Healthy oil: ఈ ఒక్క నూనె.. క్యాన్సర్, గుండె జబ్బుల నుంచి రక్షిస్తుంది
13 October 2024, 12:30 IST
Healthy oil: అవిసె గింజల నూనెలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి. దీన్ని రోజూ వారీ డైట్ లో చేర్చుకోవాలనుకుంటే సరైన మార్గం ఏంటో తెలుసుకోండి.
గుండె, క్యాన్సర్ నుంచి కాపాడే నూనె
ఈ నూనె వాడతారని, ఈ నూనె ఉంటుందని కూడా చాలా మందికి తెలీదు. కానీ ఈ ఒక్క నూనెను రోజూవారీ ఆహారంలో చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కొన్ని చోట్ల బిడ్డను ప్రసవించిన తర్వాత బాలింతలకు ఈ నూనెను ఇస్తారు. అన్ని పోషకాలున్న నూనె ఇది. రోజూ పచ్చిగా ఈ నూనె ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, గుండె ఆరోగ్యం నుండి డయాబెటిస్ వరకు తగ్గించుకోవాలనుకుంటే కచ్చితంగా మీ ఆహారంలో అవిసె గింజల నూనెను చేర్చుకోండి. ఇది శరీరానికి అవసరమైన ఖనిజాలను, పోషణను ఇవ్వడమే కాకుండా అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
ఈ నూనెను ఎలా వాడాలి? ఆహారంలో ఎలా చేర్చుకోవాలి? దీని ప్రయోజనాలేంటో చూడండి.
అవిసె గింజల నూనె:
అవిసె గింజల నూనెలో ఆల్ఫా లినోలెయిక్ ఆమ్లం ఉంటుంది. ఇది ఒక రకమైన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్. ఈ నూనెను తినడం వల్ల డోకోసాహెక్సేనోయిక్ ఆమ్లం, ఐకోసాపెంటెనోయిక్ ఆమ్లంగా మారుతుంది. ఇది శారీరక, మానసిక ఆరోగ్యానికి అవసరం. అదనంగా, అవిసె గింజల నూనెలో ఒలేయిక్, పాల్మిటిక్, లినోలెయిక్ మరియు లిగ్నన్లు కూడా ఉంటాయి.
అవిసెగింజల నూనె ఉపయోగాలు:
- ముడతలు లేని చర్మం కావాలంటే ఈ రోజు నుండి ఈ నూనెను డైట్ లో చేర్చుకోవడం ప్రారంభించండి. నూనెలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వృద్ధాప్యం వల్ల ముడతలు, సన్నని గీతలను తగ్గించి చర్మం ముడతలు లేకుండా చేస్తుంది.
- ఈ ఆయిల్ లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరాన్ని కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి రక్షిస్తాయని పరిశోధనలో తేలింది. ఈ కొవ్వు ఆమ్లాలు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తాయి.
- గుండె ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకూడదనుకుంటే, మీరు అవిసె గింజల నూనెను ఆహారంలో చేర్చవచ్చు. ఇది రక్త నాళాల్లో ఇన్ఫ్లమేషన్ తగ్గించడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
- ఆహారంలో అవిసె గింజల నూనెను ఉపయోగించడం ఇన్సులిన్ నిరోధకత మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ప్రయోజనకరంగా ఉంటుంది.
- ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ కడుపును శుద్ధి చేసేందుకు పనిచేస్తుంది. ఇది మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. అవిసె గింజల నూనెను రోజూ ఉపయోగించడం వల్ల ప్రేగు కదలిక మెరుగుపడుతుందని పరిశోధనలో తేలింది
అవిసెగింజల నూనె వాడకం:
అవిసె గింజలు నూనెను వాడటానికి అనేక మార్గాలున్నాయి. సలాడ్ డ్రెస్సింగ్స్, డిప్స్, చట్నీల్లో, స్మూతీల్లో దీన్ని వాడొచ్చు. అలాగా అవిసెగింజల లడ్డూలో ఈ నూనె కలిపి బాలింతలకు పెడతారు. ఇది రుచిగా తినడానికి మంచి మార్గం.
అయితే ఈ నూనెను పచ్చిగా వాడితేనే ఈ ప్రయోజనాలు పొందొచ్చు. దీని స్మోకింగ్ పాయింట్ తక్కువగా ఉంటుంది. కాబట్టి వేడి చేస్తే హానికర సమ్మేళనాలు ఏర్పడతాయి.
టాపిక్