Egg Recipe: ఉల్లికారం వేసి కోడిగుడ్డు వేపుడు చేయండి, రుచి అదిరిపోతుంది
26 March 2024, 11:30 IST
- Egg Recipe: కోడిగుడ్డుతో చేసిన వంటకాలు చాలా టేస్టీగా ఉంటాయి. అలాంటి వారి కోసమే ఈ ఉల్లికారం కోడిగుడ్డు ఫ్రై రెసిపీ. దీన్ని చేయడం చాలా సులువు.
ఉల్లికారం కోడిగుడ్డు వేపుడు రెసిపీ
Egg Recipe: నాన్ వెజ్ ప్రియులకు ఇష్టమైన వాటిలో కోడిగుడ్డు ఒకటి. దీంతో రకరకాల వంటకాలు వండుకోవచ్చు. ఎప్పుడూ ఒకేలా వండే కన్నా ఉల్లికారం వేసి ఓసారి కోడుగుడ్డు ఫ్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలో కలుపుకుంటే రుచి అదిరిపోతుంది. దీన్ని చేయడం కూడా చాలా సులువు. ముఖ్యంగా పిల్లలకు ఇది బాగా నచ్చుతుంది. స్పైసీగా తినేవారు కారం అధికంగా వేసి చేసుకుంటే రుచి అదిరిపోతుంది. ఉల్లికారంతో కోడి గుడ్డు ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
ఉల్లికారం కోడిగుడ్డు వేపుడు రెసిపీ
గుడ్లు - నాలుగు
కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు
గరం మసాలా - పావు స్పూను
పసుపు - పావు స్పూను
కరివేపాకులు - గుప్పెడు
ఉల్లిపాయలు - మూడు
వెల్లుల్లి రెబ్బలు - ఏడు
కారం - మూడు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
జీలకర్ర - అర స్పూను
నూనె - తగినంత
ఉల్లికారం కోడిగుడ్డు వేపుడు రెసిపీ
1. కోడిగుడ్లను ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.
2. ఉల్లిపాయలు కోసి మిక్సీలో వేయాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు, కారం, ఉప్పు కూడా వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. అందులో జీలకర్ర వేసి వేయించుకోవాలి. తర్వాత కరివేపాకులు వేసి వేయించాలి.
4. ఈ రెండు వేగాక మిక్సీలో రుబ్బుకున్న ఉల్లిపాయ కారాన్ని వేసి వేయించుకోవాలి.
5. నూనె పైకి తేలే వరకు ఉంచాలి. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, పసుపు వేసి వేయించుకోవాలి.
6. ఇప్పుడు కోడిగుడ్లకు చిన్న గాట్లు పెట్టి ఈ మిశ్రమంలో వేయాలి.
7. మంటను తగ్గించి పైన మూత పెట్టి పావుగంట సేపు ఉడకనివ్వాలి.
8. మధ్య మధ్యలో కూర కలుపుతూ ఉండాలి. చిన్న మంట మీద ఉడికిస్తే ఈ వేపుడు చాలా టేస్టీగా ఉంటుంది.
9. పైన కొత్తిమీర తరుగు జల్లుకొని స్టవ్ కట్టేయాలి. అంతే ఉల్లికారంతో చేసిన కోడిగుడ్డు వేపుడు రుచి అదిరిపోతుంది.
10. ఒక్కసారి చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ముఖ్యంగా పప్పు వండుకున్నప్పుడు లేదా సాంబార్ వండుకున్నప్పుడు సైడ్ డిష్ గా ఉల్లికారం కోడిగుడ్డు వేపుడు చేసుకుంటే రుచి అదిరిపోతుంది. ఇందులో మనం ఆరోగ్యానికి అవసరమైనవే వినియోగించాము. కాబట్టి దీన్ని తినడం వల్ల అన్ని రకాలగా మంచే జరుగుతుంది.
ఎవరైతే స్పైసీగా ఇష్టపడతారో వారు కారాన్ని మరికొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. కోడిగుడ్డులో మన శరీరానికి అవసరమైన ఐరన్, జింక్, విటమిన్ ఇ, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రోటీన్‌తో నిండి ఉంటుంది. గుడ్డులో ఉండే ప్రోటీన్లు మన శరీరానికి చాలా అవసరమైనది. ప్రతి రోజు ఒక కోడిగుడ్డు తినమని వైద్యులు సూచిస్తూ ఉంటారు. గుడ్డు పచ్చసొనలో విటమిన్ డి ఉంటుంది. విటమిన్ డి మన ఆరోగ్యానికి ఎంతో అవసరం. ముఖ్యంగా ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడానికి గుడ్లను తినాల్సిందే. వారానికి కనీసం నాలుగు గుడ్లు ప్రతి ఒక్కరూ తినాలి. ముఖ్యంగా అల్పాహారంలో కోడి గుడ్డును తినడం వల్ల బరువు పెరిగే అవకాశాన్ని తగ్గించుకుంటారు. అలాగే మహిళలు కోడిగుడ్డులోని తెల్ల సొనను తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ బారిన పడకుండా అడ్డుకోవచ్చు. అలాగే గుండె సంబంధిత వ్యాధులు, స్ట్రోక్ వంటివి రాకుండా కోడిగుడ్డు అడ్డుకుంటుంది. దీనిలో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి. గర్భిణులు కచ్చితంగా తినాల్సిన వాటిలో కోడిగుడ్లు ఒకటి. కంటి ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. కోడిగుడ్లు తరచూ తినేవారిలో చర్మం మెరిసిపోతూ ఉంటుంది.
టాపిక్