Vegetable Dosa : గోధుమ పిండితో కూరగాయల దోసె.. చూసేయండి కొత్త రుచి
08 April 2024, 6:30 IST
- Vegetable Dosa : దోసె అనేది కచ్చితంగా అందరి ఇళ్లలో చేసే బ్రేక్ ఫాస్ట్. అయితే దీనిని ఎప్పుడూ ఒకేలాగా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేయండి. అందుకోసం గోధుమ పిండి, కూరగాయతో దోసె తయారు చేయండి.
దోసె తయారీ విధానం
ఉదయం ఇడ్లీ, దోసె చేసేందుకు పిండి లేదా? మీ ఇంట్లో గోధుమ పిండి ఉందా? ఆ గోధుమ పిండితో దోసె చేయండి. గోధుమ దోసెను మామూలుగా కాకుండా, బంగాళదుంపలు, క్యారెట్ వంటి కూరగాయలను వేసి చేయండి. ఇది కొత్త రుచిని అందిస్తుంది. పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. ఈ దోసె చేసందుకు టైమ్ కూడా ఎక్కువగా పట్టదు. ఈ దోసె మంచి రుచిని ఇస్తుంది. మరింత పోషకమైనదిగా ఉంటుంది. కొబ్బరి చట్నీతో కలిపి తింటే ఈ దోసె చాలా రుచిగా ఉంటుంది.
గోధుమ పిండి వెజిటబుల్ దోస ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? కింద ఈ రెసిపీకి సంబంధించిన పద్ధతి ఉంది. ఈజీగా ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.
దోసె తయారీకి కావాల్సిన పదార్థాలు
బంగాళదుంప - 1 (తురిమినది), గోధుమ పిండి - 1 కప్పు, రవ్వ- 1/4 కప్పు, ఉప్పు - రుచి ప్రకారం, క్యారెట్ - 1 (తురుము), ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినవి), కరివేపాకు - కొద్దిగా (సన్నగా తరిగినవి), కొత్తిమీర - కొద్దిగా (సన్నగా తరిగినవి), పచ్చిమిర్చి – 1 (సన్నగా తరిగినవి), మిరియాలు – 1 tsp, జీలకర్ర – 1/2 tsp, నూనె – అవసరమైనంత
దోసె తయారీ విధానం
ముందుగా ఒక గిన్నెలో తురిమిన బంగాళదుంపలు, గోధుమపిండి, రవ్వ, రుచికి సరిపడా ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉండలు లేకుండా నీళ్లలా కలపాలి.
తర్వాత మూతపెట్టి 20 నిమిషాలు నానబెట్టాలి. అందులో తురిమిన క్యారెట్, ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, మిరియాలు, జీలకర్ర వేసి, దోస పిండి చేసుకోవాలి.
పిండి చిక్కగా ఉంటే అవసరమైన నీరు కలపండి.
తర్వాత ఓ నాన్ స్టిక్ దోసె రాయిని పొయ్యి మీద పెట్టి రాయి వేడి అయ్యాక అందులో కలిపిన పిండిని పోయాలి.
తర్వాత చెంచాతో రుద్దకండి. లేకపోతే దోసె బాగా ఉండదు. తర్వాత నూనె వేసి బంగారు రంగు వచ్చేవరకు ఉడికించాలి.
గోధుమపిండి వెజిటబుల్ దోసె రెడీ. ఈ దోసెను తిప్పి ఉడకబెట్టాల్సిన పనిలేదు. కొబ్బరి చట్నీతో కలిపి లాగించేయండి.