తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ulavacharu: ఉలవచారును ఇలా చేసుకున్నారంటే శరీరానికి ఎంతో శక్తి, వారానికి ఒక్కసారైనా తినండి

Ulavacharu: ఉలవచారును ఇలా చేసుకున్నారంటే శరీరానికి ఎంతో శక్తి, వారానికి ఒక్కసారైనా తినండి

Haritha Chappa HT Telugu

28 June 2024, 11:35 IST

google News
    • Ulavacharu: ఉలవచారు ఒకప్పటి వంటకం. ఇప్పుడు దీన్ని తినేవారి సంఖ్య తగ్గిపోయింది. ఉలవచారును ఎలా చేసుకోవాలో కూడా కొంతమందికే తెలియదు. అందుకే రెసిమీ ఇక్కడ ఇచ్చాము.
ఉలవచారు రెసిపీ
ఉలవచారు రెసిపీ

ఉలవచారు రెసిపీ

Ulavacharu: ఉలవచారు రుచి తెలిసిన వారు దాన్ని తినకుండా ఆగలేరు. ఇప్పటికీ గ్రామాల్లో ఉలవచారును చాలా ఇష్టంగా చేసుకొని తింటారు. కానీ నేటి యువతలో ఉలవలు, ఉలవచారు వంటి వాటి గురించి ఏమీ తెలియదు. నిజానికి ఉలవచారును తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వారానికి ఒక్కసారైనా ఉలవచారును తింటే శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. ఇది రుచిగా ఉంటుంది. వారానికోసారి సాంబార్ చేసుకున్నట్టే ఉలవచారును కూడా చేసుకోవడం అలవాటు చేసుకోండి.

ఉలవచారు రెసిపీకి కావలసిన పదార్థాలు

ఉలవలు - ఒక కప్పు

నీళ్లు - రెండు లీటర్లు

జీలకర్ర - అర స్పూను

మెంతి గింజలు - అర స్పూను

నూనె - నాలుగు స్పూన్లు

ఆవాలు - ఒక స్పూను

కరివేపాకులు - గుప్పెడు

ఇంగువ - చిటికెడు

వెల్లుల్లి - ఐదు రెబ్బలు

ఎండుమిర్చి - రెండు

ఉల్లిపాయ - ఒకటి

పచ్చిమిర్చి - ఒకటి

బెల్లం - చిన్న ముక్క

చింతపండు - నిమ్మకాయ సైజులో

కారం - అర స్పూను

పసుపు - అర స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

ఉలవచారు రెసిపీ

1. ఉలవలను శుభ్రంగా కడిగి నీటిలో ఒక రాత్రంతా నానబెట్టాలి.

2. ఉలవలను కనీసం 6 నుంచి 7 సార్లు కడగాల్సి వస్తుంది. అప్పుడే అందులో ఉన్న మురికి పోతుంది.

3. రోజూ ఉదయం ఉలవలను కుక్కర్లో వేసి బాగా ఉడికించాలి. కనీసం ఐదారు విజిల్స్ వచ్చేవరకు ఉడికిస్తే అది మెత్తగా ఉడుకుతుంది.

4. ఉలవలను ఉడికించేటప్పుడు రెండు లీటర్ల నీటిని వేయడం చాలా అవసరం. ఎందుకంటే ఆ నీటితోనే ఉలవచారు చేస్తాము.

5. కుక్కర్లో ఉలవలు ఉడికిన తర్వాత వడకట్టి ఉలవ నీరును వేరు చేయాలి.

6. ఇప్పుడు ఉలవలను మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

7. స్టవ్ మీద కళాయి పెట్టి మెంతులు, జీలకర్ర వేసి వేయించుకొని వాటిని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.

8. ఇప్పుడు అదే కళాయిలో నూనె వేసి కరివేపాకులు, వెల్లుల్లి తరుగు, ఎండుమిర్చి, ఇంగువ వేసి వేయించాలి. ఆవాలు కూడా వేయాలి.

9. అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి రంగు మారేవరకు ఉడికించుకోవాలి.

10. చింతపండు నీళ్లలో నానబెట్టి చిక్కటి గుజ్జును తీసి దాన్ని కూడా అందులో వేసి ఉడికించుకోవాలి.

11. ఇందులోనే పసుపు, కారంపొడిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా పేస్ట్ చేసుకున్న ఉలవలను కూడా వేసి బాగా ఉడికించుకోవాలి.

12. ఇదంతా దగ్గరగా చిక్కగా అయ్యేవరకు ఉడికించాలి.

13. ఈ మిశ్రమంలోనే ముందుగా చేసి పెట్టుకున్న మెంతులు, జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి.

14. అందులో బెల్లం తురుము వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా ప్రెషర్ కుక్కర్లో ఉడికించుకున్న ఉలవ నీటి ఇందులో వేసి బాగా ఉడికించుకోవాలి.

15. అది చిక్కగా అయ్యేవరకు చిన్న మంట మీద ఉడికించాలి. మరొక స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

16. అందులో ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకులు వేసి చిటపటలాడించి ఉలవచారుపై తాళింపు వేసుకోవాలి.

17. అంతే టేస్టీ ఉలవచారు రెడీ అయిపోతుంది. దీన్ని వేడి వేడి అన్నంలో తింటే రుచిగా ఉంటుంది.

18. ఒక్కసారి చేసుకున్నారంటే దీని రుచి మీకు అర్థమవుతుంది. ప్రతి వారం ఈ ఉలవచారును తింటే శరీరానికి ఎంతో శక్తి అందుతుంది.

19. దీన్ని చేయడం చాలా సులువు. ఒక్కసారి చేస్తే మీకే అలవాటైపోతుంది.

కంటి ఆరోగ్యానికి ఉలవలు ఎంతో మేలు చేస్తాయి. కళ్ళు ఎర్రగా మారడం, నీరు కారడం, పుసులు కట్టడం వంటి సమస్యలను తగ్గిస్తాయి. అలాగే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా కూడా విలువలు కాపాడతాయి. జలుబు చేసినప్పుడు కఫం పట్టినప్పుడు ఉలవచారును తినడం వల్ల కఫాన్ని త్వరగా కరిగిస్తాయి. ఉలవలు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. డయాబెటిస్‌తో బాధపడేవారు ఉలవచారు తరచుగా తింటూ ఉండాలి.

టాపిక్

తదుపరి వ్యాసం