Chanakya Niti On Money : జీవితంలో ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఈ విషయాలు ఫాలో అవ్వండి
04 June 2024, 8:00 IST
- Chanakya Niti In Telugu : చాణక్య నీతి ప్రకారం జీవితంలో డబ్బు చాలా ముఖ్యమైనది. అయితే దానిని సంపాదించడానికి మీరు సరైన పద్ధతులను ఫాలో కావాలి. అప్పుడే మీకు విజయం వస్తుంది.
చాణక్య నీతి
ఆచార్య చాణక్యుడు మౌర్య రాజవంశానికి రాజకీయ గురువు. చాణక్యుడు తత్వవేత్త, రాజకీయ నిపుణుడు, గొప్ప ఆర్థికవేత్త, నైతిక దౌత్యవేత్త. చాణక్యుడి నీతి సూత్రాలు జీవితంలో అనేక విధాలుగా ఉపయోగపడతాయి. చాణక్య నీతిని పాటిస్తే జీవితంలో ఈజీగా విజయం సాధించవచ్చు. గెలుపును చూడాలి అనుకునేవారు.. కచ్చితంగా చాణక్యుడి పాఠాలను ఫాలో కావాలి. అప్పుడే జీవితంలో విజయం సాధించేందుకు ఆస్కారం ఉంటుంది.
చాణక్యుడు తన చాణక్య నీతిలో జీవితం, వ్యాపారం, సామాజిక జీవితం, నీతి, ఆర్థిక శాస్త్రం, అనేక ఇతర విషయాల గురించి మాట్లాడాడు. చాణక్య నీతి బోధనలను అనుసరించడం ద్వారా వ్యక్తి జీవితం సంతోషంగా, విజయవంతమవుతుంది. సంతోషకరమైన, ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి డబ్బు చాలా అవసరం. జీవితంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాలంటే చాలా కష్టం. ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించడానికి చాణక్యుడి సలహాను పాటించాలి.
చాణక్యుడి ఆలోచనలు, సూత్రాలతో ఒక వ్యక్తి జీవితంలో అన్ని సవాళ్లను అధిగమించి విజయపథంలో పురోగమించగలడు. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడంలో సహాయపడే చాణక్యుడి సూత్రాలు ఏంటో తెలుసుకోవచ్చు.
అందరికీ డబ్బు ఇవ్వొద్దు
మీ డబ్బును అర్హులకు మాత్రమే ఇవ్వండి. అర్హత లేని వారికి డబ్బు ఇవ్వకూడదని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. మీరు ఎవరికి డబ్బు ఇచ్చినా, అది సద్వినియోగం అయ్యేలా చూసుకోవాలి. అలాగే మీ సంపద మీరు ఎలా నిర్వహించాలో క్లారిటీ ఉండాలి. అర్హత లేనివారికి డబ్బు ఇస్తే అది తిరిగి వస్తుందనే నమ్మకం లేదు.
ఖర్చులపై లెక్కలు
ఉద్యోగం ప్రారంభించడానికి ముందు మీరు కొన్ని విషయాలు మనసులో పెట్టుకోవాలి. ఎందుకంటే డబ్బును సంపాదించడం మాత్రమే కాదు.. దానిని ఎలా వాడుకోవాలి అని కూడా తెలిసి ఉండాలి. మీరు సంపాదించిన డబ్బులో ఇంటి ఖర్చుకు ఎంతో వెళ్తుంది.. మీ వ్యక్తిగత ఖర్చులకు ఎంత వెళ్తున్నాయని లెక్కలు వేసుకోవాలి. ప్రతీ నెలా కొంత సొమ్ము పొదుపు చేసుకోవాలి. ఎందుకంటే భవిష్యుత్తులో ఎలాంటి అవసరాలు ఉంటాయో తెలుసుకోవడం కష్టం.
పనికి భయపడొద్దు
ఒక పనిని ప్రారంభించిన తర్వాత దానిని ఎప్పుడూ ఆపకూడదు. అపజయం భయం మిమ్మల్ని ముంచెత్తనివ్వవద్దు. అపజయం భయం నుంచి బయటకు వస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. చిత్తశుద్ధితో పని చేసేవారే పనిని విజయవంతంగా పూర్తి చేయగలరని చాణక్యుడు చెప్పాడు. పనిలో విజయం సాధించకపోయినా మీకు అనుభవం అయినా వస్తుంది. అనుభవమే మీకు జీవిత పాఠాలు నేర్పిస్తుంది.
దురాశ వద్దు
ఏ విషయంలోనూ విపరీతమైన దురాశ ఉండకూడదు. ఎందుకంటే దురాశ ఉన్న వ్యక్తి జీవితంలో డబ్బు సంపాదించినా ఎక్కువ కాలం నిలవదు. వెంటనే అతి పోతుంది. అలాగే గర్వం కూడా తలకు ఎక్కకూడదు. నా దగ్గర డబ్బులు ఉన్నాయనే గర్వం మిమ్మల్ని ఏదో ఒక రోజు కింద పడేలా చేస్తుంది. దీని వల్ల జీవితంలో చాలా సమస్యలు ఎదురవుతాయని చాణక్యుడు చెప్పాడు.
సంపాదించే మార్గం
డబ్బు ఎల్లప్పుడూ సరైన మార్గంలో సంపాదించాలి. ఎందుకంటే అక్రమంగా సంపాదించిన డబ్బు కొద్ది కాలం మాత్రమే మీతో ఉంటుంది. తప్పుడు మార్గాల్లో సంపాదించిన డబ్బు జీవితంలో సమస్యలను తెస్తుంది. చాణక్యుడి ప్రకారం అనైతిక మార్గాల ద్వారా సంపాదించిన డబ్బు త్వరలో మీ చేతుల నుండి పోతుంది. అందుకే మంచి మార్గంలో డబ్బును సంపాదించాలి. అప్పుడే మీ దగ్గర అది ఎక్కువ రోజులు నిలుస్తుంది. వచ్చిన దాంట్లో దానం కూడా చేయాలి. లేనివారికి సాయం చేస్తే ఏదో విధంగా మీ దగ్గరకు డబ్బు వస్తుంది.