Tomato Nuvvula pachadi: టమాటా నువ్వుల పచ్చడి ఇలా చేశారంటే ఇంటిల్లిపాదికి నచ్చేస్తుంది, రెసిపీ వెరీ ఈజీ
19 March 2024, 11:30 IST
- Tomato Nuvvula pachadi: టమోటా పచ్చడి పేరు వింటేనే నోరూరిపోతుంది. వేడివేడి అన్నంలో టమోటా పచ్చడి వేసుకొని తింటే అ రుచే వేరు. టమోటో పచ్చడిలో నువ్వులు కూడా జత అయితే రుచి రెండింతలుగా మారుతుంది.
టమోటా నువ్వుల పచ్చడి
Tomato Nuvvula pachadi: టమోటోలు, నువ్వులు ఈ రెండూ కూడా మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. ఈ రెండింటినీ కలిపి చేసే టమోటో నువ్వుల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలోకి, చపాతీలోకి, దోశెలోకి కూడా తినవచ్చు. ఇడ్లీలకు కూడా జతగా రుచిగా ఉంటుంది. టమోటా నువ్వులు పచ్చడి తినడం వల్ల ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు అందుతాయి. దీన్ని చేయడం చాలా సులువు. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ మీరే ఇష్టంగా తింటారు. ఈ పచ్చడిని కచ్చితంగా వేడి వేడి అన్నంలో తిని చూడండి. దీని రుచి మీకు నచ్చుతుంది.
టమాటా నువ్వుల పచ్చడి రెసిపీకి కావలసిన పదార్థాలు
టమాటాలు - అర కిలో
నువ్వులు - మూడు స్పూన్లు
పచ్చిమిర్చి - ఎనిమిది
వెల్లుల్లి రెబ్బలు - ఐదు
కొత్తిమీర తరుగు - మూడు స్పూన్లు
ధనియాలు - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
కరివేపాకులు - గుప్పెడు
శనగపప్పు - అర స్పూను
జీలకర్ర - పావు స్పూను
నూనె - సరిపడినంత
పసుపు - చిటికెడు
టమోటో నువ్వుల పచ్చడి రెసిపీ
1. స్టవ్ మీద కళాయి పెట్టి పచ్చిమిర్చిని వేసి వేయించుకోవాలి.
2. పచ్చిమిర్చి తర్వాత ధనియాలు, వెల్లుల్లి, జీలకర్రను కూడా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత కొత్తిమీరను వేసి వేయించుకోవాలి. దాన్ని కూడా తీసి పక్కన పెట్టాలి.
4. చివరగా నువ్వులు వేసి ఒక 30 సెకండ్లు వేయించి వెంటనే తీసేయాలి. నువ్వులు మాడిపోతే రుచిగా ఉండవు.
5. ఇప్పుడు అదే కళాయిలో నూనె వేసి టమాటో ముక్కలు వేసి పైన ఉప్పు చల్లి మూత పెట్టాలి.
6. చిన్న మంట మీద ఉంచితే టమోటాలు బాగా మగ్గుతాయి.
7. టమాటాలు బాగా మగ్గాక మిక్సీ జార్లో ఈ టమాటాలు, వేయించిన పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, నువ్వులు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
8. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని తీసి ఒక గిన్నెలో వేయాలి.
9. దీనికి తాలింపు పెట్టేందుకు స్టవ్ మీద కళాయి పెట్టాలి.
10. ఒక స్పూన్ నూనె వేసి ఎండు మిర్చిని ముక్కలు చేసి వేయాలి.
11. శెనగపప్పు జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, రెండు వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు పసుపు వేసి ఫ్రై చేయాలి.
12. ఈ మిశ్రమాన్ని టమాటో పచ్చడి పై వేసుకోవాలి.
13. అంతే రుచికరమైన టమోటో నువ్వుల పచ్చడి రెడీ అయినట్టే.
14. దీన్ని తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.
15. ఫ్రిజ్లో పెట్టుకుంటే రెండు మూడు రోజులు తాజాగా ఉంటుంది. అంతకుమించి ఉంచకపోవడమే మంచిది.
16. దీనిలో వెల్లుల్లి, ధనియాలు, కొత్తిమీర, పచ్చి మిర్చి, టమోటో, నువ్వులు ఇవన్నీ వాడాము... ఇవి మన ఆరోగ్యానికి మేలు చేసేవే. ఈ పచ్చడి కేవలం అరగంటలో రెడీ అయిపోతుంది. ఇంటిల్లపాదికి కచ్చితంగా నచ్చుతుంది.
టమోటాలతో చేసిన ఆహారాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో ఉండే లైకోపీన్ మనల్ని కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయి. అలాగే నువ్వులు కూడా మహిళలకు అత్యవసరమైనవి. నువ్వులు తరచూ తినే మహిళల్లో నెలసరి సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే పిల్లలకు నువ్వులతో చేసిన ఆహారాలను తినిపించడం చాలా ముఖ్యం. వీటిలో కాల్షియం అధికంగా ఉంటుంది. కాబట్టి ఎముకలు, దంతాలకు మేలు జరుగుతుంది. వెల్లుల్లిలో రోగనిరోధక లక్షణాలు ఎక్కువ. కాబట్టి వెల్లుల్లిని ప్రతిరోజూ తినడం వల్ల శరీరానికి బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్ నుండి రక్షణ లభిస్తుంది. ఈ టమాటా నువ్వుల పచ్చడి అన్ని రకాల ఆరోగ్యానికి మేలు చేసేదే. దీని తయారు చేయడం చాలా సులువు. కాబట్టి వారానికి ఒక్కసారైనా చేసుకొని తినడం అలవాటు చేసుకోండి.
టాపిక్