Veg Frankie Recipe । వెజిటెబుల్ ఫ్రాంకీ.. ఈజీగా ఇలా చేసుకోండి, వెళ్తూ వెళ్తూ తినేయండి!
03 November 2022, 18:49 IST
- ఇలా వివిధ రకాల కూరగాయలను కలిపేసి రోల్ చేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. బ్రేక్ టైంలో, ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఈ రోల్ మంచి ఆప్షన్. Veg Frankie Recipe ఇక్కడ ఉంది చూడండి.
Veg Frankie Recipe
కొద్దిగా ఆకలి ఉన్నప్పుడు సౌకర్యంగా తినగలిగే అల్పాహారం తినాలనుకుంటే రోల్స్ తయారు చేయవచ్చు. ఇండియన్ స్ట్రీట్ ఫుడ్‌లో రోల్స్ చాలా మంది ఇష్టంగా తింటారు. వీటిని మనకు నచ్చిన కూరగాయలు లేదా గుడ్లు లేదా మాంసాహారం ఉపయోగించి చేయవచ్చు. బ్రేక్ టైమ్ లో తినడానికి, ట్రావెల్ చేస్తున్నప్పుడు అలాగే ఉదయం, సాయంత్రం వేళ అల్పాహారంగా వీటిని తినవచ్చు. పరోటాలో మనకు నచ్చిన పదార్థాన్ని స్టఫ్ చేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది, ఆకలి కూడా తీరుతుంది.
మీరు ఆరోగ్యకరమైన వెజిటెబుల్ పరాఠా రోల్ చేయాలనుకుంటే ఇక్కడ ఒక రెసిపీని అందిస్తున్నాము. గోధుమ పరాఠాలో క్యాబేజీ, క్యారెట్, ఆలూ, పచ్చిబఠానీలను మసాలా దినుసులతో కలిపి చేసే ఈ వెజిటెబుల్ ఫ్రాంకీ ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది. పిల్లలకు లంచ్ బాక్సులో లేదా డిన్నర్ వేళ అందిస్తే వారికిది మంచి పోషకాహారంగా ఉంటుంది. మరి ఈ వెజ్ ఫ్రాంకీ ఎలా తయారు చేయాలి, కావాలసిన పదార్థాలు ఇక్కడ చూడండి. వెజ్ ఫ్రాంకీ రెసిపీ ఈ కింద ఉంది.
Veg Frankie Recipe కోసం కావలసినవి
- 2 హోల్ వీట్ పరాఠాలు
- 1 ఉల్లిపాయ
- 2 కప్పుల క్యాబేజీ తురుము
- 1 కప్పు క్యారెట్ తురుము
- 1/2 కప్పు పచ్చి బఠానీలు
- 3/4 కప్పు బంగాళదుంపలు
- 1/2 క్యాప్సికమ్ ముక్కలు
- 1 కప్పు టమోటా ముక్కలు
- 1 అంగుళం అల్లం
- 1 పచ్చి మిర్చి
- కొత్తిమీర
- 2 టేబుల్ స్పూన్లు నూనె
- 1 టీస్పూన్ జీలకర్ర
- 1/2 టీస్పూన్ ఉప్పు
- 1/2 టీస్పూన్ గరం మసాలా పొడి
వెజ్ ఫ్రాంకీ రెసిపీ- ఎలా తయారు చేయాలి
- ముందుగా కాల్చిన పరాఠాలను సిద్ధం చేసుకోండి. మరోవైపు బంగాళాదుంపలను సుమారు 4 విజిల్ వరకు ఉడికించి, వాటిని పూర్తిగా మెత్తగా చేయాలి.
- ఇప్పుడు పాన్‌లో ఒక టీస్పూన్ నూనెను వేడి చేయండి. ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, అల్లం, క్యారెట్, బఠానీలు వేసి కొద్దిగా ఉప్పు చల్లి మీడియం వేడి మీద వేయించాలి.
- క్యారెట్ ఉడికిన తర్వాత తరిగిన క్యాబేజీ, టొమాటో, క్యాప్సికమ్ ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి.
- ఇప్పుడు మసాలా పొడులు, మెత్తగా చేసిన బంగాళాదుంపలను కడాయిలో కలపండి. మసాలాను రుచికి అనుగుణంగా సర్దుబాటు చేయండి. స్టఫ్ రెడీ అయినట్లే.
- తదుపరి దశ రోల్ చుట్టడం. హోల్ వీట్ పరాఠా మధ్యలో వేయించిన కూరగాయలను ఫిల్ చేయండి.
- ఇప్పుడు పరాఠాను ఒక వైపు నుండి మడతపెడుతూ రోలింగ్ చేయడం ప్రారంభించండి.
అంతే, వెజిటెబుల్ ఫ్రాంకీ రెడీ అయినట్లే, ఒక చివరన పట్టుకొని కసబిసా నమిలేయండి.