ పెట్టుకొని... నెలకు రెండు కిలోల చొప్పున తగ్గుతూ ఉంటే ఆరోగ్యానికి మంచిది. హఠాత్తుగా బరువు తగ్గడం అనేది కూడా అనారోగ్యానికి సూచన.

తదుపరి వ్యాసం